Suryaa.co.in

Andhra Pradesh

శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యిలో కల్తీ నిజమే

ఏ5 అపూర్వ చావడా ఒప్పుకోలు ?

తిరుపతి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగింది వాస్తవమేనని ఏ5 అపూర్వ చావడా సిట్ విచారణలో తెలిపినట్లు సమాచారం. కెమికల్‌ ఇంజినీరింగ్‌ చదివిన తాను నెయ్యిలో రసాయనాలు కలిపానని విచారణ సందర్భంగా అంగీకరించినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలోనే ఆ రసాయనాలను ఎక్కడి నుంచి సేకరించారని ఎంత మోతాదులో వినియోగించారని, ఇంకా ఇందులో ఎవరెవరి పాత్ర ఉందనే విషయాలపై తదుపరి దర్యాప్తు అవసరమని సిట్ భావించింది. అందుకోసం అపూర్వ చావడాను మరోసారి కస్టడీకి అప్పగించాలని కోరుతూ తిరుపతి రెండో అదనపు మున్సిఫ్‌ కోర్టులో సిట్‌ తరఫున న్యాయవాదులు పిటిషన్‌ దాఖలు చేశారు.

ఆయనతోపాటు ఏ3 విపిన్‌ జైన్‌ను కూడా కస్టడీకి ఇవ్వాలని కోరారు. సిట్‌ తరఫున స్థానిక ఏపీపీ, విజయవాడలోని సీబీఐ కోర్టు ఏపీపీ వాదనలు వినిపించారు. మరోవైపు భోలేబాబా ఆర్గానిక్‌ డెయిరీ డైరెక్టర్లు విపిన్‌ జైన్‌ (ఏ3), పొమిల్‌ జైన్‌ (ఏ4) దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను వారి తరఫు న్యాయవాదులు ఉపసంహరించుకున్నారని ఏపీపీ పి. జయశేఖర్‌ తెలిపారు.

కస్టడీ పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్నందున బెయిల్‌ విజ్ఞప్తిని వెనక్కు తీసుకున్నామని న్యాయవాదులు తెలిపారు. దీంతో జడ్జి కోటేశ్వరరావు వారి పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అపూర్వ చావడా దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్, సిట్‌ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను వాదనల నిమిత్తం తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేశారు.

LEAVE A RESPONSE