– పోలీస్ స్టేషన్లలోనే బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ గూండాల దాడి
– పోలీసులూ….సిగ్గుతో తలదించుకోండి
– బెంగాల్ తరహా పాలనను తెలంగాణలో కొనసాగించే ప్రసక్తే లేదు
– కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందనే సంగతి గుర్తుంచుకోండి
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్
టీఆర్ఎస్ నాయకుల మాఫియా దందాకు పోలీస్ స్టేషన్లు అడ్డగా మారిపోయాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. న్యాయం కోసం సామాన్య ప్రజలు పోలీస్ స్టేషన్ కు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి దాపురించిందన్నారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై ప్రశ్నించే బీజేపీ కార్యకర్తలపై పోలీస్ స్టేషన్లలోనే టీఆర్ఎస్ గూండాలు దాడులు చేస్తున్నా ఏమీ చేయలేని దుస్థితిలో పోలీసులు ఉండటం సిగ్గు చేటన్నారు.
టీఆర్ఎస్ కు అంటకాగుతున్న పోలీసులు కేంద్రంలోనూ బీజేపీ అధికారంలో ఉందనే సంగతిని గుర్తుంచుకోవాలన్నారు. ఈరోజు నల్లగొండలో బీజేపీ ఆధ్వర్యంలో ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల జోనల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బండి సంజయ్ తోపాటు పార్టీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) శివప్రకాశ్ జీ, తమిళనాడు రాష్ట్ర వ్యవహారాల సహాయ ఇంఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, మంత్రి శ్రీనివాస్, బంగారు శ్రుతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రసంగించారు. అందులోని ముఖ్యాంశాలు….
రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేక వ్యక్తమవుతోంది. అందుకే మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రగిలించి రాజకీయ లబ్ది పొందే కుట్రకు కేసీఆర్ తెరదీశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను పూర్తిగా కేంద్రాన్ని తిట్టడానికే వెచ్చించారు. బీజేపీ ఎమ్మెల్యేలను ఏ కారణం లేకుండానే నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తారని… నిలదీస్తారనే భయంతోనే వాళ్లను సస్పెండ్ చేశారు. వారిని సభలోకి అనుమతించే అంశాన్ని పరిశీలించాలని కోర్టు ఆదేశాలిచ్చినా వాటిని తుంగలో తొక్కారు.
తెలంగాణకు కేంద్రం ఏమీ ఇవ్వలేదని బదనాం చేసే కుట్ర చేస్తున్నరు. వాస్తవానికి నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వమే తెలంగాణలో అన్ని గ్రామాల అభివ్రుద్ధికి నిధులిస్తోంది. ఉజ్వల గ్యాస్ కనెక్షన్ల మొదలు రేషన్ బియ్యం, రోడ్ల నిర్మాణం, స్వచ్ఛ భారత్ మరుగుదొడ్లు, రైల్వే ప్రాజెక్టులు సహా ప్రతి గ్రామంలో జరుగుతున్న హరితహారం, ప్రక్రుతి వనం, స్మశానవాటికల, రైతు వేదికల నిర్మాణాలక అయ్యే నిధులన్నీ కేంద్రం ఇస్తున్నవే. అయినా కేంద్రం ఇవ్వలేదని టీఆర్ఎస్ రాజకీయ లబ్ది కోసం బీజేపీని బదనాం చేస్తోంది.
రాష్ట్రంలో టీఆర్ఎస్ మోసాలు ప్రజలకు అర్ధమైనయ్. దళిత బంధు, దళితులకు మూడెకరాలు, నిరుద్యోగ భ్రుతి, ఉద్యోగాల భర్తీ సహా కేసీఆర్ ప్రభుత్వం ఇఛ్చిన హామీలేవీ అమలు చేయడం లేదని గ్రహించి ఎక్కడికక్కడ నిలదీస్తున్నరు. దీనిని దారి మళ్లించేందుకే కేంద్రాన్ని బదనాం చేసే కుట్రకు కేసీఆర్ తెరలేపారు.
మొన్న జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 4 రాష్ట్రాల్లో విజయం సాధించింది. దీనికి కారణం ఆయా రాష్ట్రాల్లో బీజేపీ అమలు చేస్తున్న అభివ్రుద్ధి, సంక్షేమ పథకాలే. టీఆర్ఎస్ పాలనలో కేంద్ర నిధులు పూర్తిగా దారి మళ్లుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం లేదు. కేంద్ర పథకాలను పూర్తి నీరు గారుస్తున్నారు. దీనిని ద్రుష్టిలో ఉంచుకుని డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నరు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే మేలు జరుగుతుందనే భావిస్తున్నారు.
ఈ విషయాన్ని తట్టుకోలేని టీఆర్ఎస్ నేతలు బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నరు. నిన్న సిరిసిల్లలో యువకుడిపై అకారణంగా దాడి చేశారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తే మద్యం తాగిన టీఆర్ఎస్ గూండాలు దాదాపు 200 మంది నేరుగా పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి బీజేపీ కార్యకర్తలపై దాడి చేశారు. బీజేపీ కార్యకర్తలు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నా పోలీసులు కాపాడలేని పరిస్థితి. దాడి చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలపై కేసు నమోదు చేస్తామని తొలుత చెప్పిన పోలీసులు ఆ తరువాత మాట మార్చి బీజేపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం సిగ్గు చేటు. పైగా దాడి చేసిన టీఆర్ఎస్ కార్యకర్తల ఇండ్లకు వెళ్లి మంత్రులు పరామర్శించడం సిగ్గు చేటు.
టీఆర్ఎస్ గూండాల దాడిలో గాయపడ్డ బీజేపీ కార్యకర్తలను పరామర్శించడానికి వెళుతున్న బీజేపీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్, మాజీ మంత్రి చంద్రశేఖర్ సహా బీజేపీ నేతలను అడ్డుకుని స్టేషన్ కు తరలించడం బాధాకరం. రాష్ట్రంలో రజాకార్ల పాలన కొనసాగుతోంది. సామాన్య ప్రజలు స్టేషన్ కు వెళ్లాలంటేనే భయపడుతున్నరు. పోలీసులు సిగ్గుతో తలదించుకోవాలి. కొందరు ఐపీఎస్ లు టీఆర్ఎస్ తొత్తుల్లా మారారు. వారి వల్ల పోలీస్ వ్యవస్థ దారి తప్పుతోంది. శాంతిభద్రతలు కాపాడాల్సిన వాళ్లే సమస్యను స్రుష్టిస్తున్నరు.
గతంలోనూ సిరిసిల్లలో, నల్లగొండలో, వరంగల్ లో, నిజామాబాద్ లో, పాలమూరు లొ, నిర్మల్ లో, ఆదిలాబాద్ జిల్లాలోనూ బీజేపీ కార్యకర్తలను టార్గెట్ చేసి టీఆర్ఎస్ గూండాలు పోలీసుల సమక్షంలోనే దాడులు చేశారు. టీఆర్ఎస్ మాఫియాకు పోలీస్ స్టేషన్లను అడ్డాలుగా మార్చారంటే పోలీసులు సిగ్గుతో తలదించుకోవాలి. అలాంటి వాళ్లు …. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందనే సంగతిని గుర్తుంచుకోవాలి.
పోలీసులారా… గుండెపై చేయి వేసుకుని చెప్పండి. మీ డ్యూటీ సక్రమంగా నిర్వర్తిస్తున్నారా? సామాన్య ప్రజలను, బీజేపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం న్యాయమేనా? టీఆర్ఎస్ నేతల అక్రమాలు, అవినీతిని ప్రశ్నిస్తే నాన్ బెయిల్ కేసులు పెట్టేలా హుకూం జారీ చేస్తారా?. బెంగాల్ తరహా పాలన ఇక్కడ కొనసాగుతోంది. ఇది తెలంగాణ. టీఆర్ఎస్ ఆటలను కొనసాగించబోం. తెగించి కొట్లాడే బీజేపీ కార్యకర్తలున్నరు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం బీజేపీ కార్యకర్తలు ఇకపై మరింతగా తెగించి కొట్లాడాలి. ప్రజా స్యామ్య తెలంగాణ నిర్మాణం కోసం పోరాడాలి. కేంద్ర సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కేంద్ర నిధులను టీఆర్ఎస్ ప్రభుత్వం దారి మళ్లిస్తున్న విషయాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అంతిమంగా ప్రజాస్వామ్య తెలంగాణ సాధన కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఉద్యమించాలి.
రాష్ట్రంలో ఇప్పటి వరకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఆర్ఎస్ లకు ప్రజలు అధికారం ఇచ్చారు. ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తుంచుకుని టీఆర్ఎస్ అవినీతి-కుటుంబ-నియంత పాలనపై పార్టీ కార్యకర్తలు, నాయకులందరం కలిసికట్టుగా పోరాడదాం. కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా బీజేపీ అండగా ఉంటుంది. టీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడే వరకు పోరాటానికి కొనసాగించాలని కోరుకుంటున్నా..