భలే నిరుపేద బుట్టమ్మ!

– బుట్టమ్మ పేదరాలంటూ ఎమ్మెల్యే అభ్యర్ధిని పరిచయం చేసిన జగనన్న
(అన్వేష్)

ఈవిడ పేరు బుట్టా రేణుక. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి. గతంలో వైసీపీ కర్నూలు ఎంపిగా పనిచేశారు. ఈమె నిరుపేద. తెల్లరేషన్‌కార్డు లేకపోవడంతో ఏ రోజు బియ్యం ఆరోజు సంపాదించుకుని, పొయ్యిలో కట్టెల కోసం అడవికి వెళ్లి కట్టెలు కొట్టి తెచ్చుకుని జీవించేంత కడుపేద! కాకపోతే… హైదరాబాద్ నగరంలో మూడు సీబీఎస్సీ స్కూల్స్ ఉన్నాయి. పేరు మెరిడియన్ స్కూల్. ఒకటి బంజారాహిల్స్ లో ఉంది. ఒకటి మాదాపూర్ లో ఉంది. ఒకటి కూకట్పల్లి లో ఉంది. ఈ స్కూళ్లలో ఫీజులు కారు చౌక. అసలు ఇంకా ఎక్కువ మాట్లాడితే.. మాజీమంత్రి మల్లారెడ్డి చెప్పినట్లు, ఈవిడ స్కూళ్లలో లక్షలమందికి విద్యాదానం చేస్తారు.

ఎంత కారుచౌకంటే… ఈ స్కూల్లో సంవత్సరం ఫీజు ఎల్కేజీ బుడ్డోడు కైనా.. పదో క్లాస్ పెద్దోడికైనా లక్ష రూపాయల నుంచి లక్షన్నర వరకు తీసుకుంటారు. ఇది కూకట్పల్లి క్యాంపస్ లో! అదే మాదాపూర్ క్యాంపస్ లో అయితే మూడు లక్షల వరకు తీసుకుంటారు. బంజారాహిల్స్ లో ఇంకో లక్ష ఎక్కువే ఉంది. బేగంపేట లో యాత్రి నివాస్ మనందరికీ సుపరిచితమైన హోటల్ అదికూడా ఈ నిరుపేదదే.

ఇవి కాక రెండు మూడు రెస్టారెంట్లు, బట్టలు కొట్టు, టాటా కార్ల డీలర్ షిప్, మాదాపూర్ లో ఒక రెండు ఎకరాల్లో కన్వెన్షన్ హాల్.ఈవిడవే. ఈవిడని జగన్మోహన్ రెడ్డి మీటింగ్ లో ప్రజలకు పరిచయం చేస్తూ.. ఆర్థికంగా అంతంతమాత్రంగానే ఉంది అని చెప్పాడు. బుట్టమ్మను ప్రజలకు పరిచయం చేస్తూ జగనన్నయ్య చెప్పిన మాటలు విని, అక్కడి ఓటర్లు నవ్వుకుంటున్నారట. అంటే బహుశా.. అన్నయ్య తన ఆస్తులతో పోల్చి , బుట్టమ్మ చెల్లి గురించి చెప్పి ఉంటారని సోషల్‌మీడియాలో నెటిజన్లు తెగ సెటైర్లు వేస్తున్నారు.

Leave a Reply