-
ఎల్జీపాలిమర్స్ నుంచి వరస వైఫల్యాలు
-
పరిశ్రమల్లో పేలుళ్లు, వరస మరణాలు
-
డజన్లపై పైగా కార్మికుల మృతి
-
అయినా చర్య తీసుకోని గత వైసీపీ సర్కారు
-
వైసీపీ అండ తో పాతుకుపోయిన ఖర్మ
-
కూటమి హయాంలోనూ ఆయనదే హవా
-
ఆయనపై ఓ బాధితుడి ఫిర్యాదు
-
దానిపై విచారణను తిరిగి ఆయనకే అప్పగించిన కార్మిక మంత్రి
-
ఆ సాకుతో మరొక అధికారిని సస్పెండ్ చేసిన ఖర్మ
-
సస్పెన్షన్‌ను కోర్టు కొట్టివేసినా పోస్టింగ్ ఇవ్వని ధిక్కారం
-
ఖర్మపై ఫిర్యాదును పట్టించుకోని ప్రిన్సిపల్ సెక్రటరీ
-
ఆ శాఖలో తమ్ముడు రాజుగారిదే పెత్తనం
-
ఆయన కంపెనీకే థర్ఢ్ పార్టీ సేఫ్టీ ఏజెన్సీ పెత్తనం
-
బావగారికి కారు సమర్పించుకున్న ఖర్మ గారి తమ్ముడుగారు
-
బావగారితో కోట్ల డీలింగ్ చేసుకున్న తమ్ముడుగారి మేనేజ్‌మెంట్
-
కొసరు బావగారి పెత్తనంతో కార్మిక శాఖ బెంబేలు
-
పేషీలో బైఠాయించి అడ్డగోలు ఆదేశాలు
-
కార్మిక శాఖ వ్యవహారంపై సీఎంఓకు ఫిర్యాదుల వెల్లువ
( మార్తి సుబ్రహ్మణ్యం)
కీలకమైన కార్మికశాఖకు ఆయనో ఖర్మగా మారారు. ఏళ్ల తరబడి అదే విభాగంగా పాతుకుపోవడంతో, ఆ విభాగంలో ఆయన చెప్పిందే వేదం. చేసిందే శాసనం. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో వరసగా 15 ఏళ్లు పనిచేయటంతో, ఉత్తరాంధ్ర ఫ్యాక్టరీ వ్యవహారాలన్నీ కొట్టిన పిండి. పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఆయనదే. కానీ ఎల్జీపాలిమర్స్ నుంచి ఇప్పటివరకూ ఆయన హయాంలో జరిగిన పేలుళ్లు, మృతుల సంఖ్యకు లెక్కలేదు. అయినా ఆయనను కదిలించే దమ్ము ఎవరికీ లేదు. గత వైసీపీ హయాంలో విశాఖను ఏలిన ఓ ఎంపీగారిని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించి.. మరికొద్దినెలల్లో రిటైరవుతున్న ఈ ఖర్మగారికి, మరో రెండేళ్లు పొడిగింపు ఇవ్వాలని, ఓ ‘మిశ్రమ్మ’ కమిటీ సిఫారుసు చేసేందుకు సిద్ధంగా ఉన్నారట.
స్టేక్ హోల్డర్సయిన యూనియన్లు, పరిశ్రమ వర్గాలతో మీటింగ్ పెట్టించకుండా తప్పుదోవపట్టించి, తనకు కావలసిన నివేదిక ఇప్పించుకున్నారన్నది ఒక ఆరోపణ. ఖర్మ గారు బాగా పనిమంతుడని, రిటైరయినా ఆయననే కొనసాగించాలని సిఫార్సు చేయించుకున్నారన్నది గుసగుస.
కార్మిక మంత్రిగా ఎవరొచ్చినా ఆయన చెప్పింది వినాల్సిందే.ఆయన ఇచ్చే ఆఫర్స్ అలాంటివి మరి! ఖర్మ గారి తమ్ములుం గారికి ఓ థర్ఢ్‌పార్టీసేఫ్టీ ఏజెన్సీ ఉంది. కాబట్టి.. రాష్టంలోని కంపెనీలన్నీ తమ్ములుం గారి ఏజెన్సీతో, సేఫ్టీ ఆడిట్ వర్క్ చేసుకోవలసిందే. లేకపోతే ఆ కంపెనీలకు ఇబ్బందులు తప్పవు మరి. తమ్ములుం గారి థర్డ్‌పార్టీ సేఫీ ్టఏజెన్సీ, చార్జి ఎంత చెబితే అంత ఫ్యాక్టరీలు చెల్లించాల్సిందే.
పేలుళ్లు జరిగిన కంపెనీని ముందు మూసేయడ ం.. తర్వాత కంపెనీలతో మాట్లాడుకుని, కొన్ని వారాల్లోనే వాటిని తెరిపించడం ఈ ‘ఖర్మ’ ఆర్ట్ ఆఫ్ లివింగట. అందుకు వారధులు, సారథులు డిప్యూటీ చీఫ్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ జిల్లా అధికారులే. ప్రస్తుతం ఈ ఖర్మ గారికి కార్మికశాఖలో పెత్తనం చేస్తున్న ‘కొసరు బావ’గారు సింకయ్యారట.
ఖర్మ గారి తమ్ముడు రాజు గారి ఏజెన్సీకి.. మొత్తం రాష్ట్రంలోని కంపెనీలకు థర్ఢ్‌పార్టీ సేఫ్టీ ఏజెన్సీ కాంట్రాక్టు ఇచ్చేందుకు బావగారికి, ఓ పెద్ద కారు బహుమతిగా సమర్పించుకున్నారట. సదరు బావగారు కార్మికశాఖ పేషీలో తిష్టవేసి, దందాల పర్వం కొనసాగిస్తున్న వైనం, అటు నిఘా విభాగానికీ చేరిందట. ప్రస్తుతం అనేక విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్మిక శాఖ ప్రముఖుడికి.. ఈ కొసరు బావగారు, మరో శేఖరుడూ తలనొప్పి సృష్టిస్తున్నారట.
ఇప్పటికే ఈ శాఖ యవ్వారాలు తెలిసిన సీఎం చంద్రబాబు.. సదరు ప్రముఖుడిని పిలిచి, రెండుసార్లు తలంటుపోశారన్నది సచివాలయ వర్గాల సమాచారం. అయినా ‘కొన్ని బలీహ నతల’ వల్ల ఆ ప్రముఖుడు, వారిద్దరినీ వదులుకోలేకపోతున్నారన్నది సచివాలయ వర్గాల్లో జోరుగా జరుగుతున్న చర్చ. ఇంతకూ ఆ ప్రముఖుడి బలహీనతలను వారిద్దరూ వాడుకుంటున్నారా? అసలు ఆ ముగ్గురి మధ్య ఉన్న రహస్యబంధం ఏమిటి? ఇప్పుడు ఇదే కార్మిక శాఖలో హాట్ టాపిక్.
డజన్లమంది చనిపోతున్నా డైరక్టర్‌పై చర్యలేవీ?
విశాఖలో ఎల్జీ పాలిమర్స్ విషాదంలో 12 మంది.. అనకాపల్లి జిల్లా సాహితి ఫార్మాలో 6 గురు.. నూజివీడు పోరస్ లాబరేటరీస్‌లో 10 మంది.. అచ్చుతాపురం ఎసెన్షియా ఫార్మాలో 17 మంది.. పరవాడలోని సినర్జీన్ ఫార్మాలో నలుగురు.. పరవాడలోని టాగూర్ లాబరేటరీస్‌లో ఇద్దరు కార్మికులు చనిపోయారు. గోదావరి జిల్లాల్లోని ఫ్యాక్టరీల్లో కూడా 14 మంది కార్మికుల వరకూ మృతి చెందారు. ఈ ఫ్యాక్టరీలను అక్కడున్న డిప్యూటీ చీఫ్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఎప్పటికిప్పుడు తనిఖీ చేస్తుంండాలి. దానిని డైరక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ పర్యవేక్షించాలి.
2014లో అప్పటి సీఎం చంద్రబాబునాయుడు, సెంట్రల్ ఇన్స్‌పెక్షన్ సిస్టమ్ విధానం తీసుకువచ్చారు. ఆ ప్రకారంగా తమకు అప్పగించిన ఫ్యాక్టరీలను, ఈ డిప్యూటీ చీఫ్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ తనిఖీ నిర్వహించాలి. కానీ ప్రస్తుతం అనకాపల్లిలో కొనసాగుతున్న ఖర్మగారి విధేయ ఆధికారి ఒకరు.. విజయనగరం జిల్లాల్లో పనిచేస్తుండగా, ఆయన ఎల్జీపాలిమర్స్, ఎసన్షియా, సినర్జీ కంపెనీలు తనిఖీ చేయాల్సి ఉన్నప్పటికీ తనిఖీ చేయలేదు. ఫలితంగా డజన్ల మంది కార్మికులు మృత్యువాత పడ్డారు.
మంత్రి చెప్పినా డోంట్ కేర్
సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారమైతే.. సదరు అధికారిపై డైర క్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ చర్యలు తీసుకోవాలి. కానీ ఆయనపై చర్యలు తీసుకోలేదు. అప్పట్లో కార్మిక మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరామ్.. సదరు అధికారి అనకాపల్లి వంటి ఫోకల్ ఏరియాకు పనికానిరాడని తిరస్కరించారు. అయితే జయరామ్ పార్టీకి-మంత్రిపదవికి రాజీనామా చేసిన సాయంత్రానికే, సదరు అధికారిని అనకాపల్లికి బదిలీ చే శారు. ఇప్పటికీ సదరు అధికారి ఇంకా అక్కడే కొనసాగుతుండం విశేషం.
కడప ఎంపి అవినాష్‌రెడ్డి సిఫార్సుతో.. శివశంకర్‌రెడ్డి విశాఖకు జాయింట్ చీఫ్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్‌గా బదిలీ అయితే, ప్రభుత్వం మారినా ఆయన అక్కడే కొనసాగుతున్న వైచిత్రి. ఏసీబీ కేసు ఉన్నా ఖర్మగారు దానిని పట్టించుకోలేదు.
గుంటూరులో వైసీపీ అభిమానిగా ముద్రపడిన అధికారి శివకుమార్‌రెడ్డిని కూడా, సదరు ఖర్మ గారు ప్రమోట్ చేస్తున్నారన్నది మరో ఆరోపణ. చిత్తూరులో ఇన్స్‌పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్‌గా పనిచే స్తున్న శివశంకర్‌రెడ్డిపై, వైసీపీకి తీవ్ర అభిమాని అన్న ఆరోపణలున్నాయి. ఆయనను ఇటీవల నెల్లూరుకు ఇన్చార్జిగా బదిలీ చేశారు. ఈ బదిలీలన్నీ ఖర్మ గారు.. కార్మికశాఖ ప్రముఖుడి ‘కొసరు బావగారి’ని, మెప్పించి చేసినవేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ ఖర్మ గారికి బినామీ పేరుతో ఒక ట్రస్టు ఉందట. తనకు వచ్చే మామూళ్లను, ఆ ట్రస్టుకు బదిలీ చేయించుకోవడం ఖర్మగారి ఆర్ట్ ఆఫ్ లివింగట. శని,ఆదివారాలు ఖర్మగారు కాకినాడలో ‘సేదదీరతార’ట. దానికోసంకంపెనీలు సారుగారికి విజయవాడ నుంచి కాకినాడకు కార్లు పంపిస్తాయన్నది ఒక ఆరోపణ. కాకినాడ అంటే సారుగారికి అంత లవ్వన్నమాట!
సేఫ్టీ వర్కుల్లో తమ్ముడే ‘రాజా’
ఇక ఆ విభాగంలో థర్డ్‌పార్టీ సేఫ్టీ ఏజెన్సీ చూసే ఖర్మ గారి తమ్ములుం గారు.. సేఫ్టీ వ ర్క్‌కు ఎన్ని లక్షలు డిమాండ్ చేస్తే, కంపెనీలు అంత సమర్పించుకోవలసిందే. ఈ ఏజె న్సీలో ఆయనే ‘రాజు’. కాి నాడ, శ్రీకాకుళం, ఒంగోలులోని డిప్యూటీ చీఫ్‌లకు రాజు గారు చెప్పిందే వేదమట. ఒక కంపెనీకి సేఫ్టీ డాక్యుమెంటేషన్ కోసం 15 లక్షలు వసూలు చేస్తాడట. అయితే అదే పనిని మిగిలిన ఏజెన్సీలు 2, 3 లక్షల్లో చేస్తాయి. కానీ జిల్లా అధికారులను అడ్డుపెట్టుకుని, తమ్ములుంగారు ఆ ఏజెన్సీలను దరిదాపుల్లోకి రానీయట. ఇందులో కొందరు అధికారులు తమ్ములుం గారి ఏజెన్సీలో, అనధికార వాటాదారులుగా ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ ‘తమ్ములుం గారి ఏజెన్సీ రేటు ఎక్కువ. మిగిలిన ఏజెన్సీలు తక్కువ రేటని’ ఏదైనా కంపెనీలు ప్రశ్నిస్తే..వారికి నోటీసులు ఇప్పించడం ఈ తమ్ములుం గారి ప్రత్యేకత అన్నది గుసగుస. ఏదైనా అధికారి తమ్ములుంగారు చెప్పింది చేయకపోతే, వారికి బదిలీలు, సస్పెన్షన్లు తప్పవు. దానికి అనామకులతో ఇప్పించే ఫిర్యాదులు అడ్డుపెట్టుకోవడం తమ్ములుం గారి స్పెషాలిటీట.
కొద్దినెలల క్రితం నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెంలో.. ఫ్యాక్టరీలతోతో ఎలాంటి సంబంధం లేని మీ సేవ నిర్విహ స్తున్న ఓ వ్యక్తితో, కార్మిక మంత్రికి ఫిర్యాదు ఇప్పించారు. దీనివెనుక కార్మిక శాఖలో పనిచేసే ఓ ఉద్యోగి హస్తం ఉందన్నది ఓ ఆరోపణ. థర్డ్‌పార్టీ ఏజెన్సీల పేరుతో డైరక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ చంద్రశేఖర వర్మ, అనకాపల్లి జిల్లా ఇన్స్‌పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ చిన్నారావు, బలగం రవీంద్ర, శ్రీనివాసరావు, సుబ్రమణ్యంపై ఫిర్యాదు చేశారు. అంతవరకూ బాగానే ఉంది.
ఆరోపణలు వచ్చిన అధికారికే విచారణ బాధ్యతలా?
అయితే దానిని మంత్రి సుభాష్..కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపించకుండా, ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో,అదే చంద్రశేఖర వ ర్మను విచారణ చేయాలని ఆదేశించడం విచిత్రం. దోషిగా ఉన్న చంద్రశేఖర వ ర్మకు, విచారణ బాధ్యత అప్పగించడం వెనుక కార్మిక శాఖ పేషీలో పనిచేసే ఒక ఉద్యోగి చక్రం తిప్పినట్లు ఆరోపణలు లేకపోలేదు.
అయితే..తనపై కూడా ఫిర్యాదు వచ్చినందున, తాను విచారణ చేయలేనని చెప్పాల్సిన చంద్రశేఖర్ వర్మ, విచారణ బాధ్యతను కృష్ణమూర్తి అనే మరో అధికారికి అప్పగించారు. తర్వాత సదరు అధికారి చేసిన సిఫార్సు మేరకు.. చిన్నారావు అనే అధికారిని సస్పెండ్ చేశారు. సర్వీసులో జూనియర్, పొజిషన్‌లో సీనియర్ అయిన అధికారితో, విచారణ జరిపించడంపై శాఖలో ఆశ్చర్యం వ్యక్తమయింది.
ఇటీవల కడపలో కంపెనీల నుంచి డబ్బులు డిమాండ్ చేశారని, తన బాసు కోసం వ సూలు చేస్తున్నానన్న కడప జిల్లా సారు ఫోను సంభాషణను .. కంపెనీ యజమానులు రికార్డు చేసి, కలెక్టర్‌కు వినిపించారట. దానితో ఆగ్రహించిన కలెక్టర్, సదరు జిల్లా అధికారిపై ఏసీబీ విచారణకు ఆదేశించారు. అయితే కార్మికశాఖ పేషీలో చక్రం తిప్పుతున్న ఓ ఉద్యోగి, ‘సామాజిక కోణంలో’ దానిని నిలిపివేయించార్నది మరో ఆరోపణ.
హైకోర్టు చెప్పినా బేఖాతర్
అయితే చిన్నారావు అనే అధికారి, తన సస్పెన్షన్‌ను సవాల్ చే స్తూ హైకోర్టుకు వెళ్లారు. కోర్టు కూడా ఆయన సస్పెన్సన్ చెల్లదని స్పష్టం చేసింది. దానితో హైకోర్టు ఆదేశాల ప్రకారం తనకు మళ్లీ పోస్టింగ్ ఇవ్వాలని, చిన్నారావు అనే అధికారి డైరక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే దానిపై వెంటనే నిర్ణయం తీసుకోవలసిన వర్మ.. ఆయన లేఖను ఆర్ధిక శాఖకు పంపించారు. ఆర్ధికశాఖ ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని, ప్రస్తుతం బదిలీపై ప్రభుత్వ నిషేధం ఉన్నందున ఆయనను అక్కడే కొనసాగించాలని స్పష్టం చేసింది.
సంబంధం లేని సస్పెన్షన్లు
అయినా మళ్లీ దానిని సీఎస్‌కు పంపించారు. చిన్నారావును మరోచోటకు బదిలీ చేయాలని కోరారు. దానికి స్పందించిన సీఎస్, చిన్నారావు బదిలీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అయినా ఇప్పటివరకూ ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా.. నవంబర్ నుంచి వేధిస్తున్న వైనం కార్మికశాఖలో చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఈ వ్యవహారంలో ఫ్యాక్టరీలో తనిఖీలు చేయాల్సింది డిప్యూటీ చీఫ్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కాగా.. సేఫ్టీ ఆడిట్‌తో ఎలాంటి సంబంధం లేని ఇన్స్‌పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ చిన్నారావును సస్పెండ్ చేయడం విమర్శలకు దారితీసింది.
కార్మిక శాఖలో అసలు ఆనందం ఆయనదే!
కాగా కార్మికశాఖలో కర్త- కర్మ- క్రియగా వ్యవహరిస్తున్న ‘కొసరు బావ‘గారి ఆనందానికి అంతులేదన్న ప్రచారం జరుగుతోంది. బదిలీలు, పోస్టింగులు, శాఖలకు సంబంధించిన పనులు, సేఫ్టీ ఏజెన్సీ ఎంపికలన్నీ సదరు కొసరుబావగారి కనుసన్నల్లోనే జరుగుతున్నాయని.. సదరు బావగారు సచివాలయంలోని కార్మిక శాఖ పేషీలోనే బైఠాయిస్తారన్న ప్రచారం, చాలాకాలం నుంచి వినిపిస్తోంది. మరోవైపు కార్మికశాఖ కీలక ప్రముఖుడికి మిత్రుడైన మరో వ్యక్తి కూడా, చక్రం తిప్పుతున్నారన్న విమర్శలూ లేకపోలేదు. ఆ కార్మిక శాఖ ప్రముఖుడు ఈ ఇద్దరి ప్రభావంలో ఉన్న వైనంపై, ఇటీవలఇంటలిజన్స్ కూడా సీఎంఓకు నివేదిక ఇచ్చినట్లు సమాచారం.
బాబు ఆదేశాలు బుట్టదాఖలు
అచ్యుతాపురంలోని ఎసెన్షియా ఫార్మాలో జరిగిన ప్రమాదంలో 17 మంది చనిపోయారు. దానిపై సీఎం చంద్రబాబునాయుడు స్పందించి, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే దానిపై సంబంధిత డిప్యూటీ చీఫ్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణపై తక్షణం చర్యలు తీసుకోవాల్సి ఉండగా.. మళ్లీ అదే అధికారికి ఇన్స్‌పెక్షన్ బాధ్యతలు అప్పగించారు. దీన్నిబట్టి .. ఫ్యాక్టరీస్ విభాగంలో ధిక్కారపర్వం ఏ స్థాయిలో కొనసాగుతుందో స్పష్టమవుతోంది.