Suryaa.co.in

Andhra Pradesh

వైద్య పరికరాల ఉత్పత్తికి 24 వేల కోట్లతో ప్రోత్సాహం

– రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: అధునాతన వైద్య పరికరాల కోసం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, దేశీయంగా వాటి ఉత్పత్తిని ప్రోత్సహించే లక్ష్యంతో రూ. 24,300 కోట్ల రూపాయలతో అనేక ప్రోత్సాహక పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు కేంద్ర రసాయన, ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖుబా వెల్లడించారు.

రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ 2020-21 నుండి 2022-23 వరకు 2,2274 డాలర్ల విలువైన వైద్య పరికరాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోగా దేసం నుంచి కేవలం 8846 డాలర్ల విలువైన వైద్య పరికరాలను మాత్రమే ఎగుమతి చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో దేశీయంగా అధునాతన వైద్య పరికరాల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక చర్యలకు శ్రీకారం చుట్టిందని మంత్రి తెలిపారు.

దేశీయంగా వైద్య పరికరాల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు రూ.3240 కోట్ల రూపాయలతో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీంను (పిఎల్ఐఎస్) రూపొందించినట్లు తెలిపారు. ఈ పథకం కింద ఎంపికైన కంపెనీలకు దేశీయంగా ఉత్పత్తి చేసిన వైద్య పరికరాల అమ్మకాలపై 5% నగదు ప్రోత్సాహకం అందిస్తున్నట్లు తెలిపారు.

రేడియో థెరపీ, ఇమేజింగ్ డివైసెస్, ఎనస్థీషియా, కార్డియో రెస్పిరేటరీ, క్రిటికల్ కేర్, ఇంప్లాంట్స్ వంటి నిర్దేశిత సెగ్మెంట్లలో 5 సంవత్సరాల కాలానికి ఈ పథకం ద్వారా ఆయా పరిశ్రమలకు ప్రోత్సాహకం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 26 కంపెనీలకు ఆథరైజేషన్ మంజూరు చేసినట్లు ఖుబా చెప్పారు.

LEAVE A RESPONSE