– పార్టీ మారతానని చెప్పకనే చెప్పిన వైనం
– మరో ఫ్లైట్ ఎక్కక తప్పదుకదా అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు
-ఖాళీ లేకపోతే ప్రైవేట్ జెట్‌లోనయినా వెళ్లాలని కదా అన్న కామెంట్
– ఖాళీగా ఉంటే కార్యకర్తలు ఊరుకోరని వ్యాఖ్య
– టీడీపీ విజయవాడ ఎంపీ టికెట్ హుళక్కే
– గత ఏడాదే బీజేపీలో చేరతారన్న ప్రచారం
– పార్టీలో చేరాలని ఆహ్వానించిన సునీల్ దియోధర్
– ఇప్పుడు బీజేపీలో చేరినా బీజేపీ సీటిస్తుందా?
– పొత్తు ఉంటే విజయవాడ బీజేపీ అభ్యర్ధిగా సుజనా చౌదరి?
– పొత్తు లేకపోతేనే కేశినేనికి అవకాశం?
– మళ్లీ చంద్రబాబుకు హనుమంతుడినని వ్యాఖ్య
– నాని వ్యాఖ్యలపై గందరగోళం
( మార్తి సుబ్రహ్మణ్యం)
విజయవాడ టిడిపి సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా? విజయవాడ టీడీపీ సీటు దక్కని నాని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రత్యామ్నాయంగా బీజేపీని చూసుకుంటున్నారా? తాజాగా మీడియా వద్ద కేశినేని నాని చేసిన నర్మగర్భ వ్యాఖ్యలు పరిశీలిస్తే.. వాటికి అవుననే సమాధానం వస్తోంది.
విజయవాడ టిడిపి లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని, బీజేపీలో చేరవచ్చన్న ప్రచారం జరగుతున్న నేపథ్యంలో.. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు, దానికి బలం చేకూర్చేవిధంగా కనిపిస్తున్నాయి. తాను పార్టీ మారనని నేరుగా చెప్పకుండానే, కేశినేని చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
‘విజయవాడ ఎంపీగా పోటీ చేస్తా. హ్యాట్రిక్ సాధిస్తా. ఢిల్లీ వెళ్లాలంటే ఒక ఫ్లైట్ కాకుంటే, ఇంకో ఫ్లైట్ చూసుకోవాలి కదా? ఏ ఫ్లైట్ ఖాళీ లేకపోతే ప్రైవేట్ జెట్‌లోనయినా వెళ్లాలి కదా? నేను ఇండిపెండెంట్గానయినా పోటీ చేసి గెలుస్తానని గతంలోనే చెప్పా’’నని కేశినేని చేసిన వ్యాఖ్య, ఆయన పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్న సంకేతాలను స్పష్టం చేశాయి. తాను ఖాళీగా ఉంటే కార్యకర్తలు, అభిమానులు ఊరుకోరని కూడా, నాని తన పోటీపై స్పష్టత ఇచ్చేశారు. తాను బాబుకు వెన్నుపోటు పొడవలేదని, ఒకవేళ పొడిస్తే ఇంకా మంచి పదవిలో ఉండేవాడినంటూ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారింది.
విజయవాడ టీడీపీ ఎంపీ సీటు రాదన్న విషయం స్పష్టమైన నేపథ్యంలో… కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. టీడీపీ తనకు టికెట్ ఇవ్వకపోతే, మరొక పార్టీ నుంచి పోటీ చేసి ఎంపీ అవుతానని.. నాని చెప్పకనే చెప్పినట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఆయనకు ఉన్న ఒకే ఒక దారి బీజేపీమాత్రమేనని, రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. జనసేనలో చేరినా మిత్రపక్షమైన టీటీడీ, ఆయనకు సీటు ఇచ్చేందుకు అంగీకరించదు.
వైసీపీలోకి నాని ఎలాగూ వెళ్లే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఆయనకు ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీనే అంటున్నారు. నిజానికి గత ఏడాదిలోనే తనను ఆహ్వానిస్తే, బీజేపీలో చేరతానని నాని ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. బీజేపీ అగ్రనేత సునీల్ దియోధర్ నివాసంలో జరిగిన ఓ పూజా కార్యక్రమానికి హాజరైన నానిని, బీజేపీలో చేరాలని సునీల్ కూడా ఆహ్వానించినట్లు అప్పట్లో చర్చ జరిగింది. ఢిల్లీ బీజేపీ నేతలతో నానికి సత్సంబంధాలు ఉన్నాయంటున్నారు.
అయితే ఇక్కడ కూడా మరో చిక్కు కనిపిస్తోంది. బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు కుదిరితే.. కేంద్రమాజీ మంత్రి సుజనాచౌదరి విజయవాడ బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేయవచ్చన్న ప్రచారం, చాలాకాలం నుంచీ వినిపిస్తోంది. నిజానికి సుజనా ఇప్పటికే విజయవాడ పార్లమెంటు పరిథిలో, చాలాకాలం నుంచి సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన సొంత ఫంక్షన్‌హాల్‌ను పార్టీ కార్యక్రమాలకు ఇస్తున్నారు. కోవిడ్ సమయంలో సొంత ఖర్చులతో దానిని, క్వారంటైన్ సెంటర్‌గా మార్చిన విషయం తెలిసిందే.
విజయవాడ పార్లమెంటు పరిథిలోని అనేక గ్రామాలతో , సుజనాకు సత్సంబంధాలున్న విషయం తెలిసిందే. రాజ్యసభ సభ్యుడిగా ఆయన కృష్ణాజిల్లాను ఎంపిక చేసుకున్న సందర్భంలో, ఆయా గ్రామాలకు తన ఎంపీ కోటా నిధులు మంజూరు చేశారు.
కాబట్టి అలాంటి పరిస్థితి వస్తే.. కొత్తగా చేరే కేశినేని నాని కంటే, ఆయనకంటే సీనియర్ అయిన సుజనాకు విజయవాడ సీటు ఇచ్చే అవకాశాలు ఎక్కువ. ఒకవేళ విజయవాడ సీటు బీజేపీకి ఇవ్వాలని టీడీపీ నిర్ణయిస్తే.. నాని వైపు కాకుండా, సుజనా వైపే మొగ్గు చూపే అవకాశాలు అధికంగా ఉంటాయి. మరి కేశినేని ఏ దైర్యంతో తాను ఎలాగైనా హ్యాట్రిక్ సాధిస్తానని చెప్పారో, అర్ధం కావడం లేదని బెజవాడ టీడీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు లేకపోతే, కేశినేని బీజేపీ అభ్యర్ధి అయ్యే అవకాశాలు ఉంటాయని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరి అప్పుడు కూడా పొత్తులు లేని బీజేపీ నుంచి పోటీ చేసేందుకు నాని సాహసిస్తారా? అన్నది చూడాలి.
కేశినేని నాని స్వతహాగా నిజాయితీపరుడు-అవినీతి ఆరోపణలు లేకపోయినప్పటికీ.. ఆయన వైఖరే పార్టీ నాయకత్వానికి, ఆయనను దూరం చేసిందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తాయి. కూతురు పోటీ సమయంలో చేసిన వ్యాఖ్యలతోపాటు.. పలు సందర్భాల్లో నాని వైఖరి ‘పార్టీ కంటే నేనే ఎక్కువ’ అన్న సంకేతాలిచ్చాయి. పార్టీ కంటే తానే గొప్ప అన్న అర్ధం, ఆయన వ్యాఖ్యల్లో తరచూ ధ్వనిస్తుంటుందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
నిజానికి రాజకీయాల్లో వ్యక్తుల స్థాయి ఎంత పెద్దదైనప్పటికీ..పార్టీ చట్రంలోనే నడవాల్సి ఉంటుంది. వారికి ఎంత ఇమేజ్ ఉన్నప్పటికీ.. అది పార్టీకంటే మించి ఉండకూడదు. ఆ సందర్భంలో సదరు నేతల ప్రవర్తన, చేసే వ్యాఖ్యలను ఏ పార్టీ నాయకత్వం సహించదు. అలాంటి సందర్భాల్లో పార్టీ నాయకత్వాలు, అలాంటి నేతలను వదులుకునేందుకయినా సిద్ధంగా ఉంటుంది.
కేశినేని నానికి ఈ సూత్రం వర్తిస్తుందని రాజకీయవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అనేక సందర్భాల్లో పార్టీ కంటే తానే ఎక్కువ అన్న సంకేతాలివ్వడాన్ని, సొంత నియోజకవర్గ నేతలు జీర్ణించుకోలేపోయారు. అప్పటినుంచే కేశినేని నానికి, సొంత నియోజవర్గంలో అసమ్మతి పెరిగిందని గుర్తు చేస్తున్నారు.
బాబు సీఎంగా ఉన్న సమయంలో కూడా.. పార్టీ సీనియర్లను ఖాతరు చేయకుండా, డైరక్టుగా చంద్రబాబుతోనే మాట్లాడ తాననే వైఖరి ఆయనకు నష్టం చేసిందంటున్నారు. పైగా తన నియోజకవర్గ పరిథిలోని నేతలతో.. సఖ్యత బదులు శత్రువులను చేసుకోవడటం కూడా, నాని ఒంటరి కావడానికి కారణమంటున్నారు.
ఆయన సోదరుడు కేశినేని చిన్ని మాత్రం.. అందరితో సఖ్యతగా వ్యవహరిస్తూ, నియోజకవర్గ నాయకుల మద్దతు పెంచుకునే వ్యూహంలో సక్సెస్ అవుతున్నారు. పైగా పార్టీకి అవసరమైన సమయంలో.. అన్ని విధాలా దన్నుగా నిలవడం కూడా, చిన్ని పట్ల నాయకత్వ సానుకూలతకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
అయితే పోటీపై పరోక్షంగా ఇన్ని వ్యాఖ్యలు చేసిన కేశినేని నాని.. రాముడికి హనుమంతుడి భక్తి తరహాలో తాను చంద్రబాబు ఆదేశాలు శిరసావహిస్తానని చెప్పడం ప్రస్తావనార్హం. దీనితో అసలు కేశినేని లక్ష్యం ఏమిటన్న గందరగోళం నెలకొంది.