Suryaa.co.in

Andhra Pradesh

సాక్షి పత్రికా కార్యాలయాలపై దాడులు తగవు

– ఏపీయూడబ్ల్యూజే

అమరావతి: రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో సాక్షి కార్యాలయాలపై అధికారపార్టీ కార్యకర్తలు దాడులు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఖండించింది. ఆమేరకు ఏపీయూడబ్ల్యుజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్, ఐజేయూ జాతీయ కార్యదర్శి డి సోమసుందర్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసారు.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అధికారపార్టీ కార్యకర్తలు సాక్షి కార్యాలయాలపై దాడులు చేసి బోర్డులపై సాక్షి అక్షరాలను తొలగించడం , పత్రిక ప్రతులను దగ్దం చేయడం వంటి చర్యలకు పాల్పడటం దిగ్భ్రాంతి కలిగించిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

జూన్ 6 వ తేదీన సాక్షి టీవీలో జరిగిన ఒక లైవ్ షోలో అమరావతి మహిళలను కించపరుస్తూ ఒక పాత్రికేయుడు చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయి. వ్యాఖ్యలు పాత్రికేయ విలువలను దెబ్బ తీసేవిగానూ , సభ్యసమాజం సిగ్గు పడేవిగానూ ఉన్నాయి.

సీనియర్ పాత్రికేయుడైన షో నిర్వాహకుడు ఆ వ్యాఖ్యలను వెంటనే ఖండించక పోవడంతో రాష్ట్రంలో మహిళల్లో సహజంగానే ఆగ్రహావేశాలు, భావోద్వేగాలు వెల్లువెత్తాయి” అని యూనియన్ నాయకులు తమ ప్రకటనలో అభిప్రాయపడ్డారు.

పాత్రికేయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలపై పలుచోట్ల పౌరులు ఫిర్యాదులు చేయగా కేసులు నమోదయ్యాయి. వాటిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో అధికారపార్టీ కార్యకర్తలు సాక్షి కార్యాలయాలపై దాడులకు పూనుకోవడం గర్హనీయమని ఎ.పి.యు.డబ్ల్యూ.జే. ఆ ప్రకటనలో ఖండించింది.

పత్రికా కార్యాలయాలపై దాడులు చేసే సంస్కృతి పత్రికా స్వేచ్ఛకు, ప్రజాస్వామ్యానికి ప్రమాదమని యూనియన్ నాయకులు అభిప్రాయపడ్డారు. అధికారపార్టీ నేతలు వెంటనే తమ కార్యకర్తలను అదుపు చేయాలని యూనియన్ నాయకులు విజ్ఞప్తి చేశారు.

లైవ్ షో నిర్వాహకుడు, సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు తన షోలో జరిగిన సంఘటనకు క్షమాపణ చెప్పినందున , ఆయన సీనియారిటీని, వయసును దృష్టిలో ఉంచుకుని ఆయనపై తదుపరి చర్యలు నిలిపివేయాలని ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

LEAVE A RESPONSE