ఒకసారి ఒకూరిలో పెద్ద కరువు వచ్చింది. ఒక్క వాన గూడా రాలేదు. దాంతో పశువులకు గడ్డి లేదు. జనాలకు తిండి లేదు. పక్షులకు గింజలు లేవు. అందరూ ఆకలికి తట్టుకోలేక అల్లాడి పోసాగినారు. నెమ్మదిగా ఒకొక్కరే చచ్చి పోసాగినారు. ఆ వూరిలో ఒక జమీందారు వున్నాడు. వాని దగ్గర లెక్క లేనంత డబ్బుంది. దానికి తోడు సంచుల సంచుల గింజలు వున్నాయి. కానీ వాడు పెద్ద పిసినారి. ఎంగిలి చేత్తో కాకిని కూడా అదిలించని రకం. పొట్ట చేత బట్టుకోని కళ్ళనీళ్ళతో బంధువులొచ్చినా సరే ‘నా దగ్గర ఏముంది. ఏమీలేదు’ అని తిరిగి వుత్త చేతులతో పంపించేటోడు. తన దగ్గర వున్నవి ఎవరికీ తెలియకుండా బాగా చీకటి పన్నాక, వూరంతా పండుకున్నాక వంట చేసుకోని తినేటోడు.
ఆ వూరిలో ఒక పక్షి వుంది. దానికి రెండు చిన్న చిన్న పిల్లలు వున్నాయి. ఆ పక్షి వాటికి గింజల కోసం వూరంతా కిందా మీదా పడి వెదికింది. కానీ ఒక్క గింజా దొరకలేదు. దాంతో తిండి లేక ఆ చిన్నపిల్లలు దాని కళ్ళ ముందే చచ్చిపోయినాయి. పాపం… ఆ పక్షి చానా బాధపడింది. ”అయ్యో… దేవుడా… ఎంత కానికాలం వచ్చింది. కళ్ళ ముందు పిల్లలూ, పశువులూ, మనుషులూ రాలిపోతా వున్నారు. ఎక్కడయినా ఎవరి దగ్గరయినా ఏమయినా వున్నాయేమో చూద్దాం” అంటా ఇల్లిల్లూ వెదకసాగింది.
అలా వెదుకుతా వెదుకుతా పోతా వుంటే అందరూ పండుకున్నాక ఈ జమీందారు ఇంటి పొగగొట్టంలోంచి పొగ బైటికి రావడం గమనించింది. కిటికీలోంచి లోపలికి దూరి గదీ గదీ వెదికింది. ఇంకేముంది సంచుల సంచుల గింజలు కనబడినాయి. ”అమ్మ దొంగల్లారా… ఎవరికీ తెలియగూడదని చీకటి పడినాక వండుకుంటున్నారా” అనుకోనింది.
లోపల పొయ్యి దగ్గర కూచోని జమీందారు పెళ్ళాం బియ్యం కడుగుతా వుంది. వెంటనే అది పైనుంచి
”చూశాలే చూశాలే పైనుంచి
దాగదులే దాగదులే నిజమింక
ఎంత వుండీ ఏం లాభం
దొంగబతుకు మీదంట
సిగ్గులేని ఈ బతుకు కన్నా
చావడమే మీకు నయమంట” అంటా పాట పాడింది. ఆ పాట విని ఆమె అదిరిపడింది. వురుక్కుంటా పోయి మొగునికి చెప్పింది. ఇద్దరూ కలసి ఇళ్ళంతా కిందికీ, మీదికీ వెదికినారు. ఎక్కడా ఎవ్వరూ కనబళ్ళేదు.
”సరే…. తొందరగా అన్నం ఎక్కించు. ఆకలైతా వుంది” అంటే ఆమె సరేనని అన్నం పప్పు చేసింది. మొగునికి పళ్ళెంలో వేడి వేడి అన్నం వడ్డించింది. కలిపి నోటిలో ముద్ద పెట్టుకుంటా వుంటే పైనుంచి
కరువురోజుల్లోనన్నా
కనికరం చూపించు
కాసిని గంజినీళ్ళన్నా
కరుణతో విదిలించు
నీవు చేసిన సేవ
చిరకాలం వుంటుంది
భూమిపై నీ పేరు
కలకాలం వుంటుంది” అంటా మళ్ళీ పాట వినబడింది.
జమీందారు ఎక్కడ నుంచి వినబడుతుందబ్బా ఈ పాట అని వెదుకుతే పైన పక్షి కనబడింది. కోపంగా రాయి తీసుకోని దాని మీదకు విసరబోతోంటే ”ఆగాగు… ఎందుకలా తొందరపడతావు. నిజం నిప్పు లాంటిది. ఈ రోజు కాకపోయినా రేపయినా విషయం వూరంతా తెలిసిపోతాది. ఆకలితో వున్న జనాలు తప్పు ఒప్పు అని చూడరు. మీ ఇంటిమీద పడి అన్నీ ఎత్తుకోని పోతారు. దానికన్నా ముందే నీవే వాళ్ళకి అన్నం పెడితే కనీసం మంచి పేరన్నా కలకాలం నిలబడుతుంది” అనింది.
దానికి జమీందారు వంకరగా నవ్వుతా ”ఈ విషయం బైట ఎవరికీ ఎప్పటికీ తెలీదు. నిన్ను కూడా ఇక్కడే ఇప్పుడే చంపి పాతిపెడతా” అన్నాడు.
దానికి ఆ పక్షి చిరునవ్వు నవ్వుతా ”నువ్వు నన్ను చంపినా చంపకపోయినా ఈరోజో రేపో ఎలాగూ ఆకలితో చచ్చిపోతాను. కానీ ఈ ఊరిలో నీతో పాటు కలసి బతుకుతా వున్న సాటి మనుషులు, పశువులూ, పక్షులూ కళ్ళముందే తినడానికి తిండి లేక చచ్చిపోతా వుంటే ఇలా ఒక్కనివే తినడానికి సిగ్గుగా అనిపించడం లేదా… మనిషి పుట్టుక పుట్టినాక కొంచమన్నా జాలీ, దయా లేకుంటే ఎలా…. ఏం పోయేటప్పుడు ఒక్క పైసన్నా మూట గట్టుకుపోతావా… ఆకలితో వున్న వాళ్ళని ఆదుకుంటే ఆ శిబి, దధీచిలాంటి మహాపురుషుల మాదిరి నీ గురించి గూడా ఎంత గొప్పగా చెప్పుకుంటారు రేప్పొద్దున” అనింది.
దానికి ఆ జమీందారు ”నీకేం ఎన్నయినా చెబుతావు. మరి నువ్వు గూడా జనం కోసం ఆ దధీచి లెక్క మంటల్లో దుంకమంటే దుంకుతావా… చూద్దాం” అన్నాడు ఎగతాళిగా.
దానికా చిన్న పక్షి ”నువ్వు నిజంగా మాట మీద నిలబడతానంటే చెప్పు. ఇదిగో ఇప్పుడే ఇక్కడే పదిమంది కోసం చావడానికి నేనెప్పుడూ సిద్ధమే” అంటా వాళ్ళ కళ్ళ ముందే సర్రున పోయి వంట వండిన పొయ్యిలో దుంకింది. అంతే… నిమిషాల్లో దాని వళ్ళంతా కాలిపోయి కళ్ళ ముందే గిలగిలలాడుతా చచ్చిపోయింది.
అది చూసి మొగుడూ పెళ్ళాలు ఇద్దరూ చలించిపోయినారు. కరిగి నీరయిపోయినారు. ”ఛ… ఛ… ఛ… ఆ పక్షికి వున్న తెలివి కూడా మనకు లేకపాయెనే. ఇంక ఈ వూరిలో మనమున్నంత వరకూ ఏ జీవి గూడా చచ్చిపోగూడదు. ఇదే ఆఖరు” అనుకున్నారు. అంతే…. తరువాత రోజు నుంచి వూరందరినీ ఒకచోట గుంపు చేసి కరువు పోయి వానలు పడేదాకా వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టినారు.
– డా.ఎం.హరికిషన్
కర్నూలు