Suryaa.co.in

Features

మీ కులంలో పుట్టినందుకు గర్వించండి…కానీ అందరం కలిస్తేనే సమాజం అని గుర్తించండి

-కష్టాన్ని నమ్ముకున్నారు… కమతాన్ని నమ్ముకున్నారు
-మట్టిని బంగారంగా మార్చే… రాయచూరు క్యాంపుల్లో వాళ్లే
-ఎందరికో ఉపాధినిచ్చారు…కొందరి అసూయకు లక్ష్యం అయ్యారు
-అక్షయపాత్రగా 100 సంవత్సరాల కమ్మ హాస్టల్

వంద సంవత్సరాల క్రితం…ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగమైన గుంటూరు ప్రాంతం.
ఏదో ఒక చేతి వృత్తి ఉన్నవారు,ఆ వృత్తి ద్వారా జీవనోపాధి పొందుతున్నారు.చెప్పులు కుట్టే వాళ్ళు, బట్టలు నేసే వాళ్ళు, కుండలు చేసేవాళ్లు, బుట్టలు అల్లేవాళ్ళు, వడ్రంగం పని చేసేవాళ్లు, కుమ్మరి,కమ్మరి….. ఇలా అనేక చేతి వృత్తుల ద్వారా….వివిధ సామాజిక వర్గాలు జీవితాలు సాగిస్తున్న రోజుల్లో….

బతకటానికి ఎలాంటి చేతి వృత్తి లేని….కమ్మ, కాపు, రెడ్డి కులాల ప్రజలు బతుకుదెరువు కోసం భూమిని నమ్ముకున్నారు. వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్నారు.

విద్య,ఉద్యోగాలు,రాజకీయ పదవులు, అన్నింటికీ మించి భూమిపై…. దాదాపు కొన్ని శతాబ్దాల పాటు ఆధిపత్యం అనుభవించిన బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ….ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో త్రిపురనేని రామస్వామి చౌదరి, రఘుపతి వెంకటరత్నం నాయుడు, కట్టమంచి రామలింగారెడ్డి మొదలైన కమ్మ, కాపు, రెడ్డి కులాలకు చెందిన విద్యావంతులు…. కేవలం వ్యవసాయం మీద బతుకుతున్న తమ కులాల సమగ్ర అభివృద్ధి కోసం విద్యాభివృద్ధి పై దృష్టి సారించి… విద్య ప్రాధాన్యతను తమ సామాజిక వర్గీయులకు వివరించి, వారి కులాలలో ఆర్థికంగా ముందుకెళ్ళిన వారి సహకారంతో ఆంధ్ర గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని వందల పాఠశాలలు,కళాశాలల స్థాపనకు కారకులయ్యారు.

బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన ఆధునిక విద్యను అందిపుచ్చుకున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాలు… అలా అవకాశం వచ్చిన ప్రతి రంగంలో ముందుకు దూసుకుపోయారు. ఈ విధంగా జరిగిన వంద సంవత్సరాల కృషి ఫలితంగా ….ఈరోజు తెలుగు సమాజంలో ఈ మూడు వ్యవసాయ కులాలు మిగతా వారి కన్నా అన్ని రంగాలలో ముందు వరుసలో ఉన్నారు.

గ్రామీణ ప్రాంతాలలో పాఠశాల విద్యను పూర్తిచేసుకుని గుంటూరు లాంటి పట్టణానికి వచ్చే విద్యార్థుల కోసం….ఆయా సామాజిక వర్గాలలో ధనవంతులైన వారి సహకారంతో సేవా భావంతో ప్రారంభించిన ….ఒక హిందూ కళాశాల( బ్రాహ్మణులు) ఒక టీజేపీఎస్( వైశ్యులు) ఒక జెకెసి కళాశాల( కమ్మ) ఒక రెడ్డి కాలేజ్( రెడ్లు) ఒక ఏసీ కాలేజ్( దళితులు లేదా క్రిస్టియన్స్) ఒక ఆంధ్ర ముస్లిం కాలేజ్( ముస్లింలు) ఒక సర్కుర్మా వెంకటాద్రి నాయుడు కాలేజ్ (కాపు)…….ఇలా అనేక విద్యాసంస్థలు కనిపిస్తాయి. అనేక దశాబ్దాలుగా ఈ విద్యా సంస్థలు కొన్ని లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపాయి.

ఇలాంటి విద్యాసంస్థల్లో….ఒక అద్భుతంగా చెప్పుకోవాల్సింది…. 100 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయబడ్డ….కమ్మ హాస్టల్. కాలేజీ చదువు కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పేద- మధ్యతరగతి కమ్మ విద్యార్థులకు ఈ వసతి గృహం ఒక పెద్ద ఆధారం.

మాచర్ల ప్రాంతం నుంచి కోర్టు పనుల మీద గుంటూరు వచ్చిన శాఖమూరి వెంకట సాంబయ్య గారు…ఒక రాత్రి బస చేయటానికి ఎక్కడా నీడ దొరక్క ….తాను అనుభవించిన ఇబ్బందులను…తన భార్య లక్ష్మీదేవమ్మకు వివరించినప్పుడు….మరుసటి రోజే ఆ మహా సాద్వి గుంటూరు వచ్చి…అరండల్ పేటలో 2400 గజాల స్థలం కొని ….కమ్మ సత్రం ప్రారంభించారు. ఒక సత్రం గా మొదలైన ఆ వసతి కేంద్రం….1923 లో కమ్మ హాస్టల్ గా మారింది.

గత 100 సంవత్సరాలలో లక్షలాది పేద,మధ్యతరగతి కమ్మ కుటుంబాల విద్యాభివృద్ధికి అక్షయపాత్రగా నిలబడింది. అన్నం పెట్టింది… వసతి నిచ్చింది… చదువునిచ్చింది….ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది… భవిష్యత్తుకు భరోసా ఇచ్చింది. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సామాజిక వసతి గృహం మన రాష్ట్రంలో ఇదొక్కటే.

ఎలాంటి చేతి వృత్తి లేకపోవడం… కమ్మ సామాజిక వర్గానికి వరమైంది. ఇతర కులాల వలె ఏదో ఒక చేతి వృత్తి ఉన్నట్లయితే…ఎదుగు బొదుగు లేకుండా అక్కడే ఆగిపోయేవారు. చేతి వృత్తి లేకపోవడం వల్ల …భూమిని నమ్ముకోవడం వల్ల…వ్యవసాయాన్ని జీవనాధారంగా మలుచుకోవడం వల్ల…. ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడికి పరిగెత్తారు…కష్టాన్ని నమ్ముకున్నారు… కమతాన్ని నమ్ముకున్నారు.చాలామంది అనుకున్నట్టు….గుంటూరు, కృష్ణా జిల్లాలోనే కాదు….రాజమండ్రి పరిసరాల్లో బంగారం పండే గోదావరి భూముల్లో వాళ్లే….రాష్ట్రాలు దాటి…మట్టిని బంగారంగా మార్చే… రాయచూరు క్యాంపుల్లో వాళ్లే.

గత 100 సంవత్సరాల చరిత్రను ఒకసారి పరిశీలిస్తే…
చదువుకున్నారు…… ఉద్యోగాలు చేశారు…. వ్యాపారులుగా మారారు….
అమరావతి నుంచి అమెరికా దాకా….ఒక సామాజిక,ఆర్థిక శక్తిగా ఎదిగారు. కొందరికి స్ఫూర్తినిచ్చారు…ఎందరికో ఉపాధినిచ్చారు…కొందరి అసూయకు లక్ష్యం అయ్యారు….రాజకీయంగా పడుతున్నారు, లేస్తున్నారు…పరిగెడుతూనే ఉన్నారు.

చివరిగా….
కమ్మవారికి రెండు మాటలు….
మీరు హైదరాబాద్ నగరం లాంటివారు…ప్రభుత్వాలు మారినా….అభివృద్ధి ఆగదు. ఎందుకంటే. దానిని ఎవరు ఆపలేరు. మీ కులంలో పుట్టినందుకు గర్వించండి…కానీ అందరం కలిస్తేనే సమాజం అని గుర్తించండి.

సర్వేజనా సుఖినోభవంతు

– డాక్టర్ కొలికపూడి శ్రీనివాస రావు

LEAVE A RESPONSE