Suryaa.co.in

Telangana

ఆప్షన్లతో వస్తున్న జీపీవోలకు సర్వీస్ పరమైన అభద్రత వద్దు

– గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణం
– రైతులకు మెరుగైన సేవలు, ఉద్యోగులకు భారీ ఎత్తున పదోన్నతులు
– 10,954 మంది జీపీవోల నియామకంతో రెవెన్యూ సేవలు చేరువైతాయి
– గ్రామ స్థాయిలోనే రెవెన్యూ సేవలు అందించాలనే ప్రభుత్వ సంకల్పంను నెరవేర్చే బాధ్యత జీపీవోలదే
– సంక్షేమ, అభివృద్ధి పథకాల ఫలాలను లబ్ధిదారులకు అందించేందుకు మనందరం పునరంకితం కావాలి
– దేశ చరిత్రలో తొలిసారిగా 33 సెల‌క్ష‌న్ గ్రేడ్ డిప్యూటీ క‌లెక్ట‌ర్ల పోస్టులను సృష్టించాము
– భూభార‌తి చ‌ట్టంలో త‌హ‌శీల్దార్లు, ఆర్డీఓలు, అడిషనల్ కలెక్టర్లకు అధికారాల వికేంద్రీకరణ
– సీఎం రేవంత్ రెడ్డికి, రెవెన్యూ శాఖ మంత్రికి ప్ర‌త్యేక కృతజ్ఞతలు
– ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి

మహాబూబ్ నగర్, జిల్లా : ఆప్షన్ ద్వారా రెవెన్యూ శాఖ లోకి వస్తున్న జీపీవో (గ్రామ పరిపాలన అధికారి)లు సర్వీసుపరమైన అభద్రతకు గురి కావాల్సిన అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణం అవుతుందన్నారు.

గురువారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం జిల్లా కేంద్రంలో జరిగింది. సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి మాట్లాడుతూ ఆప్షన్ల ద్వారా నియామకం అవుతున్న జీపీవోలందరికీ కామన్ సర్వీస్ ఉంటుందన్నారు. అలాగే ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి వచ్చిట్లుగానే ప్రతి జీపీవో కు పదోన్నతులు ఉంటాయన్నారు. ప్రజా ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన భూ భారతి చట్టంతో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు.

రాష్ట్రంలో రైతులకు మెరుగైన సేవలు అందడంతో పాటు, రెవెన్యూ ఉద్యోగులకు భారీ ఎత్తున పదోన్నతులు వస్తున్నాయన్నారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒకరు చొప్పున గ్రామ పరిపాలన అధికారులను నియామకం చేయడం వలన రైతులకు రెవెన్యూ సేవలు చెరువ కావడంతో పాటు రెవెన్యూ శాఖ ఉద్యోగులకు పెద్ద ఎత్తున పదోన్నతులు లభిస్తున్నాయన్నారు. దీంతో క్రమంగా రెవెన్యూ వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు.

అయితే భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు రెవెన్యూ ఉద్యోగులు పునరంకితం కావాలన్నారు. భూ భారతి చట్టంతో రెవెన్యూ శాఖ బలోపేతం కావడంతో పాటు రైతులకు గ్రామ స్థాయిలోనే భూ సమస్యలు పరిష్కారం ఆవుతాయన్నారు. గ్రామ స్థాయిలోనే రెవెన్యూ సేవలు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం 10,954 మంది గ్రామ పాల‌న అధికారులను వ్యక్తిగత ఆప్షన్ల ద్వారా నియామకం చేస్తుందన్నారు. రెవెన్యూ ఉద్యోగుల ఆకాంక్షకు ప్రభుత్వ సహకారం తోడవడంతో రెవెన్యూ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను సాదించుకున్నామన్నారు.

అయితే రాష్ట్రంలో లబ్ధిదారులకు సంక్షేమ, అభివృద్ధి పథకాలను అందించేందుకు రెవెన్యూ ఉద్యోగులు అత్యంత బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. ప్రభుత్వ సహకారంతో దేశ చరిత్రలోనే తొలిసారిగా 33 సెల‌క్ష‌న్ గ్రేడ్ డిప్యూటీ క‌లెక్ట‌ర్ల పోస్టులను సాదించామన్నారు. అలాగే గతంలో ధరణిలో త‌హ‌శీల్దార్లకు, ఆర్డీఓలకు, అడిషనల్ కలెక్టర్లకు అధికారాలు లేని కారణంగా రైతుల సమస్యలు సత్వరం పరిష్కరించే పరిస్థితి లేదన్నారు. కానీ త్వరలోనే అమల్లోకి రాబోతున్న భూ భారతి చట్టంలో త‌హ‌శీల్దార్లకు ఆర్డీఓలకు, అడిషనల్ కలెక్టర్లకు అధికారాల వికేంద్రీకరణ జరిగిందన్నారు.

భూ భారతి చట్టం ద్వారా రాష్ట్ర రాజధానిలోని సీసీఎల్ఏ నుండి గ్రామ పరిపాలన అధికారి వరకు అధికారాల వికేంద్రీకరణ జరగడంతో భూ సమస్యలు సత్వరం పరిష్కారం అవుతాయన్నారు. జీపీవోల వలన రైతులకు గ్రామ స్థాయిలో సేవలు అందడంతో పాటు సత్వర సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అర్హుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందన్నారు. ప్ర‌జా పాల‌న‌లో ప్రభుత్వం ఒకవైపు రెవెన్యూ వ్య‌వ‌స్థ బ‌లోపేతం చేస్తూనే… మరోవైపు రైతులకు, ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలను క్షేత్రస్థాయిలోనే అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు.

నాడు రైతుల‌కు, ప్ర‌జ‌ల‌కు దూరాభారమైన రెవెన్యూ సేవ‌లు త్వరలోనే గ్రామ స్థాయిలోనే అందుతాయ‌న్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో పాటు, రాష్ట్ర మంత్రివర్గం, రెవెన్యూ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ మరియు ప్రభుత్వ పెద్దల, ఉన్నతాధికారుల అందరి సహకారంతో అనతి కాలంలోనే అనేక చారిత్రిక విజయాలను తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో
సొంతం చేసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు కొండంత అండగా నిలిచిన ప్రభుత్వానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్న అన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉందన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని శాఖల ఉద్యోగులకు అండగా నిలుస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో అనేక విజయాలు సాధించి రెట్టించిన ఉత్సాహంతో ప్రభుత్వ ఉద్యోగులు ప్రజా సంక్షేమానికి పునరంకితం కావాలని ఆయన ఆకాంక్షించారు.

LEAVE A RESPONSE