Suryaa.co.in

Andhra Pradesh

కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని పింఛన్‌ రద్దు చేసిన వైసీపీ సర్కారు!

– టీడీపీ గ్రీవెన్స్‌లో బోరుమన్న దివ్యాంగుడు
– గత ప్రభుత్వంలో జరిగిన భూ కబ్జాలపై బాధితులు ఫిర్యాదు
– 22ఏ నుండి తమ భూములు తొలగించాలంటూ వినతి
– అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నేతలు మంత్రి గొట్టిపాటి, ఎమ్మెల్సీ అశోక్ బాబు, సీడాప్‌ చైర్మన్ దీపక్ రెడ్డి

మంగళగిరి: టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ అశోక్ బాబు, సీడాప్‌ చైర్మన్ దీపక్ రెడ్డిలు అర్జీదారుల నుండి వినతులు స్వీకరించారు. వైసీపీ పాలనలో ఉద్దేశపూర్వకంగా తమ భూముల్ని 22ఏ జాబితాలో చేర్చడం, అధికారం అడ్డంపెట్టుకుని నాడు భూములను కబ్జా చేయడంపై బాధితులు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి వారి గోడు వెళ్లబోసుకుని, తమ సమస్యలు పరిష్కరించి ఆదుకోవాలని వేడుకున్నారు.

సత్యసాయి జిల్లా అమడగూరు మండలం జౌకుల కొత్తపల్లి గ్రామానికి చెందిన కె. రెడ్డప్ప విజ్ఞప్తి చేస్తూ.. తాము కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమిని 22ఏలో పడేశారని.. దయ చేసి తమ భూమిని 22ఏ నుండి తొలగించాలని వారు వేడుకున్నారు.

ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన గోపి కృష్ణ విజ్ఞప్తి చేస్తూ.. నూజివీడు గ్రామంలో తమ తండ్రి కొనుగోలు చేసిన భూమిని జగనన్న ఇళ్లకోసమని తీసుకొని 22ఏ లో పెట్టారని.. దాన్ని తొలగించి తమ భూమిని తమకు అప్పగించాలని నేతలకు విజ్ఞప్తి చేశారు.

ఉరుటి బానూజిరావు, కూనిశెట్టి భాస్కర్ రావు, కూని శెట్టి మోహన్ రావు, కనకల వెంకటరావులు ప్రభుత్వ పోరంబోకు వాగును ఆక్రమించారని దీనిపై అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని, విజయనగరం జిల్లా రామభద్రపు మండలం ఆరికతోట గ్రామానికి చెందిన పి. రాధాకృష్ణ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి చర్యలు తీసుకోవాలని కోరారు.

కృష్ణా జిల్లా ఘంటసాలకు చెందిన తుమ్మల వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేస్తూ.. గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉన్న పంచాయతీ స్థలాన్ని ఆక్రమించుకొని అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని.. దీనిపై విచారించి తప్పుడు రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని కోరాడు. అనంతపురం జిల్లా పుట్లూరు మండలానికి చెందిన టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి గరికపాటి సుదర్శన నాయుడు నేతలకు విజ్ఞప్తి చేస్తూ.. గండికోట నుండి పుట్లూరు వయా సుబ్బరాయ సాగర్ ఎత్తిపోతల పథకం ఆర్థిక శాఖ క్లియరెన్స్ లో ఉన్నదని.. ఈ పథకం పూర్తి అయితే దాదాపు 35 వేల ఎకరాలకు సాగునీరు రెండు మండలాల్లోని గ్రామాలకు తాగునీటి సమస్య తీరుతుందని త్వరగా నిధులు మంజూరు చేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

ప్రకాశం జిల్లా దోర్నాల మండలానికి చెందిన యేదల శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేస్తూ.. తాను గుంటూరు లోని మలబార్ సీడ్స్ ప్రయివేట్ లిమిటెడ్ వారి వద్ద నగదు చెల్లించి కొనుగోలు చేసిన విత్తనాలు నకిలివి అని తెలిసి తిరిగి విత్తనాలను వారికి పంపగా చెల్లించిన నగదుకు రెండు చెక్కులు ఇచ్చి డబ్బులు తీసుకొమని చెప్పారని.. బ్యాంకులో వేస్తే చెక్కులు బౌన్స్ అయ్యాయని.. మలబార్ సీడ్స్ వారిని వెళ్లి డబ్బులు అడిగితే ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని.. వారిపై చర్యలు తీసుకొని తమకు డబ్బులు ఇప్పించాలని గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి వేడుకున్నాడు.

ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్నగుడిపాడు గ్రామానికి చెందిన దొడ్డా శేషాద్రి గ్రీవెన్స్ లో నేతలకు విజ్ఞప్తి చేస్తూ.. తమ ఊరి చెరువుకు వర్షపు నీరు వచ్చే నల్ల వాగు కలువ కంటే వెలుగొండ కాలువ బ్రిడ్జీని ఎత్తులో కట్టడం వలన చెరువులోకి రావాల్సిన నీరు వృథాగా పోతుందని.. దాంతో చెరువులోకి నీరు రాక గ్రామ రైతులు ఇబ్బందులు పడుతున్నారని.. దయ చేసి చెరువులోకి నీరు వచ్చేలా అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.

అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలానికి చెందిన కొండామర్రెపల్లి గ్రామానికి చెంది రామచంద్ర విజ్ఞప్తి చేస్తూ.. తమకు ప్రభుత్వం మంజూరు చేసిన భూమిని మరోకరు కబ్జా చేశారని. తమకు మంజూరు చేసిన భూమిని కబ్జా నుండి విడిపించాలాని వేడుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన వేముల శ్రీను విజ్ఞప్తి చేస్తూ.. తాను దివ్యాంగుడినని తనకు వస్తున్న పింఛన్ ను గత ప్రభుత్వంలో కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందని తొలగించి తనకు అన్యాయం చేశారని.. తొలగించిన పింఛన్ పునరుద్ధరించి ఆదుకోవాలని నేతలకు అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేశాడు.

LEAVE A RESPONSE