రుణాంద్రప్రదేశ్ గా మారిన ఆంధ్ర ప్రదేశ్

-రిటైర్డ్ ఐ.ఎ.ఎస్ అధికారి డాక్టర్ పి.వి రమేష్ ఆవేదన

ఆంధ్రప్రదేశ్ నేడు 10 లక్షల కోట్ల అప్పులతో రుణాంద్రప్రదేశ్ గా మారిందని రిటైర్డ్ ఐఎఎస్ అధికారి డాక్టర్ పి.వి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరులోని జనచైతన్య వేదిక హాలులో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిపై డాక్టర్ పి.వి రమేష్ తో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జనచైతన్య వేదిక అధ్యక్షులు వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి అధ్యక్షత వహించారు.

డాక్టర్ పి.వి రమేష్ ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్లో మద్యం అమ్మకాల ద్వారా 250 శాతం ఆదాయం పెరిగిందనీ పేదలు నిరుపేదలుగా మారారన్నారు. ఆంధ్రప్రదేశ్ లో తలసరి అప్పు 2.5 లక్షలకు చేరిందని, అప్పు తీర్చడానికి తిరిగి అప్పు చేసే పరిస్థితులకు నెట్టివేయబడిందన్నారు. గత ఐదు సంవత్సరాల కాలంలో నీటిపారుదల ప్రాజెక్టులు, పరిశ్రమలను అభివృద్ధి చేసుకోలేకపోయామని వ్యవసాయ రంగ అభివృద్ధికి పెట్టుబడులను సక్రమంగా పెట్టలేకపోయామన్నారు.

ఆంధ్రప్రదేశ్లో లోక్ సభకు 100 కోట్ల కు పైగా శాసనసభకు 30 కోట్లకు పైగా అభ్యర్థులు వెచ్చించే స్థితికి చేరిందని తద్వారా ఎన్నికలలో కొద్ది కుటుంబాలు మాత్రమే పోటీ పడే పరిస్థితి ఉందన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటి మధ్య సమతౌల్యత లోపించిందన్నారు. విశ్వవిద్యాలయాలలో విద్యా ప్రమాణాలు గణనీయంగా పడిపోయాయని బోధన సిబ్బంది లేకపోవడంతో ప్రభుత్వ యూనివర్సిటీలు ప్రైవేటు యూనివర్సిటీలతో పోటీ పడలేక పోతున్నాయన్నారు. పని సంస్కృతి తగ్గిపోతుందని, అధికార యంత్రాంగం అవినీతిపరులైన, రాజకీయ నేతల కబంధహస్తాలలో మ్రగ్గి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు తెలంగాణ కన్నా ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత ప్రజలు ఎక్కువ తలసరి ఆదాయం కలిగి ఉంటే గత పది సంవత్సరాల కాలంలో తెలంగాణ ముందుకు వచ్చిందన్నారు. ఈ సందర్భంగా జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రసంగిస్తూ నీటిపారుదల ప్రాజెక్టు లు పూర్తి అయితే ఆంధ్రప్రదేశ్ మరో పంజాబ్, హర్యానారాష్ట్రాల స్థాయికి వ్యవసాయ రంగంలో చేరుకోగలదన్నారు. నేడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ,నీటిపారుదల ప్రాజెక్టులకు అతి తక్కువ ప్రాధాన్యత ఇస్తుందన్నారు.

రాజకీయ అవినీతి పెరగటం వలన పరిశ్రమలు రాక నిరుద్యోగ సమస్య తీవ్రమైంద న్నారు. ఈ కార్యక్రమంలో నాగార్జున విశ్వవిద్యాలయ పూర్వ రిజిస్టర్ ప్రొఫెసర్ ఎన్. రంగయ్య , సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సేవకుమార్ , వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు, జై ఆంధ్ర ఫోరం నేత అవధానుల హరి, మానవత చైర్మన్ పావులూరి రమేష్ , ప్రముఖ అధ్యాపకులు ప్రొఫెసర్ కె.మాల కొండయ్య , డాక్టర్ పి. పోతురాజు తదితరులు ప్రసంగించారు

 

Leave a Reply