Suryaa.co.in

Political News

అవినాష్ రెడ్డి ఎలా గెలిచాడబ్బా?!

కాంగ్రెస్ అభ్యర్థిగా వై.యస్. షర్మిలా రెడ్డి పోటీ చేసి, వై. యస్. వివేకానందరెడ్డి హత్య కేసును ప్రచారంలో కేంద్ర బిందువుగా చేయడంతో, కడపలో ముక్కోణ పోటీ వాతావరణం నెలకొన్నది. గెలవాల్సిన టిడిపి అభ్యర్థి చదిపిరాళ భూపేష్ సుబ్బరామిరెడ్డి ఓడారు! ఓడిపోవాల్సిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వై.యస్. అవినాష్ రెడ్డి గెలిచారు! ఎలా?

కడప లోక్ సభ పరిధిలో ఏడు శాసన సభ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో ఐదు స్థానాల్లో టీడీపీ పోటీచేసి నాలుగింటిలో విజయం సాధించింది. రెండు స్థానాల్లో పోటీచేసిన బిజెపి ఒక చోట గెలిచింది. ఏడింటిలో పోటీచేసిన వైఎస్ఆర్సీపీ పులివెందుల, బద్వేల్ లో మాత్రమే గెలిచింది.

ఏడు శాసన సభ నియోజకవర్గాల్లో టీడీపీ మరియు బిజెపి, రెండింటికీ కలిపి 6,25,199 ఓట్లు వచ్చాయి. వైఎస్ఆర్సీపీకి 6,00,351 వచ్చాయి. కాంగ్రెస్ పోటీ చేసిన ఆరు స్థానాలు మరియు సీపీఐ పోటీ చేసిన ఒక స్థానం కలిపి వచ్చిన ఓట్లు 57,858.

లోక్ సభ స్థానంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వై.యస్. అవినాష్ రెడ్డికి 6,05,143 ఓట్లు. టిడిపి అభ్యర్థి చదిపిరాళ భూపేష్ సుబ్బరామిరెడ్డికి 5,42,448 ఓట్లు. కాంగ్రెస్ అభ్యర్థి వై.యస్. షర్మిలా రెడ్డికి 1,41,039 ఓట్లు వచ్చాయి.

ఏడు శాసన సభ నియోజకవర్గాల్లో టిడిపి + బిజెపికి వచ్చిన 6,25,199 ఓట్లన్నీ టిడిపి లోక్ సభ అభ్యర్థి చదిపిరాళ భూపేష్ సుబ్బరామిరెడ్డికి పోలై ఉంటే విజయం వరించేది! వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వై.యస్. అవినాష్ రెడ్డి ఓడిపోయేవారే! కానీ, అలా జరగలేదు. టిడిపి లోక్ సభ అభ్యర్థి చదిపిరాళ భూపేష్ సుబ్బరామిరెడ్డికి 5,42,448 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే 82,751 క్రాస్ ఓటింగ్ జరిగినట్లు రూఢీ అవుతున్నది.

ఏడు శాసన సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ + సీపీఐకి కలిపి వచ్చిన ఓట్లు 57,858 + క్రాస్ ఓటింగ్ జరిగిన 82,751 ఓట్లు కలిపితే 1,40,609. కాంగ్రెస్ అభ్యర్థి వై.యస్. షర్మిలా రెడ్డికి వచ్చిన ఓట్లు 1,41,039. ఈ గణాంకాలను బట్టి గెలవాల్సిన చదిపిరాళ భూపేష్ సుబ్బరామిరెడ్డి ఓడారు. ఓటమి పాలుకావాల్సిన వై.యస్. అవినాష్ రెడ్డి గెలిచారు.

– టి. లక్ష్మీనారాయణ
సామాజిక ఉద్యమకారుడు

LEAVE A RESPONSE