చట్టాల అవగాహనతో మహిళల్లో ధైర్యం

– రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ
– సామాజిక బాధ్యత ఉన్నప్పుడే చట్టాలతో రక్షణ
– ‘వివాహిత మహిళా హక్కుల’ పై మాజీ జడ్జి జీవీ కృష్ణయ్య అవగాహన

గుంటూరు: భద్రత, రక్షణకు రాజ్యాంగం అమలు చేస్తున్న ప్రత్యేక చట్టాలపై అవగాహనతోనే మహిళలు ధైర్యవంతులు కాగలరని రాష్ట్ర మహిళా చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఉన్నారు. జాతీయ మహిళా కమిషన్, రాష్ట్ర మహిళా కమిషన్ సంయుక్త ఆధ్వర్యంలో ‘వివాహిత మహిళల హక్కులు – గృహ హింస చట్టం’ పై మంగళవారం జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాలులో అవగాహన సదస్సు నిర్వహించారు.

సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ మానవ హక్కులన్నీ మహిళల హక్కులే అనే విషయా న్ని అందరూ గుర్తించాలని పిలుపునిచ్చారు. మహిళల హక్కులను కాపాడడంలో ప్రసార మాధ్యమాలు పోషిస్తున్న పాత్ర కీలకమన్నారు. మహిళల సాధికారతకు ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ చట్టాలు, పథకాలు, విధానాల సమాచారం మహిళలకు చేరడానికి ఎంతో ప్రాధాన్యం ఉందని ఆమె చెప్పారు. గృహ హింస నిరోధక బిల్లు, రక్షణ చట్టాలు వచ్చిన తర్వాతే.. స్వర్గసీమలాంటి గృహంలో హింస కూడా ఉంటుందనే విషయం సమాజానికి తెలిసిందని విచారం వ్యక్తం చేశారు.

హింస భరించడమనేది మహిళకు అలవాటుగా మారకూడదన్నారు. భర్త కాగానే భార్యపై సర్వహక్కులతో అజమాయిషీ చేసేందుకు ఏ చట్టం, రాజ్యాంగం అనుమతివ్వలేదని వాసిరెడ్డి పద్మ గుర్తుచేశారు. మహిళ ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఆమెను సాటి మనిషిగా గౌరవించడం పురుషుల బాధ్యతని తెలుసుకోవాలన్నారు. సున్నితమైన మనసును అర్ధం చేసుకోకుండా కొందరు మూర్ఖుల వికృతచేష్టల మూలంగానే.. రోడ్లపై మతిస్థిమితం లేని మహిళలు కనిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దిశ యాప్ వినియోగంతో మహిళలపై వేధింపులు కొలిక్కి వచ్చాయన్నారు. చట్టాల పట్ల అవగాహనతో ప్రతిఒక్కరూ చైతన్యం పొంది ఆడపిల్లకు భరోసానివ్వడంలో చిత్తశుద్ధి చూపాలని పిలుపునిచ్చారు.

మాజీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీ కృష్ణయ్య మాట్లాడుతూ మహిళల అక్షరాస్యతతో బాల్యవివాహాలు తగ్గుముఖం పడుతున్నాయని చెప్పారు. వివాహ రిజిస్ట్రేషన్ నిర్బంధం పెట్టి అర్హత గలిగిన బంధాలను ఏర్పరచుకోవడం మంచిపద్ధతిగా చెప్పారు. వరకట్నం ఇచ్చిపుచ్చుకోవడాలతోనే వివాహబంధం అర్థంలేని ఒప్పందంగా మిగులుతుం దన్నారు. చట్టాల అమలుతో గాక సమాజంలో మార్పుతోనే మహిళలకు రక్షణ కలుగుతుందన్నారు. గృహ హింస చట్టంలో ప్రొటెక్షన్ ఆఫీసర్ల పాత్ర కీలకమన్నారు.

వన్ స్టాప్ సెంటర్లలో న్యాయవాదుల సూచనలతో మహిళలను కాపాడగలిగితే కుటుంబ రక్షణా సాధ్యమవుతుందన్నారు. సదస్సులో ఏపీ మహిళా కమిషన్ ‘వివాహిత మహిళా హక్కుల’పై రూపొందించిన వాల్ పోస్టర్ ను లాంఛనంగా ఆవిష్కరించారు. సదస్సుకు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ హెన్రీ క్రిస్టినా అతిథిగా హాజరుకాగా, మహిళా కమిషన్ డైరెక్టర్ ఆర్ సూయజ్, కార్యదర్శి శైలజ, లీగల్ కౌన్సిలర్ విజయలక్ష్మి, మహిళా శిశుసంక్షేమ శాఖ జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, జిల్లా బార్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply