Suryaa.co.in

Andhra Pradesh

జన సాగరమైన అనకాపల్లి పుర వీధులు

– బ్రహ్మరథం పట్టిన జనం
– జనసేనానికి అడుగడుగునా అపూర్వ స్వాగతం
 -కోలాటాలు, హారతులతో ఆడపడుచుల ఆత్మీయ ఆహ్వానం
– జన సైనికులు, వీర మహిళలు, టీడీపీ, బీజెపీ శ్రేణులతో కిక్కిరిసిన అనకాపల్లి
 -రెండు కిలోమీటర్ల మేర శ్రీ పవన్ కళ్యాణ్ గారు రోడ్ షో
– వారాహి నుంచి విజయనాదం చేసిన జనసేన అధినేత
– బైబై వైసీపీ అంటూ నినదించిన అనకాపల్లి ప్రజానీకం

అనకాపల్లి పట్టణం జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జయ జయ ధ్వానాలతో స్వాగతించింది. ఆడపడుచుల హారతులు, జన సైనికుల జేజేలతో పులకరించింది. వారాహి విజయభేరీ యాత్ర డప్పు చప్పుళ్లు, వీర మహిళల కేరింతలు, ఆడపడుచుల కోలాటాల మధ్య సుమారు గంటన్నర పాటు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పురవీధుల్లో రోడ్ షో నిర్వహించారు. జాతీయ రహదారి సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ నుంచి నెహ్రూ చౌక్ వరకు రెండు కిలోమీటర్ల మేర అనకాపల్లి వీధులు వారాహి విజయ భేరీ సభకు తరలివచ్చిన జనంతో నిండిపోయాయి. వారాహి ధారియై శ్రీ పవన్ కళ్యాణ్ గారు కిక్కిరిసిన జనసందోహం సాక్షిగా విజయనాదం చేశారు. ఎన్నికల ప్రచార యాత్ర వారాహి విజయభేరీ సభ కోసం ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేరుకున్నారు. హెలీప్యాడ్ వద్ద అనకాపల్లి అసెంబ్లీ జనసేన అభ్యర్ధి శ్రీ కొణతాల రామకృష్ణ, పార్లమెంటు బీజెపీ అభ్యర్ధి శ్రీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ శ్రీ బుద్దా నాగ జగదీశ్వరరావు, మాజీ మంత్రి శ్రీ దాడి వీరభద్రరావు, మాజీ ఎమ్మెల్యే శ్రీ పీలా గోవింద్ తదితరులు స్వాగతం పలికారు.

అక్కడ మూడు పార్టీల నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు హెలీప్యాడ్ నుంచి భారీ ర్యాలీగా వారాహి విజయభేరీ సభా వేదిక వద్దకు బయలుదేరారు. వాహనంపైకి ఎక్కిన వెంటనే ఏటికొప్పాక కొయ్యబొమ్మల కళాకారులు ఆయనకు ప్రత్యేకంగా రూపొందించిన కొయ్య బొమ్మను బహూకరించారు. డైట్ కళాశాల సమీపంలోని లే అవుట్ నుంచి రింగు రోడ్డులోని ఎన్టీఆర్ కూడలి, చేపల బజారు, చిన్న నాలుగు రోడ్ల కూడలి, కన్యకాపరమేశ్వరి జంక్షన్, వేల్పుల వీధి మీదుగా రోడ్ షో నిర్వహించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ప్రతి కూడలిలో వేలాది మంది జనసైనికులు, మహిళలు, పట్టణ ప్రజలు హారతులు పట్టారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని స్వాగతిస్తూ పూల వర్షం కురిపించారు. దారిపొడుగునా జనసేన పార్టీ అభ్యర్ధులను గెలిపిస్తామంటూ ప్రజలు స్వచ్ఛందంగా గాజు గ్లాసు గుర్తును ప్రదర్శించారు. ఆడపడుచుల హారతులు స్వీకరిస్తూ, తన కోసం తరలివచ్చిన ప్రతి ఒక్కరికీ నమస్కరిస్తూ, అభివాదం చేస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందుకు సాగారు. మహిళలు ప్రత్యేక సంప్రదాయ వస్త్రధారణలో కోలాటాలు ఆడుతూ యాత్ర ఆద్యంతం సందడి చేశారు. అనకాపల్లి పుర ప్రజానీకం హల్లో ఏపీ.. బైబై వైసీపీ అంటూ నినదించింది. వారాహి విజయభేరీ యాత్రకు వచ్చిన అద్భుత స్పందనతో కూటమి అభ్యర్ధులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం నెలకొంది.

అనకాపల్లి నూకాలమ్మ తల్లిని తలచుకొని సభను ప్రారంభించారు.

శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనకాపల్లి అభివృద్ధి ప్రణాళికతో వరాల జల్లులు కురిపించారు. అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్ధులను గెలిపించాలంటూ గాజుగ్లాజు, కమలం గుర్తులను ప్రదర్శించారు. హెలీ ప్యాడ్ నుంచి బయలుదేరిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి సమస్యలు చెప్పుకొనేందుకు వివిధ వర్గాల ప్రజలు ప్ల కార్డులతో పోటీపడ్డారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యోగులు ప్లకార్డులు ప్రదర్శించారు. సీపీఎస్ అంశం మీద, తుమ్మపాల చక్కెర కర్మాగారం సమస్యలపై గళం విప్పాలని పలువురు రైతులు, ఉద్యోగులు కోరారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రెండు అంశాల మీద వారాహి విజయ భేరీ సభలో స్పందించారు. సభలో జనసేన అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్ధి శ్రీ కొణతాల రామకృష్ణ, కూటమి పార్లమెంటు అభ్యర్ధి శ్రీ సీఎం రమేష్, టీడీపీ నాయకులు శ్రీ పీలా గోవిందు, జనసేన పార్టీ విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు, ఎమ్మెల్సీ శ్రీ నాగ జగదీశ్వర రావు, బీజెపీ నేత శ్రీ పరమేశ్వర రావు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE