-45 ఏళ్ల రాజకీయానుభవం, 9 ఎన్నికల్లో పోటీకి పురికొల్పిన సత్తువ ఏమయ్యాయో?
-రాజ్యసభ సభ్యులు ఎంపీ విజయసాయిరెడ్డి
తెలుగుదేశం పార్టీ స్థాపకుడు నందమూరి తారక రామారావు గారి రాజకీయ జీవితం 14 ఏళ్లకే ముగిసింది. రక్తం పంచుకుపుట్టిన బిడ్డలు, అల్లుడూ చేసిన రాజకీయ ద్రోహాన్ని ఆరు నెలలైనా తట్టుకోలేకపోయారు ఎన్టీఆర్. మానసిక కుంగుబాటు వల్ల వచ్చిన తీవ్ర గుండెపోటుతో కన్నుమూశారు. 1981లో ముఖ్యమంత్రి భవనం వెంకట్రామ్ గారి మంత్రివర్గంలో సహాయ మంత్రిగా ఉన్న చంద్రబాబును అల్లుడిని చేసుకున్న పాపానికి పదిహేను సంవత్సరాల తర్వాత రామారావు గారు ప్రాణాలు కోల్పోవడం తెలుగునాట పెను విషాదం.
1982 మార్చి 29న టీడీపీ స్థాపన ద్వారా సినిమా ప్రపంచం నుంచి రామారావు రాజకీయాల్లోకి వచ్చారు. 1983 జనవరి నుంచి 1994 డిసెంబర్ వరకూ ఆయన వరుసగా నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేశారు. 1985–89 మధ్య కొనసాగిన ఆంధ్రప్రదేశ్ 8వ శాసనసభ కాలంలో మాత్రమే ఎన్టీఆర్ దాదాపు పూర్తికాలం శాసనసభ్యుడిగా ఉన్నారు. అరవై సంవత్సరాలు నిండడానికి 4 నెలల ముందు ఎమ్మెల్యేగా, మంత్రిగా పూర్వ అనుభవం లేకుండానే రామారావు గారు 1983 జనవరి 9న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. 1996లో 73 ఏళ్లు నిండడానికి 3 నెలల పది రోజుల ముందు ఆయన కన్నుమూశారు. ఇదీ ఎన్టీఆర్ రాజకీయ జీవితం క్లుప్తంగా.
73 ఏళ్లు నిండాక కూడా ఎవరైనా ‘వృద్ధుడు’ అంటే బాబు గారికి కోపం వస్తోంది!
ఎన్టీఆర్ ఆలస్యంగా రాజకీయాల్లోకి రావడం వల్ల దగ్గర దగ్గర 60 సంవత్సరాల వయసులో నేరుగా ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన రాజకీయాల్లో ఉండగా నాలుగుసార్లు గెలిచి ఎమ్మెల్యేగా దాదాపు 13 ఏళ్లు కొనసాగారు. ఇక చంద్రబాబు విషయానికి వస్తే 28 సంవత్సరాల వయసులో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికై, నలభై ఐదున్నరేళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఆయన అసెంబ్లీకి 1978 నుంచి 2019 వరకూ తొమ్మిదిసార్లు పోటీశారు. ఒక్కసారి మాత్రమే ఓడిపోయారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో (1985 మార్చి మధ్యంతరం) ఆయన పోటీచేయలేదు.
ఈ నేపథ్యంలో గత నాలుగున్నరేళ్లుగా ప్రతిపక్ష నేతగా ఉంటూ బాధ్యతారహితంగా మాట్లాడుతున్న సందర్భాల్లో చంద్రబాబును ఆయన రాజకీయ ప్రత్యర్థులు ‘వృద్ధాప్యం వల్ల ఏపీలోని సీనియర్ మోస్ట్ రాజకీయ నేత అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు,’ అని విమర్శంచడంలో పెద్దగా తప్పుపట్టాల్సిందేమీ లేదు. అయినా, ‘దాదాపు నా వయసే ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, బిహార్ సీఎం నితీశ్ కుమార్ లను వృద్ధులు అని పిలిచే ధైర్యం మీకుందా?’ అంటూ టీడీపీ అధినేత చిందులుదొక్కడం వింతగా కనిపిస్తోంది.
మీదపడిన వయసు లేదా దారితప్పిన ఆలోచనా ధోరణి గురించి ఎవరైనా వ్యాఖ్యానిస్తే బాధ్యతగల ప్రజా నాయకుడు ఎవరైనా హుందాగా తీసుకుంటారు. కాని, నాలుగున్నర దశాబ్దాల అనుభవం ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడడం పెద్దరికం అనిపించుకోదు. వచ్చే ఏడాది వేసవిలో 74 సంవత్సరాల వయసులో తన జీవితంలో చివరిసారి ఏపీ ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న నారా వారు– పెరుగుతున్న తన వయసుతోపాటు రాష్ట్రంలో గత నాలుగున్నరేళ్లలో వచ్చిన పెను మార్పులును కూడా పట్టించుకుంటే ఆయనకూ, ఆయన పార్టీకి ఎంతో మేలు.