– ఓటు ద్వారా బుద్ధి చెప్పటానికి సిద్ధమైయ్యారు :సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
– ప్రధాన సమస్యగా గుర్తించి పరిష్కరిస్తాం: టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
-ఓట్లు దృష్టితో ఆలోచించైనా సమస్య పరిష్కరించాలి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్.తులసిరెడ్డి
– సంక్రాంతిలోపు చనిపోయిన బాధిత కుటుంబాలకు రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి, బాధితులకు ఎప్పుడు చెల్లిస్తారో తేదిని ప్రకటించాలి: ముప్పాళ్ల
-ముగిసిన అగ్రిగోల్డ్ బాధితులు 30 గంటల ధర్మ పోరాట దీక్షలు
రాజకీయాలను తారుమారు చేసే శక్తికలిగిన అగ్రిగోల్డ్ బాధితులకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు న్యాయం చేయకుంటే వైసీపీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని వక్తలు అన్నారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో ‘నమ్మన అగ్రిగోల్డ్ బాధితులను మోసం చేయకండి`ఇచ్చిన హామీని నిలబెట్టుకొండి’ అని కోరుతూ స్థానిక హనుమంతరాయ గ్రంథాలయంలో చేపట్టి 30 గంటల ధర్మపోరాట దీక్షల్లో గురువారం పాల్గొని సంఫీుభావం ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేస్తే ఓట్లు వస్తాయి తప్ప ఎమ్మెల్యే స్థానాలను మార్చటం వల్ల రావన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను వేరే ప్రాంతానికి బదిలీ చేస్తే ఓట్లు పడతాయనేది అపోహ అన్నారు. ప్రజలకు ఏమి చేస్తారో ఎవరు ఎంత డబ్బులు ఇస్తారు? ఒక్కోక్క ఎమ్మెల్యేని పిలిచి నవ్వెంతిస్తావ్ అంటూ ముఖ్యమంత్రి బేరాసారాలు చేస్తున్నారని విమర్శించారు. వెల్లంపల్లి శ్రీనివాస్, మంత్రి విడదల రజని సీట్లు మార్చారని సొంత స్థానాల్లో విలువ తగ్గితే వేరే చోట ఎలా నెగ్గుకు రాగలరని సందేహం వ్యక్తం చేశారు. వలంటీర్లకు డిమాండ్ పెంచారని ఇప్పుడు వారు కూడా రోడ్డెక్కుతున్నారని తెలిపారు. బాధితులకు న్యాయం చేయకుంటే బాధుడే..బాధుడు అని హెచ్చరించారు.
తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను ప్రధాన సమస్యగా గుర్తించి టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు తరుపున హామీ ఇచ్చారు. ఇప్పటి టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ అ సమస్యపై ముఖ్యమంత్రికి లేఖ రాయటం జరిగిందన్నారు. సీఎం జగన్ తలుచుకుంటే పరిష్కారం అవుతుందన్నారు. జగన్ తన కేసుల కోసం ఢల్లీ నుంచి పెద్ద న్యాయవాదులను పిలుపించుకుంటారని మరి 10లక్షల కుటుంబాలతో ముడిపడిన ఈ సమస్య కోసం ఒక న్యాయవాదిని నియమించలేరా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్.తులసిరెడ్డి మాట్లాడుతూ బడ్జెట్‌లో 0.4శాతం నిదులు కేటాయించినా సమస్య పరిష్కరం అయ్యేదన్నారు. 10లక్షల మంది బాధితులు ఉన్నారని వారి కుటుంబ సభ్యలతో కలిపి దాదాపు 30లక్షల మంది ఉన్నారని చెప్పారు. ఓట్లు దృష్టితో ఆలోచించైనా బాధితులకు న్యాయం చేయాలన్నారు. అగ్రిగోల్డ్ బాధితులు ఐక్యమత్యంగా పోరాడితే విజయం సాధించాలని ఆకాంక్షించారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్.బాబూరావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ కంపెనీ మోసానికి బలైన బాధిత కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా పువ్వుల్లో పెట్టి ఇస్తానని జగన్ ఇచ్చిన హామీ నమ్మిన బాధితులు పూలదండలు వేసుకుని దీక్షలో కూర్చున్నారనిఎద్దేవ చేశారు. ఫిర్యాదులు లేకపోయిన ప్రతిపక్షనాయుడ్ని జైల్లో పెట్టిన సీఐడీ ఫిర్యాదులు ఉన్న అగ్రిగోల్డ్ కంపెనీ పెద్దలపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అక్కినేని వనజ మాట్లాడుతూ ఓటు ఆనే ఆయుధాన్ని సక్రమంగా వినియోగించుకుని సమస్య పరిష్కారం అయ్యేలా ఆలోచన చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మెత్స దుర్గాభవాని మాట్లాడుతూ పాలకులకు చిత్తశుద్ది లేకపోవటం వల్లే అన్ని రంగాల ప్రజలు రోడ్డెకుతున్నారని చెప్పారు. తాను అధికారంలోకి మద్యనిషేధం చేస్తానని చెప్పిన జగన్‌మోహన్‌రెడ్డి నిషేధించకపోగా కొత్త బ్రాండ్‌లు తీసుకువచ్చారని విమర్శించారు. ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని చెప్పటం అబద్ధం అన్నారు. మద్యం ద్వారా 65వేల కోట్ల రూపాయల ఆదాయం తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుతుందన్నారు. దాదాపు పదేళ్ల పాటు ఎలాంటి హింసాత్మక ఘటనలు లేకుండా ఉద్యమాన్ని నడిపిస్తున్న ముప్పాళ్ల నాగేశ్వరరావును ఆమె అభినందించారు.
అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ జనవరి 15వ తేదిలోపు అగ్రిగోల్డ్ కంపెనీ మోసానికి బలైన బాధిత కుటుంబాలకు రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, అదే విధంగా మిగిలిన బాధితులకు డిపాజిట్ మొత్తాన్ని ఎప్పుడు చెల్లిస్తారో తేదిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వానికి ఇదే తుది హెచ్చరిక అన్నారు. 2017లో బాధితులు ఇదే వేదికపై దీక్ష చేస్తున్నప్పుడు జగన్‌కు ఆహ్వానం లేకపోయినా 10 మంది ఎమ్మెల్యేలతో వచ్చి చంద్రబాబు రూ.3లక్షలు ఇస్తున్నారని తాను అధికారంలోకి వస్తే రూ.10లక్షలు పువ్వుల్లో పెట్టి పంపిస్తానని చేసి వాగ్ధానం ఏమైయిందని నిలదీశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్, విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు పాల్గొని సంఫీుభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఈవీ నాయుడు కార్యనిర్వాహక అధ్యక్షులు మల్లికార్జున, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి నాగలక్ష్మి, నాయకులు అగస్టీన్, గగన్, వీరభద్రం, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కంపెనీ మోసానికి మానసిక ఒత్తిడికి లోనై ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబ సభ్యులు దాదాపు 200 మంది ధర్మపోరాట దీక్షలో కూర్చున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు చంద్రనాయక్, కోశాధికారి ఆర్.పిచ్చయ్య అగ్రిగోల్డ్ బాధితుల కష్టసుఖాలు, ఇబ్బందులను ఉద్ధేశించిన రాసిన గీతాలను ఆలపించారు. దీక్షల్లో కూర్చున్న టీడీపీ నేత వర్ల రామయ్య, ముప్పాళ్ల నాగేశ్వరరావు నిమ్మరసం ఇచ్చి దీక్షలు విరమింపజేశారు.