-జగన్మోహన్ రెడ్డి దీనిపై శ్రద్ధ పెట్టలేదు
-శ్రీకాకుళం జిల్లాలో పర్యటించి శాస్వత పరిష్కారానికి చర్యలు
-కిడ్నీ పరిశోధనా సిబ్బందికి జీతాలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటాం
-శాసన సభలో ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి
అమరావతి: ఉద్దానంలో నిర్మించిన కిడ్నీ పరిశోధనా కేంద్రంలో సరిపడా స్పెషలిస్టులు, ముఖ్యంగా నెఫ్రాలజిస్టులు, సిబ్బందిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో సరిపడా నియమించలేదని, ఐదేళ్ల కాలంలో దీని పట్ల ఏమాత్రం శ్రద్ధపెట్టలేదని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యా శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.
శుక్రవారం శానస సభలో ఉద్దానం కిడ్నీ పరిశోధనా కేంద్రంపై సభ్యులు గౌతు శిరీష, కూన రవికుమార్ తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. ఉద్దానంలో కిడ్నీ సమస్య ఆందోళనకరమైన విషయమని, దీర్ఘకాలిక సమస్య అని అన్నారు. కిడ్నీ సమస్యలతో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఈ సమస్యపై గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో జార్జియాతో ఒప్పందాన్ని(ఎంఓయూ) కుదుర్చుకోవడం ద్వారా ఇక్కడ పరిశోధనా కేంద్రాన్ని నిర్మించాలని అప్పట్లో నిర్ణయించారన్నారు.
జనసేన నేత పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతంలో పర్యటించాక దీనిపై జగన్మోహన్ రెడ్డి దృష్టిసారించారన్నారు. స్థానిక ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో 2019 డిసెంబరులో ఆర్భాటంగా జగన్మోహన్ రెడ్డి అక్కడ కిడ్నీ పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించారే తప్ప సరిపడా వైద్య నిపుణుల్ని, సిబ్బందిని నియమించలేదన్నారు. ఆరుగురు నెఫ్రాలజిస్టులకు గాను కేవలం ఒక్కరే ఉన్నారని, యూరాలజీలో ఆరుగురు అవసరం ఉండగా, నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.
అనిస్తీషియా విభాగంలో 8 మందికి ఆరుగురు, రేడియాలజిస్టులు నలుగురు ఉండాల్సి ఉండగా ఒక్కరు కూడా లేరన్నారు. అన్ని విభాగాల్లోనూ మొత్తం 61 మంది కావాల్సి ఉండగా, కేవలం 17 మంది మాత్రమే ఉన్నారనీ, 44 పోస్టులు ఖాళీగా ఉన్నాయని మంత్రి వివరించారు. 75 శాతం మేర పోస్టుల్ని భర్తీ చేయకుండా, ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నా దీనిపై జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించలేదన్నారు. అక్కడి నీటిలో భార లోహాలు(హెవీ మెటల్స్), సిలికా, పురుగు మందుల అవశేషాలు, తీవ్రమైన డీహైడ్రేషన్ తదితర సమస్యలున్నట్లు నిపుణుల బృందం గుర్తించిందని, ప్రధానంగా జెనిటిక్స్ సమస్యలున్నట్లు కూడా గుర్తించారని మంత్రి వివరించారు.
ఇక్కడి ప్రజల్లో అవగాహన కల్పించాల్సి ఉందని, సురక్షితమైన నీరు వాడాలని మంత్రి సూచించారు. ఇక్కడున్న కొరతల్ని తీర్చేందుకు చర్యలు చేపడతామన్నారు. నాన్ రికరింగ్ కింద రూ.84 కోట్ల వరకు ఖర్చు చేశామనీ, రికరింగ్ కింద రూ. 8.19 కోట్ల మేర రావాల్సి ఉందని, దీని కారణంగా జీతాలు చెల్లించలేదనే విషయం తన దృష్టికొచ్చిందని, అధికారులతో మాట్లాడి జీతాలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
బయటినుండి వచ్చి ఇక్కడ పనిచేసేందుకు స్పెషలిస్టులు సుముఖంగా ఉండకపోవచ్చని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇన్సెంటివ్స్ ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. కిడ్నీ పరిశోధనా కేంద్రంలో పనిచేసే స్పెషలిస్టుల టీచింగ్ అనుభవాన్ని పరిగణలోకి తీసుకోవాలని సభ్యులు అడిగారని, ఇప్పటికే ఇది శ్రీకాకుళం మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్నందున స్పెషలిస్టులకు టీచింగ్ అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటామన్నారు. ప్రధాన మంత్రి నేషనల్ డయాలసిస్ పథకం కింద 53, ఎన్డీఆర్ వైద్య సేవ కింద 217 డయాలసిస్ కేంద్రాలు రాష్ట్రంలో పనిచేస్తున్నాయని, అమదాలవలసలో కూడా డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.
ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఉద్దానం కిడ్నీ సమస్యపై పూర్తి స్థాయిలో సర్వే చేయించి శాస్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యకుమార్ సభకు తెలిపారు. జన్యుపరమైన అధ్యయనం, పరిశోధనల కోసం అమెరికాలోని హార్వర్డ్ యూనివర్శిటీ తో ఒప్పందాన్ని (ఎంఓయూ) కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించినంత మాత్రాన సరిపోదని, సరిపడా డాక్టర్లు, వైద్య నిపుణులు, ఇతర సిబ్బందిని నియమించకపోవడం వల్లే ఆశయం నెరవేరలేదన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో పర్యటించి ఉద్దానం కిడ్నీ సమస్యపై పూర్తిస్థాయిలో సమీక్షించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను ఆ జిల్లా మంత్రి కింజరాపు అచ్చన్నాయుడు కోరగా త్వరలో పర్యటించి, సమీక్షిస్తానని మంత్రి సత్యకుమార్ సభలో ప్రకటించారు. డయాలసిస్ రోగులకు ఇప్పటికే రూ. 10,000 ప్రభుత్వం పెన్షన్ ఇస్తోందని, మందుల వాడకానికి కూడా రూ.5,000 ఇస్తే బాగుంటుందని సభ్యులు చేసిన సూచనను పరిగణలోకి తీసుకుని ఆర్థిక శాఖతో సంప్రదించాక దీనిపై తగిన నిర్ణయాన్ని తీసుకుంటామన్నారు.