Suryaa.co.in

Telangana

హిందువుల మనోభావాలు గౌరవించి సెలవుదినం ప్రకటించాలి

– 22న సెలవు ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరిన విశ్వహిందూ పరిషత్
– దీపావళిని మించిన మరో పవిత్ర సుదినం జనవరి 22

అయోధ్యలో భవ్యమైన రామ మందిరం ప్రారంభం.. శ్రీ బాల రాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది హిందువుల చిరకాల స్వప్నం సాకారమవుతున్న వేళ జనవరి 22వ తేదీ హిందువులకు పవిత్రమైన దినమని పేర్కొంది. దీపావళిని మించిన మరో వేడుక అని గర్వంగా వివరించింది.

ఈ మేరకు శనివారం తెలంగాణ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి కార్యాలయంలో విశ్వహిందూ పరిషత్ నేతలు వినతి పత్రం సమర్పించారు. దాదాపు 500 సంవత్సరాల నిరీక్షణ ఫలించిన శుభ సందర్భంగా ఆబాల గోపాలం ఆనందంతో గడపాల్సిన తరుణం ఆసన్నమైందని.. జనవరి 22వ తేదీన పెద్ద ఎత్తున వేడుకలు.. పండుగలు నిర్వహించుకునేందుకు హిందూ సమాజం సిద్ధమైందని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పండరినాథ్ , రాష్ట్ర ఉపాధ్యక్షులు జగదీశ్వర్ , రాష్ట్ర సహకార దర్శి భాను ప్రసాద్ , రాష్ట్ర సంపర్క్ ప్రముఖ్ వెంకటేశ్వర రాజు గారు, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్ దళ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ శివ రాములు అన్నారు.

జనవరి 22న హిందువులకు సరికొత్త పండుగ దినమైనందున దేవాలయాలు.. మఠాలు.. పీఠాలు వేడుకలకు ముస్తాబైనట్లు నాయకులు చెప్పారు. అందులో భాగంగానే ప్రతి ఒక్కరూ పండుగ వాతావరణం లో ఆనందంగా గడపాల్సిన సందర్భంగా 22వ తేదీన ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని వారు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా జనవరి 22న కేంద్ర ప్రభుత్వం కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు.. అంటే అర పూట సెలవు ప్రకటించిన విషయం గుర్తు చేశారు.

దానితోపాటు దేశంలోని అనేక రాష్ట్రాలలో సెలవు దినం ప్రకటిస్తూ ఆయా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి హిందువుల మనోభావాలను గౌరవిస్తూ అయోధ్య లో జరుగుతున్న బాల రాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా సెలవు ప్రకటించాలని విశ్వహిందూ పరిషత్ నేతలు డిమాండ్ చేశారు.

అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుద్దామనుకుంటే ఆయన విదేశాలలో ఉండటం.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అందుబాటులో లేకపోవడంతో సచివాలయంలోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓ ఎస్ డికి ప్రతి పత్రం సమర్పించినట్లు విశ్వహిందూ పరిషత్ నేతలు పేర్కొన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటిస్తూ విడుదల చేసిన జీవో కాపీని కూడా జత చేసినట్లు చెప్పారు.

LEAVE A RESPONSE