Suryaa.co.in

Andhra Pradesh

నాడు ఇదే మందు విషమైతే.. ఇప్పుడు అమృతమా?

– ఎక్కడా మద్యం ధరలు తగ్గలేదు. అవే ధరలు
– గతంలో కంటే ఎక్కువ చీప్‌ లిక్కర్‌ తీసుకొచ్చారు
– ప్రజల ప్రాణాలకే ముప్పు తీసుకొస్తున్నారు
– బయటి ప్రాంతాల్లో కన్నా, ఇక్కడ రేట్లు ఎక్కువ
– తక్కువ ధరకు నాణ్యమైన మద్యం ఏదీ?
– ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయాలు
– కూటమి పాలనలో మద్యం వ్యాపారులకూ నష్టం
– 20% మార్జిన్‌ అని చెప్పి, 9.5 శాతమే ఇస్తున్నారు
– లాభాల కోసం మద్యం బాటిళ్లు కల్తీ చేస్తున్నారు
– కడపలో వైయస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి
– మద్యం బ్రాండ్లు, వాటి అప్పటి, ఇప్పటి ధరలను చూపుతూ, ప్రెస్‌మీట్‌లో బాటిళ్లను ప్రదర్శించిన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు

కడప: ‘మందు బాబులకు శుభవార్త. రేట్లు తగ్గించి, నాణ్యమైన మద్యం అందిస్తా..’ అని ఎన్నికల ముందు చంద్రబాబు ప్రచార వీడియోను ప్రెస్‌మీట్‌లో ప్రదర్శించిన రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఆ తర్వాత ఏమన్నారంటే.. ఎన్నెన్నో హామీలు గుప్పించిన చంద్రబాబు, గెలిచిన తర్వాత ఇతరులను మోసం చేసినట్లే, మందు బాబులను కూడా వంచించాడు.

ఆయన చెప్పినట్టు ధరలు తగ్గించలేదు. అప్పుడు ఏ ధరలున్నాయో, ఇప్పుడూ అవే ఉన్నాయి. అప్పటి డిస్టిలరీలే ఇప్పుడూ ఉన్నాయి. నాడు అదే మద్యం విషమని చంద్రబాబు దుష్ప్రచారం చేశారు. మరి ఇప్పుడు అదే మందు అమృతం అవుతుందా? డిస్టిలరీలు మారలేదు. బాటిళ్లూ మారలేదు. మారిందల్లా మద్యం ఇచ్చే చేయి మారింది. ఎక్కడా మద్యం ధరలు తగ్గలేదు. అవే ధరలు. గతంలో కంటే ఎక్కువ చీప్‌ లిక్కర్‌ తీసుకొచ్చారు. ప్రజల ప్రాణాలకే ముప్పు తీసుకొస్తున్నారు. ఇంకా బయటి ప్రాంతాల్లో కన్నా, ఇక్కడ రేట్లు ఎక్కువగా ఉన్నాయి.

తక్కువ ధరకు అంటూ రాష్ట్రంలో రూ.99కి అమ్ముతున్న కేరళ బ్రాండ్‌ మద్యం ఇతర రాష్ట్రాల్లో రూ.85కే లభిస్తోంది. పైగా అందులో కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా ఉండడం లేదు. దాన్ని గుర్తించిన చాలా మంది ఆ మద్యం సేవించడం లేదు. గతంలో ఉన్న ఓల్డ్‌ క్లబ్, కేరళ సుమో, రాయల్, లవ్‌మోర్‌ వంటి కొన్ని బ్రాండ్లు ఇప్పుడు దొరకడం లేదు. చివరకు మద్యం వ్యాపారులను కూడా చంద్రబాబు మోసం చేశారు. వ్యాపారులకు 20 శాతం మార్జిన్‌ ఇస్తామని చెప్పి, 9.5% మార్జిన్‌ మాత్రమే ఇస్తున్నారు. దీంతో వ్యాపారులు ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం అమ్ముతున్నారు.

మద్యం షాప్‌ల టెండర్లకు రూ.2 లక్షల నాన్‌ రిఫండబుల్‌ డిపాజిట్‌ నిర్ణయం వల్ల, ప్రభుత్వానికి దాదాపు రూ.2 వేల కోట్ల ఆదాయం వచ్చింది. మంచి లాభాలు వస్తాయన్న ఆశతో దాదాపు 90 వేల మంది టెండర్‌ వేశారు. ఆశించిన లాభాలు లేక నష్టపోతున్న కొందరు వ్యాపారులు మద్యం బాటిళ్లను కల్తీ చేస్తున్నారు. మరోవైపు విచ్చలవిడిగా బెల్ట్‌ షాపులు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 3 వేల జనాభా ఉన్న గ్రామాల్లో రెండు, మూడు బెల్ట్‌ షాపులు ఓపెన్‌ చేస్తున్నారు. అలా ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతోంది. మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలకు మద్యం కూడా కారణమవుతోంది.

గతంలో మద్యం విక్రయాలను ప్రభుత్వమే నిర్వహించడం వల్ల, వాటిపై నియంత్రణ ఉండేది. కానీ ఇప్పుడు వ్యాపారుల చేతుల్లోకి రావడంతో, పూర్తిగా నియంత్రణ కొరవడింది. ఇంకా పర్మిట్‌ రూమ్‌లు ఇష్టానుసారం పెంచారు. వీటన్నింటి వల్ల రోజంతా మద్యం దొరుకుతోంది.

ఇప్పటికైనా చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం నాణ్యమైన మద్యం, తక్కువ ధరకు విక్రయించాలి. పెంచిన ధరలు తగ్గించాలి. బెల్ట్‌ షాపులను నియంత్రించాలని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

LEAVE A RESPONSE