Suryaa.co.in

Andhra Pradesh

దళారులు, అవినీతికి తావులేని టెక్నాలజీయే ఏపీ సర్కారు ఆయుధం

( విజయసాయిరెడ్డి, ఎంపీ)

పేదలు సహా అల్పాదాయవర్గాలకు ప్రభుత్వ సాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి వస్తోంది ఆంధ్రప్రదేశ్‌లో. సర్కారు నుంచి సొమ్ము ప్రజానీకానికి అందడానికి గతంలో దళారులు, లంచాల పాత్ర కనిపించేది. 2019లో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి నాయకత్వాన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే సామాన్యుడికి సంక్షేమ పథకాల వల్ల ప్రత్యక్షంగా మేలు చేయాలనే ఐడియా వచ్చింది. అందుకు సర్కారు నుంచి డబ్బు వారి అకౌంట్లలో వేయడమే మేలని గుర్తించారు.

ఆధునిక సమాచార సాంకేతికత (ఐటీ)తో నడిచే ఈ పద్ధతిని అదివరకు ప్రభుత్వాలు చాలా తక్కువగా అనుసరించాయి. ఐదేళ్ల తెలుగుదేశం పాలనలో అన్ని విధాలా ఆర్థికంగా కుంగిపోయిన సామాన్యులను ఆదుకోవడమే జగన్‌ సర్కారు ప్రధాన అజెండా అయింది. ఎన్నికల ముందు వాగ్దానం చేసిన సవరత్నాలు సహా అనేక సంక్షేమ పథకాల అమలుకు కొత్త విధానం అక్కరకొచ్చింది. పేదలకు నేరుగా మేలు చేసే నగదు బదిలీ పద్ధతిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం తన ప్రధాన సాధనంగా మార్చుకుంది. దివంగత జననేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారు– దేశంలోనే మొదటిసారి స్మార్ట్‌ కార్డ్‌ పద్ధతి ద్వారా పేదలకు ఉపాధి హామీ పథకం కింద నగదు పంపిణీకి 2006లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకారం చుట్టారు. ఈ నగదు బదిలీ లేదా ప్రత్యక్ష మేలు బదిలీ (డీబీటీ) విధానాన్ని జగన్‌ గారి ప్రభుత్వం అనేక స్కీములకు విస్తరించింది.

కొవిడ్‌–19 మహమ్మారి తెచ్చిన కష్టాల నుంచి నగదు బదిలీయే పేదలను కాపాడింది
వైఎస్సార్సీపీ అధికారం చేపట్టి ఏడాది నిండకుండానే 2000 వేసవి నుంచి విజృంభించిన కొవిడ్‌–19 మహమ్మారి ఏపీలో కూడా విలయతాండవం చేసింది. దీనితో ఉపాధి కోల్పోయిన ప్రజలను కాపాడడానికి, తర్వాత వారికి డబ్బు లోటు రాకుండా నగదు బదిలీ పథకాలు ఎనలేని మేలు చేశాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజల కొనుగోలు శక్తి గణనీయంగా పడిపోయిన పరిస్థితుల్లో ఏపీ సర్కారు నగదు బదిలీ పథకాల వల్ల జనం ప్రయోజనం పొందారు. వార్డు, గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ఈ పథకాల అమలుకు ప్రధాన పనిముట్లుగా ఉపకరించాయి. ప్రభుత్వం నుంచి పేద ప్రజలకు, బడుగు, బలహీన వర్గాలకు కొద్ది వేల రూపాయల సొమ్ము చేతిలో పడడానికి 2019కి ముందు దళారుల ప్రమేయం ఉండేది. ఈ క్రమంలో లంచాలు సాధారణ ప్రజలకు మోయలేని భారమయ్యేవి. ఇప్పుడు సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నగదు బదిలీతో జీవితం సుఖవంతమౌతోంది. ఇటీవల ముఖ్యమంత్రి చెప్పినట్టు డీబీటీ (నగదు బదిలీ) విధానం ద్వారా, ‘బటన్‌ నొక్కితే ప్రజల అకౌంట్లలోకి డబ్బులు పడుతున్నాయి.

దళారులు, అవినీతి మాయం కావడమే కాదు, ఎలాంటి వివక్ష లేకుండా అర్హులైన వారందరికీ మేలు జరుగుతోంది. ప్రతి 50 మందికి ఒక వాలంటీర్‌ తోపాటు కొత్తగా వచ్చిన సచివాలయ వ్యవస్థ పాలనలో పారదర్శకత తీసుకొచ్చింది. గ్రామంలో, వార్డు స్థాయిలో లబ్ధిదారుల జాబితాలు అందుబాటులోకి వచ్చాయి. ఒకవేళ అర్హత గల ఏ ఒక్క లబ్ధిదారు పేరు కనిపించకపోయినా, ఎక్కడికి పోయి తమ దరఖాస్తులోని తప్పును దిద్దించుకోవాలో ప్రజలకు తెలిసింది. ’ తెలుగునాట పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే ఇంతటి విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఏపీ సర్కారు నిజంగా పేదలకు, టెక్నాలజీకి అనుకూలమైనదని రుజువైంది. హైదరాబాద్‌లో దాదాపు 9 ఏళ్లు ‘హైటెక్‌ సీఎం’గా ప్రచారం చేసుకున్న చంద్రబాబుకు ఈ వాస్తవాలు కనిపించవా? మూడేళ్లలో రూ.1.65 లక్షల కోట్ల డబ్బు ప్రజల ఖాతాల్లో జమచేసిన ప్రభుత్వంపై నిందలను ఆంధ్రులు నమ్మరంటే నమ్మరని ఆయన గుర్తించరా?

LEAVE A RESPONSE