Suryaa.co.in

Andhra Pradesh

గోవుల మందకు తోడేలు కాపలా పెట్టినట్లు.. విజయసాయి ఆధ్వర్యంలో బీసీ సభ

– బ్యానర్లపై బీసీ నాయకుల ఫొటోలు లేకుండా రెడ్లతో నింపారు
బీసీలకు పదవులు ఇచ్చామని గొప్పలు చెబుతున్న జగన్ రెడ్డి.. వారి విధులు ఏంటో చెప్పగలరా?
– టీడీపీ నినాదమైన ‘జయహో బీసీ’ కాపీ కొట్టడం సిగ్గుచేటు
– చంద్రబాబు బీసీలను అక్కున చేర్చుకుంటే.. జగన్ రెడ్డి అడుక్కుతినేలా చేశాడు
– మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు

తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. తెలుగుదేశం పాలన అంటేనే బీసీల రాజ్యం. బీసీల రాజ్యాధికారాన్ని నాశనం చేస్తున్న దుర్మార్గులైన ఈ జగన్ రెడ్డి అరాచక పాలనకు చరమ గీతం పాడడాలి. బీసీల బాంధవుడైన నారా చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన అవసరముంది. అందుకోసం ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తా నడుం బిగించాలి. అనుక్షణం శ్రమించాలి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కుదించి బీసీలను దెబ్బతీశారు. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కూడా రూపాయి నిధులివ్వకుండా ఆర్థికంగా ద్రోహం చేశారు. సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లించారు. వైసీపీ ప్రభుత్వం ఒక సామాజికవర్గం చెప్పుచేతుల్లో నడుస్తోంది. కర్నూలులో చంద్రబాబునాయుడు కార్యక్రమాలకు అపూర్వ స్పందన లభించింది. అడుగడుగునా బీసీలు నీరాజనం పలికారు. ఆయన వెంట నడిచారు. జయహో చంద్రన్న అంటూ నినదించారు. నీ వెంట మేమున్నామన్నారు. ఇది బీసీల్లో ఉండే పట్టుదల. టీడీపీ చేపట్టిన మూడు రోజుల చంద్రబాబునాయుడు కార్యక్రమాలకు అనూహ్యమైన, అపురూపమైన ప్రజాస్పందన లభించింది.

జగన్ రెడ్డి తలపెట్టిన జయహో బీసీ పెత్తందారీ సామాజికవర్గం కనుసన్నల్లో జరుగుతోంది. జయహోబీసీ పేరుతో ఒక బూటకపు కార్యక్రమానికి సిద్ధమయ్యారు.

తెలుగుదేశం పార్టీ నినాదాన్ని కాపీ కొట్టడానికి వైసీపీ నేతలు సిగ్గుపడాలి. బీసీల కోసమే సభ అంటున్నప్పటికీ.. బీసీల ఆధ్వర్యంలో సభ జరపడం లేదు. వీళ్లకు బీసీలను ఉద్దరిస్తామని చెప్పుకునే అర్హత ఉందా.? విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో బీసీ సభ జరుపుతూ బీసీలను ఉద్ధరిస్తారంటే నమ్మడానికి ప్రజలు పిచ్చోళ్లు కాదని జగన్ రెడ్డి తెలుసుకోవాలి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు. పార్టీలో రెండవ స్థానం యనమల రామకృష్ణుడు. చంద్రబాబు తీసుకునే ప్రతి సలహా వెనకా ఉండేది బీసీలే. నిర్ణయాధికారాల్లో అసలైన భాగస్వామ్యం కల్పించింది చంద్రబాబు, తెలుగుదేశం పార్టీయే.

అటు ప్రభుత్వంలోను, ఇటు పార్టీలోనూ బీసీలకు అగ్ర తాంబూలం ఇచ్చారు. టీడీపీకి, వైసీపీకి నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. బీసీలను చంద్రబాబునాయుడు అక్కున చేర్చుకుంటే.. జగన్ రెడ్డి అడుక్కుతినేలా చేస్తున్నాడు.

చంద్రబాబు సభలకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తుంటే.. జగన్ రెడ్డి సభలకు డబ్బులు, మద్యం ఏరులై పారించినా ఎవరూ ముందుకు రావడం లేదు. రేపటి విజయవాడ సభ కోసం బలవంతంగా బీసీలను విజయవాడకు పంపుతున్నారు. బస్సుల ముందుర కట్టిన బ్యానర్లపై బీసీ నాయకుల ఫొటోలు లేకుండా రెడ్లతో నింపారు. బీసీలకు పదవులు ఇచ్చామని గొప్పలు చెబుతున్న జగన్ రెడ్డి.. వారి విధులు ఏంటో చెప్పగలరా? జగన్ రెడ్డి ఎన్ని గిమ్మిక్కులు చేసినా బీసీలంతా ఏకమయ్యారు. హక్కుల సాధనకై తిరుగుబాటు చేసే రోజు దగ్గర్లోనే ఉంది.

LEAVE A RESPONSE