-ముస్లింలను హిందూ బోర్డులో భాగం కావడానికి అనుమతిస్తుందా ?
– జిల్లా కలెక్టర్లకు ఇచ్చిన అధికారులపై అస్పష్టత ఎవరైనా ముస్లిం అవునా కాదా అని ప్రభుత్వం ఎలా నిర్ణయించగలదు? – వక్ఫ్ చట్టంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
ఢిల్లీ: కొత్త వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. కొన్ని అంశాలపై అనుమానాలు ఉన్నాయని అభిప్రాయపడింది. జిల్లా కలెక్టర్లకు ఇచ్చిన అధికారులపై అస్పష్టత ఉందని పేర్కొంది.
పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు, కొత్త చట్టంలోని చాలా రూల్స్‌పై ప్రశ్నలు సంధించింది. వినియోగదారుల ఆస్తుల ద్వారా వక్ఫ్‌కు సంబంధించిన నిబంధనలపై కేంద్రాన్ని నిలదీసింది. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్‌లో ముస్లిమేతరులను చేర్చే నిబంధనపై కూడా కోర్టు ప్రశ్నించింది. ముస్లింలను హిందూ బోర్డులో భాగం కావడానికి అనుమతిస్తుందా అని ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసింది.
వక్ఫ్ బోర్డులో ఎక్స్-అఫిషియో సభ్యులు కాకుండా ముస్లిం సభ్యులు మాత్రమే ఉండాలని కోర్టు కామెంట్ చేసింది. దీనిని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వ్యతిరేకించారు. ఈ పిటిష్లపై గురువారం మధ్యాహ్నం 2 గంటలకు మళ్ళీ విచారణకు జరగనుంది.
వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ చాలా పిటిషన్లు వచ్చినందున విచారణ ప్రారంభంలోనే ప్రధాన న్యాయమూర్తి పిటిషనర్లకు కీలకాంశాలు పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. పిటిషనర్లు ఏ అంశాలను వాదించాలనుకుంటున్నారని? పిటిషనర్లలో ఒకరి తరపున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ, కొత్త చట్టంలోని అనేక నిబంధనలు ఆర్టికల్ 26ను ఉల్లంఘిస్తున్నాయని అన్నారు.
వక్ఫ్ సవరణ చట్టం 2025కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఎవరైనా ముస్లిం అవునా కాదా అని ఎలా నిర్ణయించగలరని అభ్యంతరం వ్యక్తం చేశారు. వక్ఫ్‌కు ఆస్తిని దానం చేయడానికి, ఆ వ్యక్తి కనీసం 5 ఏళ్లుగా ఇస్లాంను అనుసరిస్తూ ఉండాలి అని పేర్కొన్న కొత్త చట్టంలో మార్పును కపిల్ సిబల్ వ్యతిరేకించారు.
వక్ఫ్ నిర్వహణ చట్టంలోని సెక్షన్ 3Rని ప్రస్తావిస్తూ కపిల్ సిబల్ ఈ ప్రశ్నను లేవనెత్తారు. వక్ఫ్ అంటే ఐదు సంవత్సరాలుగా ఇస్లాంను అనుసరిస్తున్న వ్యక్తి అని చెబుతుందని ఆయన అన్నారు. దీని అర్థం ఆ వ్యక్తి ఐదు సంవత్సరాలుగా ఇస్లాంను అనుసరిస్తున్నాడని చెప్పాల్సి ఉంటుందని, అయితే ఎవరైనా ముస్లిం అవునా కాదా అని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు, ఎలా నిర్ణయించగలదని ఆయన అన్నారు.
ఇస్లాంలో వారసత్వం ఎవరికి లభిస్తుందో చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరు ఉన్నారని కపిల్ సిబల్ ప్రశ్నించారు. కపిల్ సిబల్ వాదనపై ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా జోక్యం చేసుకుని, ‘కానీ హిందూ మతంలో ఇది జరుగుతుంది. అందుకే పార్లమెంటు ముస్లింల కోసం ఒక చట్టం చేసింది. ఇది హిందువుల మాదిరిగా ఉండకపోవచ్చు. రాజ్యాంగంలోని ఆర్టికల్ ఈ విషయంలో చట్టం చేయకుండా ఉండలేదు’ అని అన్నారు. ఆర్టికల్ 26 అందరికీ వర్తిస్తుందని ఆయన అన్నారు.
ఇస్లాంలో వారసత్వ నిర్ణయం మరణానంతరం తీసుకుంటారని కానీ ప్రభుత్వం ముందే జోక్యం చేసుకుంటుందని కపిల్ సిబల్ అన్నారు. ప్రభుత్వం ఆస్తిని గుర్తించి అది వక్ఫ్ కాదా అని ప్రకటించడం ఎలా సాధ్యమవుతుంది. వక్ఫ్ ఆస్తిని గుర్తించడానికి కలెక్టర్‌కు నిర్ణయం తీసుకునే హక్కు ఇవ్వడంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏదైనా వివాదం ఉంటే, ఆ ఆస్తి వక్ఫ్ కాదా అని కలెక్టర్ నిర్ణయించే బాధ్యత చట్టంలో కలెక్టర్‌కు ఇచ్చారని అన్నారు. కలెక్టర్ ప్రభుత్వ వ్యక్తి అని అతనికి నిర్ణయం తీసుకునే హక్కు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధంగా తెలిపారు. కలెక్టర్ న్యాయమూర్తి పాత్ర పోషిస్తే అది రాజ్యాంగ విరుద్ధమని ఆయన వాదించారు.
సుప్రీంకోర్టులో విచారణ ముగియబోతున్న టైంలో ఈ విచారణ పెండింగ్‌లో ఉన్నంత వరకు రెండు ఆదేశాలు ఇస్తున్నట్టు కోర్టు సూచించింది. వక్ఫ్ బోర్డులోని ఎక్స్-అఫిషియో సభ్యులు తప్ప అందరు సభ్యులు ముస్లింలై ఉండాలి. వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకించే వారి అతిపెద్ద ఆందోళన ఏమిటంటే, నమోదు చేయని వక్ఫ్ బై యూజర్ డీనోటిఫై చేయనున్నారు. అంటే అది ఇకపై వక్ఫ్ కాదు. దీనిపై సుప్రీంకోర్టు, విచారణ పెండింగ్‌లో ఉన్నంత వరకు ప్రభుత్వం ఇలాంటివి ఏమీ చేయదని పేర్కొంది.
వక్ఫ్ సవరణ చట్టం 2025 పై విచారణ సందర్భంగా, హిందూ ట్రస్ట్ బోర్డులో హిందువులు కాని సభ్యులు ఉన్నారా అని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తిరుమల తిరుపతి దేవస్థానం గురించి కూడా కోర్టు ప్రస్తావించింది. అందులో హిందూయేతరులు సభ్యులుగా ఉన్నారా అని క్వశ్చన్ చేసింది. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను చేర్చడంపై పిటిషనర్ల అభ్యంతరానికి సంబంధించి సుప్రీంకోర్టు ఈ ప్రశ్న అడిగింది.