Suryaa.co.in

Andhra Pradesh

రేపు కనకదుర్గ దేవాలయానికి సీఎం చంద్రబాబు

– కుటుంబ సమేతంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు
– అందరికీ ఉచిత దర్శనాలే
– ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్ష

విజయవాడ: దసరా నవరాత్రి ఉత్సవాల్లో కీలకమైన మూలా నక్షత్రం ఉన్న పర్వదినం నాడు తెల్లవారుజామున మూడు గంటల నుంచి భక్తులు దర్శనం చేసుకుంటారని.. అసంఖ్యాకంగా భక్తులు తరలివచ్చే పరిస్థితుల్లో, రేపు అమ్మవారి దర్శనానికి అందరిని ఉచిత క్యూ లైన్ల లోనే పంపిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.

ఇంతవరకు కొనసాగిన 100, 300,500 రూపాయల టికెట్లతో పాటు వీఐపీ దర్శనాలు వంటివి 9వ తేదీన ( మూలా నక్షత్రం రోజున ) ఉండవని, ఏర్పాటుచేసిన క్యూలైన్లు అన్నింటి ద్వారా, భక్తులందరికీ అమ్మవారి దర్శనం ఉచితంగానే కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు.

ముఖ్యమంత్రి సందర్శన, భక్తులకు కలిగించే ఏర్పాట్లు తదితర అంశాలపై మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్,పోలీస్ కమిషనర్, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు తదితరులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

అనంతరం మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు.
మూలా నక్షత్రం సందర్భంగా ప్రతి ఏటా ముఖ్యమంత్రి కుటుంబ సమేతంగా అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది సంప్రదాయమని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రేపు మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల మధ్యలో కుటుంబ సమేతంగా అమ్మవారి గుడికి రానున్నారని తెలిపారు.

భక్తుల రద్దీ దృష్ట్యా, భద్రతా కారణాల రీత్యా ఆ సమయంలో పరిమిత సంఖ్యలోనే ప్రజా ప్రతినిధులను, అధికారులను దేవాలయంలో నికి అనుమతించాలని నిర్ణయించామని తెలిపారు. కేవలం సీఎం,వారి కుటుంబ సభ్యులు మాత్రమే అంతరాలయంలోకి వెళతారని వివరించారు.

పూజా కార్యక్రమాల అనంతరం సమయం అనుకూలిస్తే, దేవాలయంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను సీఎం చూస్తారని మంత్రి ఆనం వెల్లడించారు.
సి ఎం ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న సమయంలో కూడా కొన్ని క్యూలైన్ల ద్వారా భక్తులకు అమ్మవారి దర్శనం కొనసాగేలా చూడడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ముఖ్యమంత్రి తిరిగి వెళ్ళిన తర్వాత.. సాయంత్రం నాలుగు గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఐదు క్యూ లైన్ ల నుంచి భక్తులకు అమ్మవారి దర్శనం కలిగించేలా ఏర్పాటు చేశామని మంత్రి వివరించారు.
క్యూ లైన్ లో ఉన్న భక్తులకు మంచినీళ్లు, పాలు, మజ్జిగ వంటివి ఎప్పటి లాగానే పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE