Suryaa.co.in

Editorial

బాహు‘బలి’.. బాలినేని!

– నాడు ఆయనే జిల్లాకు ‘ప్రకాశం’
– వైఎస్ జమానాలో ఆయన మాటే వేదం
– జిల్లాలో ఎదురులేని ఇమేజ్
– జగన్ జమానాలో కనిపించని హవా
– పనిచేయని సీట్ల సిఫార్సులు
– జగన్‌తో పనిచేయని బంధుత్వం
– నేడేదీ ఆ ‘ప్రకాశం’?
-బాలినేని సహచరులలో చీలిక తెచ్చిన జగన్ వ్యూహం
– ఒంగోలుకే పరిమితం కావల్సిన దయనీయం
– బాలినేనికి తెలివిగా చెక్ పెట్టిన జగన్
– ప్రకాశంలో ఒంటరిగా మారిన బాలినేని
– బాలినేని ఇమేజీకి భారీ డ్యామేజీ
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఆయన ఆ జిల్లా రాజకీయాల్లో బాహుబలి లాంటివాడు. ఏ పార్టీలో ఉన్నా ఆయన మాట వేదం. చెప్పిందే శాసనం. ఆ జిల్లాలో ఆయన ఉన్న పార్టీలో, ఎవరికి టికెట్ సిఫారసు చేస్తే అది ఇవ్వాల్సిందే. ఆయన వచ్చి ప్రచారం చేస్తేనే అభ్యర్ధులకు కార్యకర్తలు పనిచేస్తారు. కాదని వెళితే సదరు అభ్యర్ధులకు సినిమా కష్టాలు తప్పవు. అధికారులు ఎవరున్నా ఆయన చెప్పిన మాట వినాల్సిందే. చాలామంది నేతల్లా రాబందు కాదు. వీటికిమించి.. అన్ని పార్టీల వారికీ అందరివాడన్న పేరు. జల్సారాయుడన్న మరో పేరూ లేకపోలేదు. జీవితాన్ని సరదాగా గడిపే నేతల్లో ఆయనొకరన్న మరో ప్రచారం.

అన్నింటికీమించి వైఎస్ కుటుంబానికి సన్నిహితుడు. పార్టీ అధిపతికి సమీప బంధువు. ఇన్ని లక్షణాలున్న మాస్ లీడర్, మరి బాహుబలి కాకుండా ఎలా పోతారు? కచ్చితంగా బాహుబలి లాంటివాడే. కానీ అదంతా ఈ వారం పదిరోజుల క్రితం ముచ్చట. ఇప్పుడాయన జగన్ ఆడిన రాజకీయ చదరంగంలో అచ్చమైన బాహు‘బలి’గా మారిన విషాదం. జగన్ రాజకీయంలో బాహు‘బలయిపోయారన్న’ది ఆయన అనుచరుల ఆవేదన. అలాంటి బాహు‘బలి’ ఎవరో కాదు.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి!

ఉమ్మడి ప్రకాశం రాజకీయాల్లో బాలినేని హవాకు ఎదురుండదు. నెల్లూరు-కడప-గుంటూరు జిల్లాల్లో ఆయనకు బోలెడుమంది అనుచరులు. ప్రకాశం జిల్లాలో ఆయన సిఫార్సు చేసిన అభ్యర్ధులే గెలుస్తుంటారు. కాదని సొంతంగా టికెట్ తెచ్చుకుంటే.. ఇప్పుడు మంత్రులు నాగార్జున, ఆదిమూలం సురేష్ మాదిరిగా కష్టాలు పడక తప్పదు. బాలినేని వారి నియోజకవర్గాలు వచ్చి, కార్యకర్తలను పరిచయం చేయించాలని విజయసాయరెడ్డి-సజ్జల ఎప్పటినుంచో కోరుతున్నా, బాలినేని పట్టించుకోవడం లేదు. కారణం అక్కడ ఆ మంత్రులిద్దరికీ, తన మాట కాదని టికెట్లు ఇవ్వడమే.

‘మీరే టికెట్లు ఇచ్చారు కాబట్టి మీరే గెలిపించుకోండి. లేకపోతే జగన్‌ను వచ్చి గెలిపించుకోమనండి. మధ్యలో నాకేంటి సంబంధం’ అన్నది బాలినేని లాజిక్కు. దానితో మంత్రులిద్దరికీ సొంత నియోజకవర్గాల్లోనే సహాయ నిరాకరణ. బాలినేని వస్తే తప్ప అక్కడి కార్యకర్తలు పనిచేయరు. అయినా సరే.. బాలినేని మొండి అయితే జగన్ జగమొండి. బాలినేనిని పక్కనపెట్టి.. జగన్ తాను అనుకున్నదారిలోనే వెళుతున్న పరిస్థితి.

కొన్నేళ్లపాటు ప్రకాశం జిల్లా రాజకీయాలను శాసించిన బాలినేనికి.. ఇప్పుడు ఆయన ప్రమేయం-సిఫార్సు లేకుండానే, పార్టీ అధినేత జగన్ అభ్యర్ధులను ప్రకటించేస్తున్నారు. చివరాఖరకు ఒకదశలో బాలినేనిని కూడా, నియోజకవర్గం మారమని సూచించేంత అవమానం. తనతో ఉన్న శిద్దా రాఘవరావును వేరు చేసి, శిద్దాను ఒంగోలు నుంచి పోటీ చేయమనే జగన్ మాయోపాయం బాలినేనిని బిత్తరపోయేలా చేసింది. తన సహచరుడైన శిద్దా రాఘరరావుకు, దర్శి సీటు ఇవ్వమని చెప్పినా బాలిలేని మాట సాగలేదు.

చివరకు ఎంపి మాగుంటకు తిరిగి టికెటు ఇస్తేనే, తాను పోటీ చేస్తానని బెదిరించడం నుంచి… ‘నా ఒంగోలు అసెంబ్లీ నేను చూసుకుంటా. ఎవరెటుపోతే నాకెందుక’నే, సర్దుబాటు దిశగా రాజీప్రస్థానం సాగుతున్న విషాదం. అంటే తనను నమ్ముకుని-తనతో కలసి నడిచిన వారికి మొండిచేయి చూపి, తానొక్కడే బరిలో దిగుతున్న నాయకుడిగా.. తొలిసారి అప్రతిష్ఠపాలయిన వైనం. పేదలకు భూములు ఇచ్చేందుకు తాను విధించిన షరతు ఒక్కటే, జగన్ దగ్గర బాలినేని నెరవేర్చుకున్నట్లయింది.

ఈ విషయంలో బాలినేని ఇమేజీని, పూర్తిగా డామేజీ చేయడంలో జగన్ సక్సెస్ అయ్యారు. అసలు బాలినేనికి ఉన్నదే… ‘నమ్ముకున్న వారికి-తనతో నడిచిన వారికోసం ఏమైనా చేస్తార’న్న పేరు. ఆ పేరును ఇప్పుడు జగన్ విజయవంతంగా తుడిపేశారన్నట. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో బాలినేని వెంట ఎవరూ లేని ఒంటరి నేత. ఆ రకంగా జిల్లాను గుప్పిట్లో పెట్టుకుని తనను బెదిరిస్తున్న బాలినేనికి, జగన్ ఆరకమైన బహుమతి ఇచ్చారని మెడపై తల ఉన్న ఎవరికైనా అర్ధమవుతుంది. అంటే బాహుబలిగా ఉన్న బాలినేని.. ఇప్పుడు బాహు‘బలయ్యా’రన్నమాట!

చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఒంగోలు ఎంపీ సీటు ఇస్తారని తెలిసినప్పుడు, బాలినేని అగ్గిరాముడయ్యారు. అలిగి హైదరాబాద్ వెళ్లిపోయారు. అది తెలిసి సజ్జల ఆయనను పిలిచి బుజ్జగించారు. జగన్‌తో అపాయింట్‌మెంట్‌కు ప్రయత్నించినా కుదర్లేదు. అలా కొన్నిరోజులు హోటల్‌లోనే గడిపిన బాలినేనికి, తాడేపల్లి ప్యాలెస్ నుంచి కబురొచ్చింది. ఆ సందర్భంగా చెవిరెడ్డికి ఎంపీ సీటు ఇస్తే తాను పనిచేయనని, చెవిరెడ్డికి బదులు తన కుమారుడికి సీటివ్వాలని ఖరాఖండిగా చెప్పేశారు. అందుకు సజ్జల కూడా.. చెవిరెడ్డి సీటివ్వడం లేదని చెప్పడంతో, కారును ఒంగోలు వైపు తిప్పారు.

ఒంగోలుకు వెళ్లిన తర్వాత చావుకబురు చల్లగా వినిపించింది. చెవిరెడ్డికి ఒంగోలు సీటుతోపాటు, మరికొన్ని నియోజకవర్గాలకు ఇన్చార్జిగా నియమిస్తున్నారన్నది దాని సారాంశం. దానితో సజ్జల తనను మోసం చేశారని గ్రహించిన బాలినేని, కడుపుమండి మళ్లీ కారును హైదరాబాద్ వైపు తిప్పారు. మళ్లీ తర్వాత యథావిధిగా చర్చలు-రాయబారాలు. అలకలు-బెదిరింపులు-బుజ్జగింపులు.

సీనంతా సేమ్ టు సేమ్. అయితే ఈసారి తాడేపల్లి ఏం అస్త్రం సంధించిందో తెలియదు గానీ.. బాహుబలి బాలినేని తలొగ్గారు. ఎమ్మెల్యే ఏడుకొండలు సినిమాలో దాసరి నారాయణరావు మాదిరిగా బాలినేని కూడా.. ‘మీ అభిప్రాయమే నా అభిప్రాయం’ అని చెప్పేయాల్సి వచ్చింది.

చివరాఖరకు నేను ఒంగోలు అసెంబ్లీకే పరిమితమవుతానని, సర్దుబాటు ధోరణి వ్యాఖ్యలు చేయాల్సి రావడం.. బాలినేని వంటి రాజకీయ బాహుబలికి విషాదమే. చివరాఖరకు బాలినేనిని నమ్ముకున్న మాగుంట, శిద్దా ఇద్దరూ బలయ్యారన్నమాట.

LEAVE A RESPONSE