– గతంలో ఎప్పుడూ లేనంతగా హోంశాఖకు రూ.8,570 కోట్ల కేటాయింపులు
– ఇప్పటికే చెల్లించిన పెండింగ్ బకాయిలు రూ.250 కోట్లు
– 6,100 మంది పోలీసు కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ పూర్తికి చర్యలు
– ప్రతి జిల్లాలో సైబర్ పోలీస్ స్టేషన్ దిశగా అడుగులు
– రూ.61.20 కోట్లతో పోలీస్ దళం ఆధునీకరణ పథకం పునరుద్ధరణ
– గంజాయి,డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ‘నవోదయం 2.0’
– సవాళ్లను అధిగమించడంలో చంద్రబాబుకు సాటిలేరు
– హోంమంత్రి వంగలపూడి అనిత
అమరావతి: కూటమి ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్ అన్ని రంగాలకు తిరిగి ఊపిరిపోసిందని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. గతంలో ఎప్పుడూ లేనంతగా హోంశాఖకు రూ.8,570 కోట్లు బడ్జెట్ లో కేటాయించడం పోలీసుల్లో స్థైర్యం నింపిందన్నారు.
శాంతిభద్రతల బలోపేతంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. పోలీస్ శాఖలో కనీస అవసరాలకు కూడా పైసా విదల్చకుండా గత ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. సామాన్యులు ప్రశాంతంగా బతకలేని విధంగా వైఎస్ జగన్ ఐదేళ్ల విధ్వంస పాలన సాగిందన్నారు.
సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటిని నియంత్రించడమే లక్ష్యంగా ప్రతి జిల్లాలో ఒక సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు హోంమంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా హోంశాఖలో పేరుకుపోయిన రూ.920 కోట్ల పెండింగ్ బకాయిలలో ఇప్పటికే రూ.250కోట్లు చెల్లించినట్లు హోంమంత్రి స్పష్టం చేశారు.
‘గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ’ని పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు. ‘ఎలైట్ యాంటి నార్కోటిక్స్ గ్రూప్ ఆఫ్ లా ఎన్ ఫోర్స్ మెంట్ (ఈగల్)’ ఏర్పాటుకు బడ్జెట్ లో కేటాయింపులు జరిపినందుకు ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐ.టీ, విద్యా శాఖ మంత్రి లోకేశ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్ దళం ఆధునీకరణ పథకం (ఎం.ఓ.పి.ఎఫ్) కింద రూ.61.20 కోట్లను విడుదల చేసినట్లు హోంమంత్రి అనిత వివరించారు.
గంజాయి రహిత రాష్ట్రంగా మార్చేందుకు ‘నవోదయం 2.0’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. పెట్రోలింగ్ సహా పటిష్ట నిఘా వ్యవస్థలో భాగంగా పోలీస్ వాహనాల కొనుగోలుకు బడ్జెట్ పెద్దపీట వేసిందన్నారు. ఆల్కహాల్ డీ-అడిక్షన్ సహా వ్యసనాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం రూ.10 కోట్లు కేటాయించిందన్నారు. పాయకరావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా మత్స్యకారులు అధికంగా ఉన్న నేపథ్యంలో మత్య్సకార భరోసా కోసం రూ. 450 కోట్లు కేటాయించడం పట్ల హోంమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.
అసలైన సంక్షేమంతో పేద ప్రజలకు అండగా నిలబడేలా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టారన్నారు. తల్లికి వందనం కోసం రూ.9,407 కోట్లు, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం రూ.27,518 కోట్లు, ఆర్టీజీఎస్ కోసం రూ.101 కోట్లు, దీపం 2.0 పథకానికి రూ.2,601 కోట్లు, మత్స్యకార భరోసాకు రూ.450 కోట్లు, స్వచ్ఛాంధ్ర కోసం రూ.820 కోట్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకానికి రూ.3,486 కోట్లు, ఆదరణ పథకానికి రూ.1000 కోట్లు కేటాయించడమే అందుకు నిదర్శనమన్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిధులను విరివిగా తీసుకువస్తుందన్నారు. అమరావతి, పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులకు ప్రాధాన్యత కల్పిస్తూ రూ.3.22 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టడం మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.