Suryaa.co.in

Editorial

రాజ్యసభ ఎన్నికల తర్వాత వైసీపీ అసలు జాబితా?

– ఇప్పటి సమన్వయకర్తల జాబితా ఉత్తుత్తిదేనా?
– రాజ్యసభ ఎన్నికల కోసమే ఈ వ్యూహమా?
– తిరుగుబాటు భయంతోనే అసలు జాబితా నిలిపివేత
– రాజ్యసభ ఎన్నికల్లో ఓట్లు వేయరన్న భయమే కారణమట
– రాజ్యసభ ఎన్నికల తర్వాత అసలు జాబితా
– అందులో 74 మంది సిట్టింగులు అవుట్?
– ఇప్పుడు మార్చిన వారిలో కూడా మార్పు చేర్పులు
– ఎమ్మెల్సీ ఎన్నికల అనుభవంతో జగన్ జాగ్రత్తలు
– రాజ్యసభ ఎన్నికల తర్వాత ఐప్యాక్ జాబితా అమలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

పార్టీ అభ్యర్ధుల పేర్లతో కాకుండా నియోజకవర్గ సమన్వయకర్తల పేరిట ప్రకటిస్తున్న వైసీపీ జాబితా అంతా ఉత్తుత్తిదేనా? అసలు జాబితా రాజ్యసభ ఎన్నికల తర్వాత ప్రకటిస్తారా? ఆ జాబితాలో 74 మంది సిట్టింగులు అవుట్ కానున్నారా? ఆ 74 మందిని ఇప్పుడే తొలగిస్తే.. వారంతా రాజ్యసభ ఎన్నికల్లో పార్టీకి ఓటు వేయరన్న భయంతోనే, అసలు జాబితా ప్రకటనను వాయిదా వేశారా? అంటే ఇప్పటి జాబితాలు కూడా తర్వాత తారుమారవుతాయా?.. వైసీపీ వర్గాలు దీనికి అవుననే సమాధానం ఇస్తున్నాయి.

టీడీపీకి శాసనసభలో బలం లేకపోయినా.. ఒక ఎమ్మెల్సీని సాధించి షాక్ ఇచ్చిన అనుభవంతో, వైసీపీ అధినేత-సీఎం జగన్ కొత్త పాఠాలు నేర్చుకుంటున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో అలాంటి భంగపాటు ఎదురుకాకుండా, ఇప్పటినుంచే జగన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా తిరుగుబాటు-వెన్నుపోట్లను దృష్టిలో ఉంచుకుని.. అసెంబ్లీ అభ్యర్ధుల పూర్తి జాబితాను, రాజ్యసభ ఎన్నికల తర్వాత ప్రకటించాలని నిర్ణయించినట్లు సమాచారం.

ఇప్పటివరకూ దశల వారీగా.. నియోజకవర్గ సమన్వయకర్తల పేరిట, జాబితాలు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వారిని పార్టీ అభ్యర్ధులని కాకుండా, నియోజకవర్గ సమన్వయకర్తలుగా ప్రకటిస్తున్న విషయం ప్రస్తావనార్హం. నిజంగా వారినే ఎమ్మెల్యే అభ్యర్ధులని భావిస్తే, పార్టీ నాయకత్వం విడుదల చేసే ప్రకటనల్లోనూ ఎమ్మెల్యే అభ్యర్ధులనే సంబోధించాలి. కానీ నియోజకవర్గ ఇన్చార్జులని ప్రకటిస్తున్నారంటే… అది అసలు జాబితా కాదని, రాజ్యసభ ఎన్నికల తర్వాత అసలు జాబితా ప్రకటిస్తారని వైసీపీ సీనియర్లు చెబుతున్నారు. ఆ ప్రకారంగా ఇప్పుడు దశలవారీగా ప్రకటిస్తున్న జాబితాలో, ఇన్చార్జులుగా నియమితులైన వారి స్థానాలు కూడా పదిలం కాదని స్పష్టమవుతుంది. వారిని కూడా మారుస్తారని తెలియడంతో, ఎవరికీ టికెట్లపై భరోసా లేని అభద్రత నెలకొంది.

ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి శాసనసభలో తగినంత బలం లేదు. అయినా వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేల దన్నుతో, పార్టీ అభ్యర్ధి పంచుమర్తి అనురాధ అనూహ్య విజయం సాధించి, వైసీపీకి కోలుకోలేని షాక్ ఇవ్వడం జగన్‌కు మింగుడుపడలేదు. ఆ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. నిజానికి మరో నాలుగు ఎమ్మెల్యే ఓట్లు అదనంగా రిజర్వు చేసుకున్నప్పటికీ, ఎన్నికల్లో వారి ఓట్లు అవసరం లేకుండానే టీడీపీ అభ్యర్ధిని గెలిపించుకున్నారు. ఆ సమయంలో తనను కలిసేందుకు వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బాబు రెండో కంటికి తెలియకుండా చర్చలు జరిపారు.

ఆ చేదు అనుభవం మళ్లీ ఎదురవకుండా, జగన్ ఇప్పటినుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో జాబితా ప్రకటించకుండా, దశల వారీగా సమన్వయకర్తల పేరుతో, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. నిజానికి ఇప్పటివరకూ 27 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఇతర నియోజకవర్గాలకు మార్చడం గానీ, టికెట్ ఇవ్వకపోవడం గానీ జరిగింది. ఈ క్రమంలో పార్టీలో తిరుగుబాటు, అసంతృప్తి ప్రారంభమయింది. టికెట్లు దక్కని వారు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, నియోజకవర్గాలు మారటం ఇష్టం లే ని వారు గుంభనంగా ఉన్నారు.

నిజానికి మొత్తం 74 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని ఐప్యాక్, వైసీపీ అధినేత జగన్‌కు సూచించినట్లు చెబుతున్నారు. అందుకే బాలినేని వంటి అగ్రనేతలను కూడా మార్కాపురం, ఇతర నియోజకవర్గాల్లో పోటీ చేయాలని సూచించడం గమనార్హం. ఐప్యాక్ సూచనలో భాగంగా కొంతమందిని మాత్రమే మార్చిన నాయకత్వం.. రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, జోరు తగ్గించింది. ఒకేసారి 74 మంది సిట్టింగులకు ఎసరు పెడితే… వారంతా రాజ్యసభ ఎన్నికల్లో పార్టీకే ఎసరు పెడతారన్న భయంతోనే, వ్యూహం మార్చినట్లు చెబుతున్నారు.

రాజ్యసభ ఎన్నికల తర్వాత , 74 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చడం ఖాయమంటున్నారు. ఈవిషయం ముందే తెలిస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధులకు వ్యతిరేకంగా ఓటేస్తే, కొంప కొల్లేరవుతుందన్నది జగన్ భయంగా కనిపిస్తోంది.

LEAVE A RESPONSE