చరిత్రను, చరిత్రలో విజయాలను, అణచివేతను ప్రస్తుత సమాజానికి వివరించిన నాడే వర్తమానంలో ఎలాంటి ఉద్యమాలు చేయాలో నిర్ణయించబడుతుంది. వర్తమాన ఉద్యమాలు విజయవంతమై వాటి ఫలితాల ద్వారానే ప్రజల భవిషత్, జీవన ప్రమాణాలు నిర్ణయించబడుతాయి. ఈ క్రమంలో మన దేశ మెజార్టీ ప్రజల విముక్తికోసం పోరాటం చేసిన ఆయా వర్గాల బహుజన ఉద్యమ నాయకుల చరిత్రను ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రస్తుత ఉద్యమ నాయకత్వంపై వుంది.
నియంత పాలనకన్నా చైతన్య రాహిత్యం అత్యంత ప్రమాదకరమని మహానీయులు బోధించిన తీరును ఒకసారి మననం చేసుకుంటే బహుజన మహనీయుల పోరాట చరిత్ర, ప్రస్తుత స్థితి అర్ధమవుతుంది. వాస్తవ పోరాట చరిత్ర, త్యాగాలు చెప్పనంతకాలం, శత్రువు ఎవరో, మిత్రువు ఎవరో ప్రజలకు తెలుపనంతకాలం చైతన్య రాహిత్యంతో నియంత పాలన కొనసాగి ప్రజలు మరింత బానిసలై దోపిడి పీడనలకు గురవుతారు.
బహుజన మహనీయుల చరిత్రను అంబేడ్కర్ బయటపెట్టేవరకు మెజార్టీ ప్రజలకు దేశంలో జరిగిన అణచివేత, బానిసత్వం గురించి కనీస అవగాహన కూడా లేదు. ప్రజల కోసమే ప్రాణాలు అర్పించిన వీరుల గురుంచి, తమ వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని వదులుకొని తమ చివరి శ్వాస వరకు త్యాగపూరిత ఉద్యమాలు చేసిన మహానీయుల చరిత్ర మెజార్టీ ప్రజలకు తెలియాల్సి వుంది.
అంబేడ్కర్ కన్నా ముందుతరం మహానీయుల చరిత్రతో పాటు అంబేడ్కర్ సమకాలీకుల చరిత్రను అంబేడ్కర్ తన రచనల ద్వారా ప్రజలకు తెలియజెప్పారు. అంబేడ్కర్ రచనలను ఎంతో మంది రచయితలు ఆయా ప్రాంతీయ భాషల్లోకి అనువాదం కూడా చేశారు. అంబేడ్కర్ తర్వాత కాన్షీరాం తదితర రచయితలు, ఉద్యమకారులు మహానీయుల చరిత్రను ప్రచారం చేయడంలో వారి శక్తికి మించి కృషి చేస్తున్నారు. ముద్రణ రూపంలో, కళారూపాల్లో ప్రజలకు తెలియజేస్తున్నారు.
ప్రజల సమస్యలు, ఉద్యమాల నుండి అద్భుతమైన వాగ్గేయకారులు పుట్టుకొచ్చి వారి త్యాగపూరిత కళారూపాలతో మహాద్బుతంగా ఉద్యమాలను పదును పెట్టిన చరిత్ర కళాకారులకుంది. హక్కుల సాధనలో, పీడిత ప్రజల విముక్తి పోరాటంలో, దేశ స్వాతంత్ర పోరాటంలో, తెలంగాణ విముక్తి పోరాటంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో కళాకారుల పాత్ర కీలకమైనది. అలాంటి కళాకారులు నేడు బహుజన సమాజం ఐక్యత కోసం, బహుజన రాజ్య స్థాపన కోసం ముందు వరుసలో నడవడం మంచి పరిణామం.
ఈ క్రమంలో బహుజన మహనీయుల జయంతి మాస ఉత్సవాల సందర్భంగా గత నెలలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో బహుజన ధూందాం నిర్వహించి తెలంగాణలో బహుజన ఉద్యమాల్లో కొత్త కదలికను ప్రారంభించారు. మహానీయుల చరిత్ర ప్రజలకు తెలియజెప్పడంలో కళాకారుల పాత్ర చాలా కీలకమైన తరుణంలో ఆ కళాకారులు ముందుకొచ్చి బహుజన ధూందాం పేరున మహానీయుల చరిత్రను ప్రజలకు తెలియజెప్పడం వల్ల బహుజన ప్రజల మధ్య ఐక్యత పెరిగి బహుజన ఉద్యమాలకు, మెజార్టీ ప్రజలకు మరింత మేలు జరుగుతుంది.
విలువలు, స్వేచ్ఛ, సమానత్వం కోసం బుద్ధుడు మొదలుకొని మహాత్మా జ్యోతిరావు పూలే, అంబేడ్కర్, లాంటి మాహానుబావులతో పాటు ప్రజలకోసం త్యాగం చేసిన మరికొంతమంది మహనీయులను గుర్తుచేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. జైన మహావీరుడు, ఆచార్య నాగర్జనుడు, బసవేశ్వరుడు, అక్కమహాదేవి, హరలయ్య, చెన్నయ్య, పాల్కుర్కి సోమన్న, కబీర్, రవిదాస్, మీరాబాయి, తుకారాం, చొక్కామేళా, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, కక్కయ్య, సిద్దయ్య, వేమన, దున్న ఇద్దాసు, అమ్మ సావిత్రిబాయి, అమ్మ రమాబాయి, అమ్మ షేక్ ఫాతిమా, నారాయణగురు, సాహుమహారాజ్, పెరియార్, పండిత అయోతి దాస్, అయ్యంకాలి, మహాకవి గుర్రం జాషువా, భాగ్యరెడ్డి వర్మ, అరిగె రామసామి, బద్ధుల శ్యామ్ సుందర్, బి.ఎస్. వెంకట్రావు, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, బండి యాదగిరి, బోయి భీమన్న, సుద్దాల హనుమంతు, వట్టికోట అల్వారుస్వామి, మగ్ధుమ్ మొయినోద్దీన్, అమ్మ ఈశ్వరి బాయి, అమ్మ సధాలక్ష్మి, శివసాగర్, మారోజు వీరన్న, గూడ అంజన్న, వంగపండు, బొజ్జా తారకం, బోయ జంగయ్య, అలిశెట్టి ప్రభాకర్, సాహు, కలేకూరి ప్రసాద్, చుక్క సత్తయ్య, చిందుల ఎల్లమ్మ, మిద్దె రాములు, ఉ. సాంబశివరావు లాంటి గొప్ప మహానీయులను కూడా మననం చేసుకొని వారి వారసత్వాన్ని కొనసాగించాల్సిన బాధ్యతను “బహుజన ధూందాం” పేరుతో బహుజన కవులు, కళాకారులు తీసుకోవడం గర్వించదగిన విషయం.
ఎంతోమంది మహానీయుల నిస్వార్థ త్యాగాలు, అనితర సాధ్యమైన పోరాటాల వల్ల మన సమాజం ఈమేరకు పురోభివృద్ధిని సాధించింది. స్వేచ్ఛ, సమానత్వం, సహోదరత్వం, న్యాయం, విలువలతో కూడిన ప్రజాస్వామ్య సమాజాన్ని నిర్మించే సంఘపరివర్తన ఉద్యమాలు చేసిన మహనీయలను ఎత్తిచూపుతూ హైదరాబాద్ నగరం నడిబొడ్డున ‘బహుజన ధూందాం’ (రిథం ఆఫ్ ది బహుజన కల్చర్) జరపడం వల్ల బహుజన ఉద్యమాలకు బలం చేకూరి బహుజన రాజ్య స్థాపనకు బాటలు వేసినారు. సబ్బండ గానరీతులకు, కళారూపాలకు, పాటలకు నెలవైన తెలంగాణలో ఎన్నో ఉద్యమాల విజయం వెనుక కవులు, కళాకారుల పాత్ర కీలకమైంది. తెలంగాణ సాధనకోసం జరిగిన పోరాటంలో ప్రముఖపాత్ర వహించిన కళాకారులు బహుజన రాజ్యాధికార దిశగా సాగే ఉద్యమంలో కూడా కీలకపాత్ర వహించాల్సిన బాధ్యతను గుర్తించిన కళాకారులు తెలంగాణ ధూందాం లాగానే పల్లెపల్లెన “బహుజన ధూందాం” నిర్వహించడం బహుజన ఉద్యమాలకు కీలక మలుపవుతుంది.
ఈ సమాజాన్ని భూతల స్వర్గం చేయడానికి తమ జీవితాలను అంకితం చేసిన మహనీయుల చరిత్రను కళారూపాలతో చాటిచెప్పుతూ బహుజన జాతుల సంస్కృతిని సగర్వంగా చాటి మహనీయుల పోరాటాలను, త్యాగాలను నెమరువేసుకోకడమే కాకుండా వారు సాధించిన విజయాలను నేటి తరం బహుజన ప్రజలకు తెలియజెప్పుతూ ప్రతి వ్యక్తిలో బహుజన ఐక్యతా స్ఫూర్తి నింపడం కోసం ఆట, పాట చాలా కీలకమైన తరుణంలో రాజకీయ పార్టీలకతీతంగా కళాకారులు తెలంగాణ కళాకారులు ఉమ్మడిగా నిర్వహిస్తున్న మహోన్నత సాంస్కృతిక ప్రదర్శన “బహుజన ధూందాం” తెలంగాణలో సంఘ పరివర్తనకు ఎంతగానో ఉపయోగపడడమే కాకుండా రానున్న కాలంలో బహుజన రాజ్య స్థాపనకు ఎంతో ఉపయోగపడుతుంది.
తెలంగాణలో జరిగిన అణచివేతపై ఆట, పాట ద్వారా యుద్ధం చేసిన ప్రజా యుద్ధ నౌక గద్దరన్న, అరుణోదయ విమలక్క లాంటి కళాకారులెందరో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా గజ్జె కట్టి ఆడి పాడి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించారు. కవులు, కళాకారుల అంకితభావాన్ని గమనించిన కెసిఆర్ రాష్ట్ర సాధన తర్వాత మెజార్టీ కళాకారులను ఉద్యోగాల పేరుతో బంధించి తన పాలనని పొగిడే ఆస్థాన కళాకారులుగా మార్చుకొని పాలన కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలో గద్దరన్న, విమలక్క, మాస్టర్జీ, మచ్చ దేవేందర్ లాంటి ప్రజా కళాకారులు స్వతంత్ర కళాకారులుగా కొనసాగుతూ నేటికి ప్రజల గొంతుకగా కొనసాగడం గొప్ప విషయం. తెలంగాణ రాష్ట్ర సాధనకన్నా ముందునుండి ప్రజల పక్షాన పాడిన కళాకారులతో పాటు తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత పుట్టుకొచ్చిన కళాకారులు ఏకమై నేడు ప్రజల కోసం పాడుతున్నారు. కొత్త పాత కళాకారుల కలయికతో ముందుకు దూసుకెళుతున్న “బహుజన ధూందాం” బహుజన ఉద్యమాలకు కొత్త జవసత్వాలనిస్తుంది.
బహుజన కళాకారుల ఆట పాట ద్వారా ఎన్నో రాజ్యాలు మారి కొత్త రాజ్యాలు ఏర్పడ్డాయి. బహుజన ఓటు ద్వారా రాజ్యాలు మారినా బహుజన ప్రజల బతుకులు మాత్రం మారడం లేదు. ఓట్లు మావి సీట్లు మీవా? ఇకపై చెల్లదు అంటూ పోరాటాలు జరుగుతున్న సమయంలో తెలంగాణలో జరుగుతున్న బహుజన ధూందాం కీలక భూమిక పోషిస్తుంది. వేల ఏండ్లుగా ఉత్పత్తిలో, శ్రమలో పాల్గొంటూ రాజ్యాధికారానికి దూరమై స్వాతంత్రానికి పూర్వం కట్టు బానిసలుగా స్వాతంత్ర అనంతరం ప్రజాస్వామిక బానిసలుగా కొనసాగుతున్న బహుజనులు అంబేడ్కర్ ఇచ్చిన ఓటు ఆయుధంతో రాజ్యాధికారం చేపట్టాలని దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాలకు బహుజన ధూందాం ఎంతగానో బలం చేకూర్చుతుంది.
(మే 28 న హన్మకొండలో జరుగు బహుజన ధూందాం సందర్భంగా)
-సాయిని నరేందర్
సామాజిక విశ్లేషకులు
9701916091