– జగన్ అసమర్థ పాలనతో రాజధాని లేకుండా పోయింది
– భావితరాల భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని పునర్నిమిస్తున్నాము
– వైసీపీ నియంతృత్వ పోకడలతో అమరావతి, పోలవరం నిర్మాణ వ్యయం రెట్టింపు
– ఎన్నికల హామీలన్నీ అమలు చేస్తాము
– ఏడు నెలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాం
– ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం చరిత్రాత్మక అవసరం
– విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
అమరావతి\మాచర్ల : ఒక్క అవకాశం అంటూ వచ్చి… ఐదేళ్లు అధికారం వెలగబెట్టిన జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ను అంధకారంలోకి నెట్టేశారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ పల్నాడు జిల్లా పరిధిలోని మాచర్ల నియోజకవర్గంలో మంత్రి గొట్టిపాటి మంగళవారం నాడు ప్రచారం నిర్వహించారు.
నియోజకవర్గ పరిధిలోని కారంపూడి, చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి., అక్కడి ఉపాధ్యాయులను, పట్టభద్రులను కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటిని గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం చరిత్రాత్మక అవసరం అని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఓటూ ఎంతో విలువైనదని… ఒక్క ఓటు కూడా వృధా కాకుండా పోలింగ్ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని స్థానిక నేతలకు దిశా నిర్దేశం చేశారు.
సాధారణ ఎన్నికలకు భిన్నంగా బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఈ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటును కూటమి అభ్యర్థులకే వేసే విధంగా ఓటర్లకు అవగాహన కల్పించాలని కోరారు. జగన్ విధ్వంస పాలన నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం భావితరాల భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ పునర్నిమాణం చేపట్టిందని వివరించారు.
వైసీపీ నేతల ఆదాయం ఘనం… ప్రజలపై రెట్టింపు భారం…
ఎన్నికల ప్రచారం అనంతరం మంత్రి గొట్టిపాటి రవికుమార్ మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల కోట్ల రూపాయిల అప్పులతో రాష్ట్రాన్ని ఊబిలోకి నెట్టేశారని తెలిపారు. గత ఐదేళ్ల జగన్ పాలనలో వైసీపీ నేతలు అక్రమంగా కోట్ల రూపాయిల ప్రజా ధనాన్ని లూటీ చేశారని ఆరోపించారు. అదే సమయంలో ప్రజలపై అప్పులు, పన్నుల భారం రెట్టింపయ్యిందన్నారు. కనీసం రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా చేశారని విమర్శించారు. అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు పోలవరం నిర్మాణాల వ్యయం కూడా రెట్టింపు అయ్యిందని మంత్రి వాపోయారు.
ప్రస్తుతం డయాఫ్రం వాల్ నిర్మాణానికి వెయ్యి కోట్ల రూపాయిలు ఖర్చు అవుతుందని, ఇది గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఒక్క నిదర్శనం మాత్రమేనని పేర్కొన్నారు. అన్ని వ్యవస్థలనూ జగన్ అండ్ కో భ్రష్టు పట్టించారని స్పష్టం చేశారు. నింగి నుంచి నేల వరకు అన్నట్లు… ఇసుక, మట్టి, గనులు, తీర ప్రాంతాలు, ప్రకృతి వనరులనూ ఐదేళ్లు అడ్డగోలుగా దోచేశారని ఆయన మండి పడ్డారు. ప్రజలు అధికారం ఇస్తే… రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారని మండి పడ్డారు. ఇంత చేసినా… ఇంకా జగన్ దుర్మార్గపు ఆలోచనలతో అబద్ధాలు చెబుతున్నారని, ప్రజలందరూ ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి గొట్టిపాటి సూచించారు.
వైసీపీ ప్రభుత్వంలో నెలవారీ జీతాలూ గగనమే….
గడిచిన ఏడు నెలల కాలంలో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మంత్రి గొట్టిపాటి వివరించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు నెలవారీ జీతాలు ఎప్పుడూ క్రమపద్ధతిలో ఇవ్వలేదని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు, లక్షలాది మందికి పెన్షన్లను.. ప్రతి నెలా ఒకటో తారీఖున జమ చేస్తున్నామని తెలిపారు. అదే విధంగా అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించామన్నారు. వెయ్యి కోట్లతో రోడ్లకు మరమత్తులు చేశామని వెల్లడించారు.
రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణాలను పునఃప్రారంభించామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వివరించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వ్యవస్థలూ ధ్వంసమయ్యాని చెప్పారు. సీఎం చంద్రబాబు దార్శనికతతో రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటుదని తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కుకు సీఎం చంద్రబాబు చొరవతోనే కేంద్రం రూ.10 వేల కోట్లు కేటాయించిందన్నారు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య పాలనతో రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా… ప్రజా సంక్షేమంలో రాజీ లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు.
ఎన్నికల హామీలన్నీ అమలు చేస్తామని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటేసి వారిని గెలిపించాలని కోరారు. కృష్ణా, గుంటూరు జిల్లాల కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను గెలిపించాలని మంత్రి గొట్టిపాటి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డితో పాటు పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు.