Suryaa.co.in

Telangana

పాదయాత్రతో చట్టసభల్లో బి.సి వాటా సాధించాలి

– సామాజిక, ప్రజా సంఘాల పిలుపు

ఉద్యమాల కేంద్రం, త్యాగాలకు పుట్టినిల్లు తెలంగాణ నుండి ప్రారంభమయ్యే బి.సి మహా పాదయాత్రను విజయవంతం చేసి చట్టసభల్లో బి.సి వాటా సాధించాలని ఆల్ ఇండియా ఒబిసి నాయకులు, వివిధ సామాజిక సంఘాల ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చట్టసభల్లో బి సి వాటా సాధనకై మహా పాదయాత్ర విజయవంతం చేయడానికి ఏర్పాటు చేసిన సామాజిక, ప్రజా సంఘాల నాయకుల రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు నాయకులు పాల్గొని పాదయాత్ర గోడ పత్రికలను, కరపత్రాలను విడుదల చేసి మాట్లాడారు.

ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్, తెలంగాణ బి.సి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్, హిందూ బి.సి మహాసభ వ్యవస్థాపక అద్యక్షులు బత్తుల సిద్దేశ్వర్, డాక్టర్ పుంజాల వినయ్ కుమార్, బి.సి చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు రమణ, జాక్ వైస్ చైర్మన్లు వెలుగు వనిత, ఏటిగడ్డ అరుణ పటేల్, పటేల్ వనజ, తెలంగాణ బి.సి జనసభ అద్యక్షులు రాజారాం యాదవ్, తెలంగాణ పెరిక సంఘం రాష్ట్ర అసోసియేట్ అద్యక్షులు సుంకరి ఆనంద్, డాక్టర్ కంటే సాయన్న, బి.సి సేన నాయకులు వాసు కె యాదవ్ తదితర నాయకులు పాల్గొని మాట్లాడారు.

భారతదేశ సమాజహితం కోసం ఎంతో శ్రమ చేస్తున్న బి.సి కులాలకు చరిత్రలో ఈ దేశాన్ని ఏలిన చరిత్ర ఉందని, ప్రజల హక్కుల కోసం, అధికారం కోసం పోరాడిన వీరుల చరిత్ర ఉందని ఆ వీరుల స్పూర్తితో చట్టసభల్లో బి.సి వాటా సాధించడానికి ప్రతి ఒక్క బి.సి ప్రతినబూనాలని పిలుపునిచ్చారు. సకల సామాజిక రంగాల్లో మనమెంతమందిమో మనకంత వాటా దక్కాలంటే చట్టసభల్లో బి.సి వాటాతోనే సాధ్యమవుతుందని అన్నారు. చట్టసభల్లో బి.సి వాటా సాధన కోసం మార్చి 1 న మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం మిరిగోన్ పల్లి మహా వీరుడు పండుగ సాయన్న గ్రామం నుండి మొదలై బి.సి వీరులు కొండా లక్ష్మన్ బాపూజీ, బెల్లి లలితక్క, శ్రీకాంతచారి, మారోజు వీరన్న, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మల గ్రామాల నుండి బి.సి మహా వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గ్రామం ఖిలాశాపూర్ వరకు మార్చి 20 న చేరుకుంటుందని తెలిపారు.

360 కిలోమీటర్ల మేర జరుగు ఈ పాదయాత్రకు ప్రతి గ్రామంలో బి.సి లతో పాటు సామాజిక, ప్రజా సంఘాల వారు, ప్రగతిశీలవాదులు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. మాజీ కేంద్ర మంత్రి, మాజీ గవర్నర్ పుంజాల శివశంకర్ ఏడవ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి ఆయన గొప్పదనం గూర్చి మాట్లాడారు. శివశంకర్ స్పూర్తితో చట్టసభల్లో వాటా సాధిస్తామని నినదించారు.

ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఒబిసి నాయకులు చాపర్తి కుమార్, సింగారపు అరుణ, బుల్లెట్ వెంకన్న, ఏడుకొండలు, చంద్రకళ, రోజా నేత, పర్వత సతీష్ కుమార్, దుబ్బకోటి ఆంజనేయులు, బత్తుల రాంనర్సయ్య, పంతుల మల్లయ్య, ఆది సంజీవ, సద్గుణ, లీలావతి, గిరగాని బిక్షపతి, ఎర్ర శ్రీహరి, పాపాని నాగరాజు, దేశం మహేష్, సుజ్జి, కల్యాణి, అబ్దుల్ రషీద్, నగిరి ప్రవీణ్ కుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE