Suryaa.co.in

Entertainment

సాహసాల శపథం.. విజయాల పథం..!

ఆ బ్యానర్ పేరు పద్మాలయ
కాని అసలు పేరు సాహసాలయ..
ఎన్ని ప్రయోగాలు..
ఎన్నెన్ని విజయాలు..
తెలుగు చిత్రసీమలో
అన్ని రికార్డులూ
ఆ సంస్థవే..
టాలీవుడ్ ని
హాలీవుడ్ స్థాయికి తీసుకువెళ్లిన నిర్మాత..
తెలుగు బైస్కోపుకి
సినిమా స్కోపు హంగులద్ది
సెవెంటీ ఎం ఎం
సొబగులు సైతం
సమకూర్చిన ధీశాలి
సూపర్ స్టార్ కృష్ణ..
సాహసాల తృష్ణ!

మెకన్నాస్ గోల్డ్ మూవీ చూసి
ఇలాంటి ఓ సినిమా
మన దేశంలో
ఎప్పుడైనా వస్తుందా
అనుకుంటుండగానే
అంతే స్థాయిలో
కళ్ళ ముందు ఆవిష్కరించిన
మోసగాళ్ళకు మోసగాడు
అటు పిమ్మట అదే దూకుడుతో
చాలాకాలం సాగాడు..
రాజస్థాన్ ఎడారుల్లో
తలపై టోపీలు..
బొడ్డున తుపాకులతో
గుర్రాలపై వీరులు..
నాగభూషణం ఉరి తప్పిస్తూ కృష్ణ పేల్చిన రైఫిళ్ళ మోతలు..
ఓహ్..ఎప్పటికీ మర్చిపోలేని
ఆ కతలు..!

నటరత్నతో నటశేఖర..
క్రేజీ కాంబినేషన్..
అంతవరకు
గల్లా ఫాంటులతో
కనిపించిన ఎన్టీఆర్ నేరోకట్లో
పెద్దపెద్ద కటౌట్లో..
ఆ ఇద్దరు
బాక్సాఫీస్ వీరులేగా అబ్బురంగా
దేవుడు చేసిన మనుషులు..
ఆ వేడి నుంచి
తేరుకోక మునుపే
మరో విప్లవం..
ఈసారి సినిమాస్కోపులో
అల్లూరి సీతారామరాజు వీరవిహారం..
పెద్దాయన అలిగినా
వెనక్కి తగ్గని ఆత్మగౌరవం
ఓ గొప్ప చరిత్రని ఆవిష్కరించిన వాస్తవం..!
దేవదాసు మరో ప్రయోగం
ఆగని సాహసాల యాగం
తగ్గని వేగం…
కృష్ణకు అభిమానులు వేసిన
తిరుగులేని సింహాసనం..!

సాహసం ఆయన ఊపిరి
తలకు మించినదైనా
వెన్ను చూపని మగసిరి..
ఆ తెగువతోనే అగ్రనాయకులతో సైతం
చేశాడు కురుక్షేత్ర యుద్ధం..
రాజీ పడని సిద్ధాంతం
రాజకీయాల్లో సైతం
అడుగుపెట్టి చేయించింది
రాద్ధాంతం..
అలిగిన అన్నకే అల్లూరిని చూపించి శెభాష్ అనిపించుకున్న ప్రతిభ..
346 సినిమాల
రికార్డు వరకు వెలిగిపోయిన
సూపర్ స్టార్ శోభ!
నిర్మాతల హీరోగా
చిరస్థాయిగా
నిలిచిపోయిన ప్రభ..
మొత్తానికి ఘటికుడీ ఘట్టమనేని…!

సూపర్ స్టార్ కృష్ణకు ప్రణామాలతో..

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE