– పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిబంధనలు మారుస్తూ చట్ట సవరణ
– ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టాల సవరణ బిల్లు 2024 కు అసెంబ్లీ ఆమోదం
– జనాభా వృద్ది రేటు పెంపుదలలో భాగంగానే చట్టంలో మార్పులు
– అసెంబ్లీలో బిల్లు ఆమోదం కోసం ప్రతిపాదించిన మంత్రి పొంగూరు నారాయణ
అమరావతి: ఇకపై ఇద్దరి కంటే ఎక్కువమంది పిల్లలున్నా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ ఉంటుంది. దీనికి సంబంధించి గతంలో ఉన్న చట్టాల్లో సవరణ చేస్తూ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టాల సవరణ బిల్లు 2024 కు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును నాలుగు రోజుల క్రితమే మంత్రి నారాయణ సభలో ప్రవేశపెట్టారు.తాజాగా సోమవారం బిల్లు ఆమోదం కోసం మంత్రి నారాయణ ప్రతిపాదించిన తర్వాత ఎలాంటి చర్చా లేకుండానే ఆమోదం పొందింది.
ఏమిటి ఈ సవరణ బిల్లు?
1960 దశకంలో జనాభా నియంత్రణలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుటుంబ నియంత్రణ పథకాలు ప్రవేశపెట్టాయి..కుటుంబ నియంత్రణలో భాగంగా తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో భాగంగా పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారిని అనర్హులుగా చేస్తూ చట్టంలో సవరణలు చేసారు.
1955 మున్సిపల్ కార్పొరేషన్ల చట్టంలోని సెక్షన్ 21 బి,అలాగే 1965 మున్సిపాల్టీల చట్టం లోని సెక్షన్ 13 బి లను చొప్పిస్తూ ఏపీ మున్సిపల్ శాసనాల సవరణ బిల్లు 1994ను తీసుకొచ్చారు…1994లో జరిగిన ఈ సవరణల ప్రకారం ఇద్దరికంటే ఎక్కువ మంది సంతానం కలిగిఉన్న వారు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు.అప్పటి నుంచి ఇదే విధానం కొనసాగుతూ వస్తుంది.
అయితే గత మూడు దశాబ్దాలలో జనాభా నియంత్రణ కొరకు తీసుకున్న చర్యలతో సంతానోత్పత్తి సామర్ధ్యం రేటు బాగా తగ్గిపోయింది..2001లో 2.6 నుంచి 1.5కు తగ్గిపోయింది.జనన,మరణాల నిష్ఫత్తిలో ఆంధ్రప్రదేశ్ బాగా వెనుకబడిపోయింది.తద్వారా జనాభా వృద్ది రేటు బాగా తగ్గిపోయింది.ఇదే సమయంలో వృద్దుల జనాభా రేటు ఎక్కువగా ఉంది…మారుతున్న సామాజిక,ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా జనాభాను పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న ఉద్దేశంతోనే చట్టంలో సవరణలు చేయాల్సి వచ్చింది.
దీని ప్రకారం గతంలో ఆయా చట్టాల్లో చేసిన సవరణలకు సంబంధించిన సెక్షన్ లను తొలగిస్తూ ఏపీ మున్సిపల్ శాసనాల చట్ట సవరణకు అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది.