భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక ప్రణాళిక
రాష్ట్ర పండుగ హోదాలో మహా శివరాత్రి వేడుకలు
గత ఐదేళ్లుగా పవిత్ర శైవక్షేత్ర నిర్వహణను పట్టించుకోని వైసీపీ
సీఎం చంద్రబాబు నేతృత్వంలో కోటప్పకొండకు పూర్వ వైభవం
– పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్
అమరావతి\పల్నాడు: మహా శివరాత్రి సందర్భంగా కోటప్పకొండకు వచ్చిన భక్తులందరూ.. ఎటువంటి ఇబ్బందీ లేకుండా పరమేశ్వరుడిని మంచి దర్శనం చేసుకునే విధంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఈనెల 26వ తేది మహా శివరాత్రిని పురస్కరించుకుని కోటప్పకొండలో జరిగే ఉత్సవాల ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, అరవింద్ లతో కలిసి మంత్రి గొట్టిపాటి పరిశీలించారు.
ఈ సందర్భంగా భక్తుల క్యూలైన్ల ఏర్పాట్లతో పాటు వారికి తాగునీటి సదుపాయం, రవాణ, శానిటేషన్, భక్తులకు తాత్కాలిక వసతి వంటి అంశాలను అధికారులతో చర్చించారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కోటప్పకొండ మహా శివరాత్రి తిరునాళ్లను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న నేపధ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు.
లక్షలాది భక్తులు తరలివచ్చే ప్రాంతం కావడంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పాటు కోటప్పకొండ ప్రాంతం మొత్తం ఆధ్యాత్మిక శోభ పరిఢవిల్లేలా ఏర్పాట్లు ఉండాలని తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందుల లేకుండా చూడాలన్నారు. అదే విధంగా సమాచార మార్పిడి లోపం లేకుండా, మైక్ ప్రచార కేంద్రం నిర్వహణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు.
కోటప్పకొండకు పూర్వ వైభవం.
టీడీపీ ప్రభుత్వ హయాంలో కోటప్పకొండ ఎంతో అభివృద్ధి జరిగిందని, మాజీ స్పీకర్ దివంగత కోడెల శివప్రసాద్ కోటప్పకొండ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతో కృషి చేశారని మంత్రి గొట్టిపాటి గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన శైవక్షేత్రమైన కోటప్పకొండ… గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధికి దూరమయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో.. గత ప్రభుత్వ పాలకులు భక్తుల మనోభావాలకు వ్యతిరేకంగా… కోటప్పకొండ నిర్వహణను గాలికి వదిలేశారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత మహా శివరాత్రిని పురస్కరించుకుని భక్తులకు మంచి దర్శనం అందే విధంగా పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. క్యూ లైన్లు రద్దీ క్రమబద్ధీకరిస్తూ.. ఉచిత దర్శనంతో పాటు అందరికీ ఆ దేవదేవుని దర్శనం అందేలా ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని వివరించారు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కూడా అధికారుల సూచనలను పాటిస్తూ ఎటువంటి ఇబ్బందీ లేకుండా దర్శనం పూర్తి చేసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో కోటప్పకొండను రాష్ట్రంలోనే ప్రముఖ శైవక్షేత్రంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. కోటప్పకొండకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి గొట్టిపాటి వెల్లడించారు. కార్యక్రమంలో స్థానిక కూటమి నేతలతో పాటు పలువురు పాల్గొన్నారు.