అల్లు అర్జున్ అరెస్ట్ – రిమాండ్ పరిణామాల్లో “రాజ్య ధర్మం” కనబడుతున్నది. ఈ పరిణామాల వల్ల ప్రభుత్వ అధికారం, దాన్ని ప్రభావితం చెయ్యగల రాజకీయ నిర్ణయాలకు మించిన “రాజ్యం” ఒకటి వున్నదన్న సోషల్ పాఠం మళ్ళీ గుర్తుకొస్తోంది.
రాజ్యం అంటే ఒక భౌగోళిక, సామాజిక, రాజకీయ, అధికారిక వ్యవస్ధలు కలగలిసిన ఏకైక శక్తి. ఇది ఒక భావన దీనికి స్పష్టమైన రూపం లేదు. అన్ని వ్యవస్ధలూ సమతూకంతో పని చేసినపుడు “రాజ్యం” ఉనికి, పరిపూర్ణత ప్రజల అనుభవంలోకి వస్తుంది.
ప్రజల జీవన హక్కు, స్వేచ్ఛ, సమానత్వం వంటి మౌలిక హక్కులను కాపాడటం. రక్షణ, న్యాయం అందించడంలో తటస్థంగా వ్యవహరించడం. ప్రజల ఆరోగ్యం, విద్య, వృద్ధి వంటి రంగాల్లో సేవలు అందించడం. సామాజిక న్యాయం కల్పించడం. పరిపాలన పారదర్శకంగా, ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు స్పష్టంగా ఉండటం. అవినీతి రహిత పాలన. శాంతి భద్రతలు అంతర్గతం శాంతిని కాపాడటం సమానత్వం మరియు సామరస్యం అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించడం వర్గీయ వివక్ష లేకుండా సమన్వయాన్ని పెంపొందించడం.మొదలైనవన్నీ “రాజ్య” ధర్మాలు.
అల్లు అర్జున్ తో సహా సినిమా రంగం జీవనశైలి- ప్రజల జీవనశైలికి భిన్నంగా వుంటుంది. ఆడంబరం, వైభవం, అపారమైన డబ్బు ఖర్చు, ఒక విధమైన లెక్కలేనితనం, వంటి సెలెబ్రిటీ జీవనశైలి ప్రజలపై నానారకాల ప్రభావాలూ చూపిస్తుంది. ఈ ప్రభావం ఇది మానవ సంబంధాల మీద కూడా గట్టిగానే వుంటుంది.
దేశవ్యాప్తంగా సినిమా సెలబ్రిటీల ధోరణి “నేనింతే” అన్నట్టు వుంటుంది. ఇదేమీ నేరం కాదు.
(మితిమీరిన లిక్కర్ వల్ల) పేవ్ మెంట్ మీద నిద్రిస్తున్న వారిని కారుతో తొక్కేసిన సంఘటన నేరమే! (చట్టంతెలియక) జింకను కాల్చి చంపినా నేరమే!
అల్లు అర్జున్ అలాంటి నేరం చేయలేదు. అయితే ఆయన ధర్మబద్ధంగా వ్యవహరించలేదు. తనవల్ల జరిగిన తొక్కిసలాట గురించి తెలుసు. అందులో ఒక మనిషి మరణించాక కూడా ( ఆవిషయం తనకు తెలియదంటే అది ఆయన చుట్టూ వుండే రక్షక భటుల అసమర్ధతే అవుతుంది. అందుకు బాధ్యత ఆయనదే) అల్లు అర్జున్ చివరిదాకా సినిమా చూడటం మానవీయ మర్యాదకు భంగకరమే! ఒకరోజంతా కనీసం విచారాన్ని కూడా వ్యక్తపరచకపవడం లెక్కలేనితనమే అవుతుంది. ఇవేమీ నేరాలు కాదు.
సరిగ్గా ఇక్కడే “రాజ్యం” జోక్యం చేసుకుంది. పద్ధతి ప్రకారం అరెస్టు రిమాండు జరిగిపోయాయి. జైలు వేళలకు కోర్టు ఉత్తర్వులు అందలేదు కాబట్టి రాత్రంతా అర్జున్ కు జైలు తప్పలేదు.
“చట్టం తనపని తాను చేసుకుపోతుంది” అనే మాట వెటకారపు సినిమా డైలాగుల వల్ల మనకు పలచబడిపోయింది. ఈ కేసులో అల్లు అర్జున్ కు మహా అయితే మందలింపు తప్ప ఏ శిక్షా వుండకపోవచ్చు! లెక్కలేనితనాన్ని జవాబుదారీ తనాన్ని చక్కదిద్దడానికి “రాజ్యం” జోక్యం వల్లే ఈ అరెస్టు జరిగిందని భావిస్తున్నాను.
ఇది సెలబ్రెటీలందరికీ సంఘం పట్ల బాధ్యతను గుర్తు చేసే “రాజ్యం” / State హెచ్చరికగా కూడా భావించాలి. భావనామాత్ర మైన “రాజ్యం” ఉనికిని చూపించగలిగిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నాను.
– కిలారు వంశీధర్