Suryaa.co.in

Telangana

భూమిని త్యాగం చేసే రైతుకు లాఠీదెబ్బలు…లాభార్జనే ధ్యేయమైన వ్యాపారులకు రెడ్ కార్పెట్లా…?!

‘బలవంతంగా భూమిని గుంజుకోవడం, బక్క రైతుపై లాఠీ ఝుళిపించడం.. దీనిని అభివృద్ధి అంటారా? అరాచకం అంటారా?’ అని మంత్రి కేటీఆర్ ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో నిమ్జ్ భూనిర్వాసితులను పోలీసులు అరెస్ట్ చేసి, వారిపై లాఠీచార్జ్ చేయడంపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమిని త్యాగం చేసే రైతుకు లాఠీదెబ్బలు.. లాభార్జనే ధ్యేయమైన వ్యాపారులకు రెడ్ కార్పెట్లు పరుస్తారా? అని విమర్శించారు.

మంత్రి కేటీఆర్ బుధవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఎంజీ కంపెనీ ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్‌ వెహికల్‌ పార్కును ప్రారంభించారు. అయితే, జహీరాబాద్ లో నిమ్జ్ కోసం తమ భూములు తీసుకొని తగిన పరిహారం ఇవ్వలేదని అక్కడి రైతులు చాన్నాళ్ల నుంచి ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ పర్యటనను అడ్డుకుంటారని నిమ్జ్ భూ నిర్వసితులను పోలీసులు వారి గ్రామాల్లోకి వెళ్లి ముందస్తు అరెస్టు చేశారు. కేటీఆర్ కార్యక్రమానికి వెళ్తున్న కొందరిపై లాఠీచార్జ్ చేశారు. దీనికి సంబంధించి పత్రికల్లో వచ్చిన వార్తలను ట్విట్టర్ లో షేర్ చేసిన రేవంత్.. కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు.

LEAVE A RESPONSE