Suryaa.co.in

Features

“అయోధ్య”ను దర్శించి.. రామ జన్మభూమిని ముద్దాడిన క్షణం అజరామవరం..!

అయోధ్య లోని శ్రీరామ జన్మభూమి దర్శనం తో జన్మ ధన్యమైంది. యుగయుగాలకు తరతరాలకు ఆదర్శ పురుషుడైన అయోధ్య రామయ్య దర్శనం జీవితంలో ఓ సువర్ణ అధ్యాయం. సిద్ధాంతపురమైన పోరాటంలో న్యాయబద్ధంగా విజయం సాధించి, భవ్యమైన మందిరం నిర్మిస్తున్న సమయంలో బాల రాముడిని దర్శించడం మహాభాగ్యం. బాల రాముడి దర్శనంతో మనసు తన్మయత్వం చెందింది.

లక్షల మంది రామభక్తులు.. కర సేవకుల త్యాగఫలంతో నిర్మితమవుతున్న మందిర దర్శనం జన్మకు సరిపడా సంతృప్తితో కూడినది. హిందూ ద్వేషాన్ని నింపుకున్న పాలకుల కుట్రలు, కుతంత్రాలను ఛేదిస్తూ… అలుపు సొలుపు లేకుండా పోరాడి గమ్యాన్ని ముద్దాడిన ఘటనలకు సాక్ష్యం మందిర నిర్మాణం. దాదాపు 5 శతాబ్దాలుగా.. ఐదు లక్షలకు పైగా రామ భక్తుల ప్రాణ త్యాగం చేసి సాధించుకున్న మందిరం అది.

ఆ రామయ్య మందిర పరిసర ప్రాంతాల పరిమళాలతోనే మనసు ఎగిసిపడుతోంది. ఆ పవిత్ర పుణ్యభూమిలో కాలు మోపగానే ఉద్విగ్న భరతమైన ప్రకంపనలతో శరీరం పులకించిపోయింది. యావత్ ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రామయ్య మందిర నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్న దృశ్యం గుండెలో పదిలం.

స్వచ్ఛమైన నా భక్తులకు (కార్యకర్తలకు)స్వాగతం అన్నట్టు రామయ్య గర్భగుడి పరిసర ప్రాంతాలు దేశ నలుమూలల నుంచి వచ్చిన విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలను సాదరంగా ఆహ్వానించాయి. రక్తాన్ని ధారపోసి.. చెమటను చిందించిన లక్షలాదిమంది “కరసేవకుల వారసులు మీరే” అన్నట్టు ఆ ప్రాంతం అంతా గంభీరమైపోయింది. బాల రాముడిని దర్శించి.. రామ జన్మభూమిని ముద్దాడిన క్షణం అజరామవరం..!

పత్రికల్లో ఫోటోలు చూడటం.. టీవీలో క్లిప్పింగులు దర్శించడం తప్ప గతంలో నేరుగా అయోధ్య రామ జన్మభూమిలో పాదం మోపింది లేదు. అలాంటిది నేడు నేరుగా బాల రాముడు దర్శనం.. మందిర నిర్మాణం పనులు పర్యవేక్షించడం మాటలకు అందని ఆనందం..! రాసేందుకు పదాలు దొరకని అద్భుతం..!!

నీతికి కట్టుబడి ధర్మ పాలన సాగించిన రాముడు ధర్మానికి ప్రతిరూపంగా నిలిచాడు.”రామో విగ్రహాన్ ధర్మః” అంటే రాముడే ధర్మానికి ప్రతీక అని అర్థం. అంటే నేడు విశ్వహిందూ పరిషత్ నిర్మిస్తున్న ఈ మందిరం రాముడిది మాత్రమే కాదు.. ధర్మానిది అని కూడా గుర్తించుకోవాలి. ధర్మ నిర్మాణం జరిగితే రామరాజ్యం సుసాధ్యం.

“కొఠారి” సోదరుల వంటి లక్షలాదిమంది కార్యకర్తల బలిదానం.. మాననీయ అశోక్ సింఘాల్ , లాల్ కృష్ణ అద్వానీ వంటి చరితాత్ముల నాయకత్వం.. నరేంద్ర మోడీ లాంటి దైవజనుల సంకల్పమే మందిర నిర్మాణం.
పవిత్ర సరయు నదిలో స్నానం చేస్తుండగా, నాటి కర సేవకుల త్యాగనిరతి..
అప్పటి ముఖ్యమంత్రి మూలయం సింగ్ యాదవ్ రాజ దుర్నీతి గుర్తుకు వచ్చింది. 1992లో వందలాదిమంది కర సేవకుల కాళ్లకు రాళ్లు కట్టి నదిలో విసిరేసిన రాక్షస పాలన కళ్ళముందు కనబడింది. వందలాది మంది నదిలో కొట్టుకుపోగా.. బురదలో కూరుకుపోయి కనుమరుగైనవారు అనేకమంది. ఇక నది ఎండిపోయిన సమయంలో మిగతా వారిని బయటకు తీసుకు వచ్చిన దృశ్యం కళ్ళలో సుడులు తిప్పింది.
పేద ధనిక తేడా లేకుండా.. సామాన్యుల నుంచి అసామాన్యుల వరకు .. పది రూపాయల నుంచి పది కోట్లు.. అంతకు మించి మనస్ఫూర్తిగా రామయ్య కు సమర్పించిన ధనంతో యావత్ హిందూ సమాజం సగర్వంగా మందిరం నిర్మించుకుంటోoది. ఇది ప్రపంచ దేశాలలో కనీవినీ ఎరుగని చరిత్ర. ప్రపంచ చరిత్రలో సుదీర్ఘ కాలం పాటు.. అంటే 500 ఏళ్ల నిర్విరామ న్యాయ పోరాటంలో విజయం సాధించిన క్షణాలకు గుర్తులు మందిర నిర్మాణపు శిలాలు. మందిర నిర్మాణం తర్వాత కోట్లాదిగా రామభక్తులు తరలిరావడం సహజం.

అయితే నిర్మాణ సమయంలో ప్రముఖమైన విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు అయోధ్య వెళ్లి రావాలి అనే నిర్ణయం పెద్దలది. వయసు రీత్యా 1990, 92 ప్రాంతాలలో రాము మందిర నిర్మాణ ఉద్యమంలో పాల్గొనలేదు అనే భావన మదిలో రాకుండా ఉండేందుకు నిర్మాణ సమయంలో తప్పనిసరిగా వెళ్లి సందర్శించి రావాలనేది సంకల్పం. అందులో భాగంగానే మందిర నిర్మాణం సమయంలో నాటి పోరాట వీరుల చరిత్రను తలుచుకొని.. విశ్వహిందూ పరిషత్ ధర్మకార్యంలో మరింత మెరుగ్గా పనిచేయాలని.. అందుకు తగినంత ఆయురారోగ్యాలు.. బుద్ధి ప్రసాదించాలని రాములవారిని ప్రార్థించాను.

నిర్మాణ సమయంలో సిద్ధాంతపురమైన కార్యకర్తలు రామ జన్మభూమిని దర్శించి రావడం తప్పనిసరిగా ఎంచుకోవాలి. ఎందుకంటే 2024 జనవరిలో మందిరం ప్రారంభం కాబోతోంది. అది ఒక చరిత్ర. వేయి సంవత్సరాల పాటు చెక్కుచెదరకుండా నాణ్యమైన నిర్మాణం సాగుతోంది కాబట్టి.. మన తరువాత దాదాపు 20 తరాలు ( జనరేషన్స్ )పాటు మన్నిక ఉంటుంది. అలాంటి నిర్మాణ సమయంలో మనం కూడా పాలుపంచుకోవడం ధర్మం. కరసేవ పురంలోని VHP కార్యాలయంలో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి శ్రీ చింపత్ రాయ్ జీతో ప్రత్యేక సమావేశం నిర్వహించుకున్నాము. దేశ నలుమూలల నుంచి విచ్చేసిన కార్యకర్తలతో ఆత్మీయంగా తన ప్రత్యేక అనుభవాలు పంచుకున్నారు. దాదాపు గంట పది నిమిషాల పాటు మందిర నిర్మాణ విశేషాలు వివరించారు. కార్య క్షేత్రంలో చేయాల్సిన పనిని చంపత్ జీ నిర్దేశించారు.

అనంతరం “రామయ్య దర్శనానికి మీరు కూడా మాతో పాటు రండి అని వారిని విన్నవించగా.. పనులు చాలా ఉన్నాయి, ముఖ్యంగా ఈరోజు ఆడిటర్ అధికారులు వస్తున్నారు. సమయం లేదు.. మీరు వెళ్లి రండి” అంటూ చంపత్ రాయ్ జీ ఆశీర్వదించారు.దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల ప్రచార ప్రముఖులతో పాటు తెలంగాణ రాష్ట్రం నుంచి నేను రామ మందిరం నిర్మాణం పనుల పర్యవేక్షణలో పాల్గొన్నాను. ఏప్రిల్ 23న ప్రపంచంలోని 155 దేశాల ప్రతినిధులు 155 నదుల నుండి పవిత్ర జలం తీసుకు వచ్చి అయోధ్య బాల రాముడికి జలాభిషేకం చేశారు. ఆ మరుసటి రోజే రాములవారిని మేము దర్శించుకోవడం విశేషం.

ఇటీవల 15 రోజుల క్రితం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే గారు తన మంత్రివర్గం తో కలిసి అయోధ్య రామ జన్మ భూమి సందర్శించారు. కానీ వారికి మందిర నిర్మాణ పనులు పర్యవేక్షించే అవకాశం కల్పించలేదు. దీంతో బాల రాముడిని దర్శించుకుని వెనుతిరిగారు.

– పగుడాకుల బాలస్వామి
ప్రచార ప్రముఖ్
విశ్వహిందూ పరిషత్
తెలంగాణ రాష్ట్రం
9912975753
9182674010

LEAVE A RESPONSE