మన దేశంలో సినీతారలు కారావాన్‌లు వాడటం సాధారణమే. అయితే, విదేశాల్లో కొందరు తమ కారవాన్‌లలోనే నివసిస్తూ, నచ్చినచోటికి సాగిపోతూ జీవితం గడిపే ట్రెండ్ మొదలైంది. హుద్‌హుద్ తుఫాను నుంచి విజయవాడ వరదల వరకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన బస్సునే నివాసంగా మార్చుకొని, సహాయక చర్యలలో నిమగ్నమయ్యారు. స్వయంగా బస్సులోనే కాకరకాయ జ్యూస్ తయారు చేసుకునే ఆయనకు, ఇలాంటి ‘లైఫ్ ఆన్ వీల్స్’ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.
తాజాగా జరిగిన టూరిజం కాన్‌క్లేవ్‌లో భాగంగా, నడిచే హోటల్ రూమ్‌లుగా తీర్చిదిద్దిన కారావాన్‌లను ఆయన బాబా రామ్‌దేవ్‌తో కలిసి ప్రారంభించారు. ఆ కారావాన్‌లను పరిశీలిస్తూ, అందులోని సౌకర్యాలు, ప్రయాణ అనుకూలత, ఖర్చులతో కూడిన ప్రయోజనాల గురించి నిర్వాహకులను ప్రశ్నించారు.
అయితే, ఓ వ్యక్తి ఆయనకు కారావాన్‌ల గొప్పదనం వివరిస్తుండగా, నవ్వుతూ “నువ్వు నాకు నేర్పిస్తున్నావా?” అని సరదాగా వ్యాఖ్యానించారు. తన ప్రశ్న ద్వారా పర్యాటకులను ఎంత తక్కువ ఖర్చుతో ఆకర్షించవచ్చో తెలుసుకోవాలనేది ఆయన ఉద్దేశం.
పర్యాటక రంగంపై చంద్రబాబు విజన్ దశాబ్దాల క్రితమే మొదలైంది. ఆదాయ వనరుగా పర్యాటకాన్ని ప్రోత్సహించిన ఆయన కృషిని ఇటీవలే తెలంగాణా అసెంబ్లీలోనూ ప్రశంసించారు. “ఏ ఇజం లేదు. ఉన్నదంతా టూరిజమే” అంటూ ఉమ్మడి రాష్ట్రంలో నాడు చంద్రబాబు అనేవారని తెలంగాణ అసెంబ్లీలో సీపీఐ నేత, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు.
ఆయన వ్యాఖ్యలపై ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆ అంశాన్ని చంద్రబాబు ప్రస్తావిస్తూ.. “ఏ ఇజం లేదు అని నేను నాడు అంటే.. కమ్యునిస్టులు నాపై విరుచుకుపడ్డారు” అని గుర్తు చేశారు. నా ఆలోచనను అర్థం చేసుకునేందుకు వారికి 30 ఏళ్లు పట్టింది అని నవ్వుతూ వ్యాఖ్యానిస్తూ.. ఇప్పుడంత సమయం లేదని, త్వరగా ప్రాజెక్టులు తెచ్చి, ప్రజల జీవితాల్లో మార్పులు తేవాలని వారిని ఆ సదస్సులో కోరడం మనకు తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించి, ప్రత్యేక టూరిజం పాలసీని సీఎం చంద్రబాబు ప్రకటించారు. పర్యాటక రంగంలో రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా విజయవాడలో ఈ టూరిజం కాన్‌క్లేవ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రెండో రోజు ఈ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.