Suryaa.co.in

Telangana

రాహుల్ గాంధీ గారి ఉద్యమానికి భట్టి మద్దతు

– పాతర్ల పాడు గ్రామంలో గ్యాస్ ధరల పెంపుపై నిరసన
– రాహుల్ గాంధీ పోరాటానికి అండగా ఉంటామని వెల్లడి

కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ ఏఐసిసి అధినేత రాహుల్ గాంధీ ఈరోజు ఢిల్లీలో చేపట్టిన నిరసనకు మద్దతుగా గురువారం ఉదయం ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్ల పాడు గ్రామంలో జిల్లా మహిళా కాంగ్రెస్, జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ దేశం అభవృద్ధి చేస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం ప్రజల నడ్డివిరిచే విధంగా వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిందని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరల నియంత్రణ చట్టాన్ని కార్పొరేట్ శక్తుల కోసం మోడీ ప్రభుత్వం రద్దు చేసి, తీసుకొచ్చిన కొత్త చట్టాల వల్ల కార్పొరేట్ శక్తులు నిత్యావసర వస్తువులను గోదాముల్లో దాచి కృత్రిమ కొరత సృష్టించి విపరీతంగా ధరలు పెంచి ప్రజలను దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. మోడీ సర్కార్ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీకి ఈ దేశ ప్రజలు అండగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా గ్యాస్ సిలిండర్ లకు దండలు వేసి మహిళా కాంగ్రెస్ నాయకులు ప్లేట్ల పైన శబ్దం చేస్తూ చావు డప్పు వాయించారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సౌజన్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ అనుబంధ ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

LEAVE A RESPONSE