Suryaa.co.in

Features

న్యూమరాలజిస్ట్‌లతో, అస్ట్రాలజిస్ట్‌లతో జాగ్రత్త.. జాగ్రత్త

అజ్ఞానం, వక్రత

కొందరు న్యూమరాలజిస్ట్‌లు, అస్ట్రాలజిస్ట్‌లు యూట్యూబ్ చానళ్లలోనూ, టీ.వీ. చానళ్లల్లోనూ వెలిబుచ్చుతున్న అజ్ఞానం, వక్రత, చెబుతున్న చెత్త సమాజానికి, సగటు మనిషికి పెనుహానికరమైనవి. ఇటీవల ఉగాది సందర్భంలో గోచార ఫలితాలు అన్న విదూషకత్వంపై నేను ఏప్రల్ 1న వాట్స్ఆప్, ఫేస్‌బుక్ పోస్ట్‌ల ద్వారా ఆలోచనను, అవగాహనను ఇచ్చే ప్రయత్నం చేశాను.

శాస్త్రీయత లేని పేలాపనలు

న్యూమరాలజి, అస్ట్రాలజి పరంగా యూట్యూబ్, టీ.వీ. చానళ్లలో మనం వింటున్నవి దాదాపుగా ‘చదువు, విజ్ఞత, శాస్త్రీయత లేని పేలాపనలు’. అంతేకాదు మన జీవితాలను దెబ్బకొట్టేవి కూడా!
జ్యోతిషం పరంగా సరైన, లోతైన, శాస్త్రీయమైన చదువు, తెలివిడి, తెలివి లేని జోతిష్కులు బాధ్యతా రాహిత్యంతోనూ, అవగాహనా రాహిత్యంతోనూ ఏమిటేమిటో చెబుతూండడం గర్హనీయం; అంతేకాదు ప్రజలకు హానికరం.

చెలగాటం

జ్యోతిషం అన్నది ఒక సాగరం. మిడిమిడి జ్ఞానంతో ఏదో పేలాపన చేస్తూ కొందరు సామాన్యుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. వీళ్ల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. జ్యోతిషం విషయంలో సరైన, సమగ్రమైన చదువు, అనుభవజ్ఞానం, అవగాహన అవసరం.

విద్య

బృహజ్జాతకం, సారావళి, కేరళీయం, జాతకపారిజాతం, జైమినిసూత్రాలు, జ్యోతిష గ్రహ చింతామణి, జాతకాలంకారం, భావార్థ చంద్రిక వంటివి తెలియజేస్తున్న ఉన్నతస్థాయి, కాలదోషం పట్టని జ్యోతిష విద్య ఉంది. ఆ విద్య లేకపోవడమే కాదు, జ్యోతిషం అన్న పదానికి కూడా సరైన అర్థం తెలియని స్థితిలో (అందరూ కాదు) కొందరు జ్యోతిష్కులం అని ప్రకటించుకుంటూ చానళ్ల ద్వారా సమాజానికి కీడు చేస్తున్నారు.

న్యూమరాలజిస్ట్‌లు

చానళ్లలో paid programmes ద్వారా న్యూమరాలజిస్ట్‌లు అనబడుతున్నవాళ్లు విషయ జ్ఞానం లేక సగటు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఆ న్యూమరాలజిస్ట్‌లకు న్యూమరాలజికి ఆధారంగా తీసుకోబడుతున్న కాలండర్ గురించి కూడా చదువు, తెలివిడి ఉన్నట్టు లేదు. ఇక వాళ్ల ఇంగ్లిష్ జ్ఞానం కూడా విదూషకత్వమే. Etymology అంటే ఏమిటి అన్న మౌలికమైన చదువు కూడా లేకుండా వికృతంగా పేర్లు, spellingsను సూచిస్తూంటారు. ఆ తప్పుడుతనాన్ని వాళ్లు “కరెక్షన్స్” అని అంటూంటారు.

సార్థకత లేదు

న్యూమరాలజికి ప్రాతిపదికగా తీసుకోబడుతున్న ‘కాలండర్ తారీఖులకు, నెలలకు, సంవత్సరాలకు astronomical, astrologiacal, physical సార్థకత (meaningfulness, significance) లేనేలేదు’. ఈ కాలండర్ ఒక civil calender మాత్రమే. ఈ కాలండర్‌కు ఏ ప్రాతిపదికా లేదు. అలాంటి ఈ కాలండర్ తారీఖుల సంఖ్యల ఆధారంగా గ్రహాలు అనడం బుద్ధి, చదువు లేకపోవడమే. ‘గ్రహాలకు సంఖ్యలు కాని సంఖ్యలకు గ్రహాలు కాదు’; ఇది తెలివిడి.

ఇటువంటి మౌలికమైన తెలివిడి, చదువు కూడా లేకుండా న్యూమరాలజిస్ట్‌లు అనబడుతున్నవాళ్లు సమాజంలో ఆగం చేస్తున్నారు. న్యూమరాలజి కూడా జ్యోతిషంలాగా ఒక సాగరమే. న్యూమరాలజి అన్నది భాష, ఖగోళం, రోజుల నిర్మాణం, గ్రహాలు, గ్రహ గమనాలు వంటి పలు అంశాల సమాహారం. ఆ అంశాల ‘జ్ఞానం’ లేని paid programmల న్యూమరాలజిస్ట్‌లవల్ల ఏ మేలూ జరగదు.

హాని

సరైన డాక్టర్, సరైన ఆడిటర్, సరైన లాయర్, సరైన ఎలక్ట్రీషన్, సరైన డ్రైవర్ కాని వాళ్లవల్ల ఎంత హాని జరుగుతుందో సరైన జ్యోతిష్కులు, సరైన న్యూమరాలజిస్ట్‌లు కాని వాళ్లవల్ల కూడా మనకు అంతే హాని జరుగుతుంది.

జ్యోతిష్కులు, న్యూమరాలజిస్ట్‌లు విషయంలో

జ్యోతిషం పట్ల, న్యూమరాలజి పట్ల నమ్మకం ఉన్నవాళ్లు, వాటిని కావాలనుకున్నవాళ్లు జ్యోతిష్కుల విషయంలో, న్యూమరాలజిస్ట్‌ల విషయంలో జాగ్రత్తతో వ్యవహరించాలి. ‘న్యూమరాలజికి సరైన ప్రాతిపదికలు ఉన్నాయి; అస్ట్రాలజికి సరైన శాస్త్ర విద్య, అనుభవ జ్ఞానం ఉన్నాయి’. ఆ “చదువు ఉన్న’ సరైన, మేలైన జ్యోతిష్కులను, న్యూమరాలజిస్ట్‌లను ఎంచుకోవాలి; వారివల్ల ప్రయోజనాన్ని పొందాలి.

మౌలికమైన విషయాలు కూడా తెలియని, సరైన తెలివి, తెలివిడి లేని, శాస్త్రజ్ఞానం లేని, అనుభవ జ్ఞానం లేని జ్యోతిష్కుల(?), న్యూమరాలజిస్ట్‌ల(?) పేలాపనలకు, అజ్ఞానానికి, అతి-తెలివికి, ధూర్తత్వానికి ఎవరూ బలి కాకూడదు.

తథాస్తు; తథాస్తు; తథాస్తు.

శుభం భూయాత్

– రోచిష్మాన్
9444012279

LEAVE A RESPONSE