ఈ ఎన్నికల్లో కూటమి గెలవాలి

  • రాష్ట్రానికి మంచి రోజులు రావాలి
  • దెబ్బలు తిన్నా ప్రజల కోసం నిలబడిన నాయకుడు జనసేనాని
  • ప్రజల కోసం పోరాడే నాయకుడు పవన్ కళ్యాణ్ ని గెలిపించండి
  • పిఠాపురం ఎన్నికల ప్రచారంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్

‘రాజకీయ ప్రయాణంలో ఎన్ని దెబ్బలు తగిలినా వెనకడుగు వేయని నాయకుడు పవన్ కళ్యాణ్ . డబ్బు కోసం ఆశించని నాయకుడాయన. ప్రజలకు ఏదో చేయాలని రాజకీయాల్లోకి వచ్చిన ఏకైక నాయకుడు పవన్ కల్యాణ్ ’ అని ప్రముఖ హీరో, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ స్పష్టం చేశారు. అలాంటి నాయకుడిని అసెంబ్లీకి పంపితే మనందరి కోసం మరెంతో చేస్తారని అన్నారు. రెండు వారాల్లో ఎన్నికలు ఉన్నాయి.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమిని విజయం సాధించాలి.. రాష్ట్రానికి మంచి రోజులు రావాలి అన్నారు.  శనివారం సాయంత్రం పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలోని తాటిపర్తి, వన్నెపూడి, కొడవలి, చందుర్తి, దుర్గాడ తదితర గ్రామాల్లో పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ “బాబాయి పవన్ కల్యాణ్ పదేళ్లుగా జనానికి మంచి చేయాలన్న తపనతో రాజకీయాలు చేస్తూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎన్నో మాటలుపడ్డారు. ప్రజల కోసం ఎన్ని దెబ్బలు తగిలినా వెనుకడుగు వేయకుండా నిలబడ్డారు. కౌలు రైతు కుటుంబాలకు అండగా నిలిచారు. మత్స్యకారుల కోసం నిలబడ్డారు. రాష్ట్రంలో ఎవరికి ఇబ్బంది వచ్చినా నేనున్నానంటూ పోరాటం చేశారు. ప్రజలందర్నీ సొంత కుటుంబ సభ్యులుగా భావించే పవన్ కళ్యాణ్ , మీ కోసం పండుగల సమయంలో కూడా మా కుటుంబ సభ్యులకు దూరమయ్యారు. ప్రతి ఓటరుకి మా తరఫున చేస్తున్న విన్నపం ఒకటే, ప్రజల కోసం పోరాటం చేసే పవన్ కళ్యాణ్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించండి. ఇక మీదట ఎవరు అడిగినా బాబాయ్ పోటీ చేస్తున్న పిఠాపురమే మా ఊరు అని చెబుతాం. ఏ పండుగ వచ్చినా మా సొంతూరు పిఠాపురం వచ్చి జరుపుకుంటాం. మే 13వ తేదీన ప్రతి ఓటరు గుర్తు పెట్టుకుని అసెంబ్లీ ఓటు  పవన్ కళ్యాణ్ కి, పార్లమెంటు ఓటు ఉదయ్ శ్రీనివాస్ కి గాజు గ్లాసు గుర్తు మీద వేసి భారీ మెజారిటీతో గెలిపించాలి” అన్నారు.

అపూర్వ స్వాగతం

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ఎన్నికల ప్రచారానికి వచ్చిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి పిఠాపురం గ్రామీణ ప్రజలు అడుగడుగునా అద్భుత స్వాగతం పలికారు. తాటిపర్తి, వన్నెపూడి, కొడవలి, చందుర్తి, దుర్గాడ గ్రామాల్లో ప్రజలంతా జనసేన నినాదాలతో హోరెత్తించారు. ఆడపడుచుల హారతులు, జనసైనికుల పూలాభిషేకం మధ్య వరుణ్ తేజ్ రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో ఆధ్యంతం జనసైనికులు, టీడీపీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలు, ప్రజల హర్షాతిరేకాల మధ్య ప్రతి ఒక్కరికీ గాజు గ్లాసు గుర్తును చూపుతూ, గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ వరుణ్ తేజ్ ముందుకు సాగారు. గ్రామాల్లో ప్రజలు స్వచ్చందంగా గాజు గ్లాసు గుర్తుతో కూడిన ప్లకార్డుల ప్రదర్శించి తమ మద్దతు పవన్ కళ్యాణ్ కేనని చెప్పారు. పవన్ కళ్యాణ్ కి మద్దతుగా రోడ్డు మీదకు వచ్చిన ప్రతి ఒక్కరికీ వరుణ్ తేజ్ ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply