• విజయవాడలో వన్ స్టాప్ సెంటర్ ప్రారంభం
– మహిళా శిశు సంక్షేమం మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
విజయవాడ: మహిళల హక్కుల భద్రత, రక్షణకు మా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత నిస్తుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం మరియు గిరిజన సంక్షేమ శాఖ ల మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి తెలిపారు.. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వన్ స్టాప్ సెంటర్ కొత్త భవనాన్ని గురువారం సాయంత్రం ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ.. వన్ స్టాప్ సెంటర్ లో 11 నుంచి 13 మంది వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. ఈ వన్ స్టాప్ సెంటర్ 24 గంటలపాటు బాధిత మహిళలకు అందుబాటులో ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా నిర్మించే భవనాలకు నిధులు మంజూరు చేస్తామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల రక్షణకు ప్రాముఖ్యతను ఇవ్వడం జరుగుతుందన్నారు.
అందుకోసం ప్రత్యేకమైన చర్యలు చేపడుతున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత నిచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాయన్నారు. మోసగించబడిన మహిళలకి న్యాయపరంగా, కుటుంబపరంగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించేలా వన్ స్టాప్ సెంటర్ ఉపయోగపడుతుందన్నారు. ఒక మహిళగా ఇంట్లో చెప్పుకోలేని విషయాలు ఇక్కడ ఉన్న మహిళా అధికారులకు చెప్పుకోవచ్చన్నారు.
గత ప్రభుత్వం కంటే భిన్నంగా మహిళలకి రక్షణతోపాటు వారికి అందవలిసిన న్యాయం, ఆసుపత్రి సౌకర్యాలు కల్పించి బాధిత మహిళకు వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. దీనికోసం మా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. వారు భద్రంగా ఉన్నామని అనుకున్నప్పడు మాత్రమే వారిని తిరిగి వారి గృహానికి పంపిస్తామన్నారు.
గుంటూరులో శక్తి సదన్ మహిళా వసతి గృహాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. వన్ స్టాప్ సెంటర్ లో మహిళలకు సలహాలు, సూచనలు అందిస్తామన్నారు… వన్ స్టాప్ సెంటర్ మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మహిళల, పిల్లల భద్రత మా ప్రభుత్వానికి అతి ముఖ్యమైన అంశాలన్నారు. 5,600 అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలకు, బాలింతలకు, చిన్న పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో 960 మంది సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. బాధిత మహిళలు వన్ స్టాప్ సెంటర్ కు వచ్చి రక్షణ పొందవచ్చని వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాలతో మహిళల మీద వేధింపులు, దాడులు ఏం జరిగినా వారికి పూర్తి రక్షణ కోసం ప్రభుత్వం పరంగా వన్ స్టాప్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇక్కడ మహిళా పోలీసులు 24 గంటలు అందుబాటులో ఉంటూ, వైద్యపరంగా, న్యాయపరంగా రక్షణ కల్పిస్తూ సలహాలు సూచనలు అందిస్తారన్నారు.
కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ. సూర్యకుమారి, డైరెక్టర్ ఎం. వేణుగోపాల రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ దాసరి శ్రీలక్ష్మి, డీసీపీ (అడ్మిన్) సరిత తదితరులు పాల్గొన్నారు.