Suryaa.co.in

Andhra Pradesh

అక్రమాలను ప్రశ్నించినందుకు అట్రాసిటీ కేసు పెట్టారు

– యువనేత లోకేష్ ఎదుట ఓ పసుపు సైనికుడి ఆవేదన

ఇచ్చాపురం: అధికారపార్టీ అక్రమాలను ప్రశ్నించినందుకు తనపై అట్రాసిటీ కేసు పెట్టి వేధిస్తున్నారని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం కంచిలి మండల తెలుగుదేశం పార్టీ కార్యదర్శి, ప్రస్తుత ఎంపీటీసీగా ఉన్న మాదిన రామారావు ఆవేదన వ్యక్తంచేశారు. శంఖారావం సందర్భంగా రామారావు యువనేతను కలిసి వైసిపి నేతల వేధింపులను ఏకరువుపెట్టారు.

నియోజకవర్గంలో వైసిపి నేతల అక్రమ ఇసుక, మట్టి తవ్వకాలపై ప్రశ్నిస్తున్నందుకు మాపై కక్షగట్టారు, వైసీపీ ప్రభుత్వం అట్రాసిటీ కేసు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేస్తోంది. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీని మండలంలో ముందుకు తీసుకెళ్లేందుకు అహర్నిశలు పాటుపడుతున్నామని చెప్పారు. యువనేత లోకేష్ స్పందిస్తూ… ఓటమి భయంతోనే టీడీపీ కార్యకర్తలు, నాయకులపై వైకాపా అక్రమ కేసులు నమోదు చేయిస్తోందని లోకేష్ ధ్వజమెత్తారు. అధికారంలోకి రాగానే తప్పుడు కేసులు పెట్టిన వైసిపి సైకోలతోపాటు అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని, మరో రెండునెలలు ఓపిక పట్టాలని అన్నారు. మీకు పార్టీ అన్నివిధాలా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

యువనేతను కలిసిన సామంత కులస్తులు

ఇచ్చాపురంలో సామంత సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. సామంత కులానికి చెందిన వారు రాష్ట్రంలో 40వేల మంది వరకు రాష్ట్రంలో ఉన్నారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం, దినసరి కూలీలుగా జీవితం గడుపుతున్నాం. 50 ఏళ్లకే పెన్షన్ వర్తింపజేయాలని, అతిరస కార్పోరేషన్ లో తగిన ప్రాధాన్యత కల్పించాలన్నారు. తమకు ఆర్థికంగా చేయూత అందించాల్సిందిగా విజ్ఞప్తిచేశారు. అధికారంలోకి వచ్చాక సామంత కులస్తులకు న్యాయం చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.

ఇచ్చాపురంలో నారా లోకేష్ కు వినతుల వెల్లువ

ఇచ్చాపురం: శంఖారావం కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇచ్చాపురం వచ్చిన యువనేత లోకేష్ ను కలుసుకున్న పలువురు స్థానికులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఉన్న సాంప్రదాయ మత్స్యకార కండ్ర కులస్తులను ఎస్టీలుగా గుర్తించడంతో పాటు చట్టసభల్లో అవకాశం కల్పించాలని ఆ సామాజిక వర్గీయులు విన్నవించారు. శ్రీకాకుళంలో సాంకేతిక కారణాల వల్ల తిత్లీ తుఫాను పరిహారం పొందలేని 7 వేల మందికి న్యాయం చేయాలని మరికొందరు కోరారు. వంశధార-బహుదా నదిని అనుసంధానించి శ్రీకాకుళం జిల్లా, ఇచ్ఛాపురం నియోజకవర్గ రైతులకు సాగునీరు అందించాలని రైతులు విన్నవించారు.

శ్రీకాకుళం జిల్లాలో 1998 డీఎస్సీ క్వాలిఫై అయిన 350 మందిని రెగ్యులరైజ్ చేయాలని నిరుద్యోగ టీచర్లు విజ్ఞప్తి చేశారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో బెంతో ఒరియా కులం వారికి ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు ఇప్పించాలని ఆ సామాజికవర్గీయులు కోరారు.గోపాల మిత్రలకు ఉద్యోగ భద్రత కల్పించాలని జగన్ ప్రభుత్వం ఉద్యోగాలు కోల్పోయిన బాధితులు విన్నవించారు. ఎక్స్ సర్వీస్ మెన్లను అన్ని విధాలుగా ఆదుకోవాలని మాజీ సైనికులు వినతిపత్రంసమర్పించారు.

రాష్ట్రంలో 40 వేల మందికి పైగా ఉన్న ఆర్ఎంపీ, పీఎంపీలకు గుర్తింపు సర్టిఫికెట్లు జారీ చేయాలని ఆర్ఎంపి డాక్టర్లు విన్నవించారు. అగ్రిగోల్డ్ కంపెనీ మోసానికి బలైన తమకు న్యాయం చేయాలని అగ్రిగోల్డ్ బాధితులు కోరారు. అందరి సమస్యలను ఓపిగ్గా ఆలకించిన లోకేష్ అధికారంలోకి వచ్చాక ప్రతిఒక్కరికీ న్యాయంచేస్తామని భరోసా ఇచ్చారు.

 

LEAVE A RESPONSE