– బాబును కలిసేందుకు రఘురామిరెడ్డి యత్నం
– అనుమతించని సెక్యూరిటీ
– అవమానభారంతో వెళ్లిన కొల్లి
– పీఎస్సార్, సంజయ్‌కూ అదే అవమానం
– బాబు నో అపాయింట్‌మెంట్
– నేతల అభీష్టం నెరవేరుస్తున్న బాబు
(అన్వేష్)
విజయవాడ: వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ‘జగన్ దళపతి’గా ముద్ర పడిన ఐపిఎస్ అధికారి కొల్లి రఘురామిరెడ్డికి టీడీపీ ప్రభుత్వం అప్పుడే చుక్కలు చూపించడం ప్రారంభించింది. సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న చంద్రబాబును కలిసేందుకు కొల్లి, ఆయన నివాసానికి వెళ్లారు. ఆయన వచ్చిన సమాచారాన్ని చంద్రబాబుకు పంపించగా, ఆయనను కలిసేందుకు ఇష్టపడటం లేదన్న సమాధానం వచ్చింది. దానితో సెక్యూరిటీ కొల్లిని లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదు. మీకు అపాయింట్‌మెంట్ లేదని నిర్మొహమాటంగా చెప్పడంతో, కొల్లి అవమాన భారంతో వెళ్లిపోయారట.
జగన్ సర్కారు హయాంలో ఒక్కసారే ఎన్నో పోస్టులు అనుభవించి, నంద్యాలలో చంద్రబాబును దగ్గరుండి అరెస్టు చేయించిన రఘురామిరెడ్డిపై, టీడీపీ శ్రేణులు పీకల్లోతు కోపంతో ఉన్నారు. టీడీపీ నేతల ఫోన్లను కూడా ఆయనే ట్యాపింగ్ చేయించారని పార్టీ నేతలే ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సంగతి తేల్చాలన్న పట్టుదలతో ఉన్నాయి.
ఇక బాబును కలిసేందుకు వచ్చిన ఇంటలిజన్స్ మాజీ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులును కూడా కలిసేందుకు బాబు ఇష్టపడలేదు. ఆయన కూడా సీఎం అపాయింట్‌మెంట్ లేక నిరాశగా వెనుదిరిగారు. జెసి బ్రదర్స్‌పై వేధింపుల పర్వంతోపాటు, ఎన్నికల సమయంలో వైసీపీ కోసం పనిచేయాలని రాజేంద్రనాధ్‌నెడ్డితో కలసి ఎస్పీలపై ఒత్తిడి చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఇక టీడీపీ నేతలపై కేసులు పెట్టిన సీఐడీ చీఫ్ సంజయ్ సైతం బాబు అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించి భంగపడ్డారట. వీరిని రానీయవద్దని సెక్యూరిటీ అధికారులకు చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని తెలుస్తోంది. తాజా పరిణామాలు పరిశీలిస్తే.. పార్టీ నేతలను వేధించిన వారిని విడిచిపెట్టవద్దన్న క్యాడర్ అభీష్టం మేరకే చంద్రబాబు వ్యవహరిస్తున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.