Home » బీజేపీ యాడ్ వైసీపీ పత్రికలోనా.. హవ్వ!

బీజేపీ యాడ్ వైసీపీ పత్రికలోనా.. హవ్వ!

– సాక్షికి ఎలక్షన్ యాడ్ ఇచ్చిన బీజేపీ
– ఖంగుతిన్న కూటమి
– వైసీపీ సర్కారుపై ఈసీకి కూటమి ఫిర్యాదులు
– వైసీపీపై బీజేపీ నేతల ఆరోపణల వర్షం
– అయినా వైసీపీ పత్రికకు బీజేపీ ప్రకటనలపై విస్మయం
– ఇప్పటివరకూ బీజేపీతోపాటు మోదీ, నద్దాను విమర్శించని వైసీపీ
– చంద్రబాబునాయుడు, పవన్‌పై విమర్శలకే పరిమితం
– మరి కూటమిలో టీడీపీ-జనసేన లేవా?
– బీజేపీ మినహా విమర్శలపై అనుమానాలు
– ఇంతకూ బీజేపీకి వైసీపీ మిత్రపక్షమా? శత్రుపక్షమా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

శోభనం మినహా కన్యాదానం అన్నది అప్పట్లో వినిపించే సామెత. ఇప్పుడు ఏపీలో కూటమి పరిస్థితి.. ఆ కూటమి ఎదుర్కొనే అధికార వైసీపీ- కూటమిలో ఉన్న పెద్ద పార్టీ బీజేపీ, డ్యూయల్ లవ్ యవ్వారం అలాగే కనిపిస్తోంది. ఎన్డీయే కూటమిలో టీడీపీ-జనసేన-బీజేపీ భాగస్వాములు. అందులో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు.

అయితే విచిత్రంగా.. ఇప్పటిదాకా వైసీపీ అధినేత-సీఎం జగన్ నుంచి మంత్రులు, వైసీపీ నేతల వరకూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నద్దాను గానీ, ప్రధాని మోదీని గానీ పల్తెత్తు మాట అన్న దాఖలాలు లేవు. కానీ విచిత్రంగా అదే జగన్.. అదే సజ్జల.. అదే అంబటి.. అదే విజయసాయి మాత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన దళపతి పవన్ కల్యాణ్‌ను మాత్రం ప్రతిరోజూ దుమ్మెత్తిపోస్తున్నారు. వారి ప్రసంగాలపై ఈసీకి సైతం ఫిర్యాదు చేస్తున్నారు. ఇదేం అనుబంధమో ఈ వ్యవహారం చూస్తున్న వారికెవరికీ అంతుబట్టని మతలబు.

అటు బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా విడిగా.. టీడీపీ-జనసేనతో ‘కలివిడి’గా వైసీపీ సర్కారుపై ఈసీకి ఫిర్యాదు చేస్తోంది. జగన్‌పై బీజేపీ అభ్యర్ధులు తమ ప్రచారాల్లో దునుమాడుతున్నారు. జగన్ వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని, అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం బీజేపీని సంస్థాగతంగా కాకుండా.. బీజేపీ రాష్ట్ర నేతలపై వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని విమర్శలు కురిపిస్తున్నారు.

తాజాగా సీఎం జగన్… జనసేన దళపతి పవన్‌పై మరోసారి వ్యక్తిగత విమర్శలు చేశారు. ఆయన వివాహంతోపాటు, నియోజకవర్గాలు కూడా మారుస్తున్నారని కించపరుస్తూ మాట్లాడారు. దానిని బీజేపీ నేతలు ఇప్పటివరకూ ఖండించిన దాఖలాలు లేవు. పైగా పవన్‌ను వ్యక్తిత్వ హననానికి గురిచేసిన వైసీపీ అధికార మీడియాకే, బీజేపీ ప్రకటనలివ్వడం అటు జనసైనికులకూ ఆగ్రహం తెప్పించింది.

నిజానికి జనసేన దళపతి పవన్.. కూటమి కోసం అవిరళ కృషి చేశారు. చివరకు తనకు కేటాయించిన ఒక ఎంపీ, మూడు అసెంబ్లీ సీట్లను కూడా బీజేపీకి త్యాగం చేశారు. అలాంటి పవన్ త్యాగాన్ని సైతం బీజేపీ నాయకత్వం పెద్దగా పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించడం లేదు.
దానికి కారణం బీజేపీ.. రాష్ట్రంలో టీడీపీ-జనసేనకు ఉమ్మడి ప్రత్యర్ధి అయిన వైసీపీ మీడియా సాక్షికి ప్రకటన ఇవ్వడమే. గురువారం నాటి సాక్షి పత్రిక మొదటి పేజీలో, బీజేపీ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ప్రకటన ఇవ్వడం కూటమిని ఖంగుతినిపించింది.

ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా కూటమిలోని టీడీపీ-జనసేన పోరాడుతున్నాయన్న విషయం, బీజేపీ నాయకత్వానికి తెలియదనుకుంటే పొరపాటు. టీడీపీ ఎన్డీయేలో చేరిందని ప్రకటించింది కూడా బీజేపీ నాయకత్వమన్నది విస్మరించకూడదు. పైగా ఏ వైసీపీ అధికార సాక్షి మీడియాకు బీజేపీ ప్రకటన ఇచ్చిందో.. అదే వైసీపీ సర్కారుకు వ్యతిరేకంగా ఈసీకి ఫిర్యాదులిస్తున్న పార్టీల్లో, బీజేపీ కూడా ఉందన్న స్పృహ బీజేపీ నాయకత్వానికి లేకపోవడమే వింత.

సరే ఒకవేళ.. ఏదైనా ప్రైవేటు ఏజెన్సీ ద్వారా, ప్రకటనలు ఇచ్చారనుకున్నప్పటికీ.. ఏయే రాష్ట్రాల్లో ఏయే పత్రికలకు ప్రకటనలివ్వాలని, బీజేపీ నాయకత్వం స్పష్టమైన సూచనలు చేస్తుంది. ఆ ప్రకారంగా ఏపీలో వైసీపీ అధికార మీడియాకు ప్రకటన ఇవ్వకూడదని బీజేపీ నాయకత్వం కచ్చితంగా సూచించి తీరాలి. ఆ పనిచేయలేదంటే… బీజేపీ-వైసీపీ మధ్య తెరచాటు బంధం ఇంకా కొనసాగుతోందన్నది, మెడపై తల ఉన్న ఎవరికైనా అర్ధమవుతుంది. ఇదీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. అంటే వైసీపీ-బీజేపీకి ఎప్పుడో పెళ్లయింది గానీ, ఇంకా శోభనమే జరగలేదని అర్ధం చేసుకోవాలన్నది రాజకీయ విశ్లేషకుల వ్యంగ్యాస్త్రం.

ఆ ప్రకారంగా.. ఏపీలో కూటమిలో భాగస్వామి అయిన బీజేపీ, టీడీపీ-జనసేనతో కలసి, వైసీపీ సర్కారుపై ఈసీకి రొటీన్‌గా ఫిర్యాదులిస్తుంటుంది. అది రాష్ట్ర పార్టీ నేతల విధి. కానీ బీజేపీ జాతీయ నాయకత్వం మాత్రం, వైసీపీతో ఇలా తెరచాటు బంధం కొనసాగిస్తుంది. అది జాతీయ కోణంలో జరిగే సర్దుబాటు. బహుశా.. బీజేపీ జాతీయ నాయకత్వం, ఏపీలోని తన పార్టీ శ్రే ణులకు పంపించే సందేశం ఇదేనేమో?! ఒక్కముక్కలో చెప్పాలంటే… ‘‘పైన మేమిద్దరం బాగుంటాం. కింద మీరూ మీరూ కొట్టుకుచావండి’ అని సింపుల్‌గా చెప్పడమే మరి!

గతంలో కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, సరిగ్గా ఇలాంటి సర్దుబాటే జరిగింది. ‘‘మీరు రాష్ట్రంలో జగన్ ప్రభుత్వంపై ఒక రాజకీయ పార్టీగా పోరాడండి. మేం పార్లమెంటులో ఫ్లోర్ కోఆర్డినేషన్ కోసం వైసీపీతో కలసి ఉంటాం. మీ పని మీరు చేయండి. మా పని మేం చేస్తాం. మిమ్మల్ని పోరాటం చేయవద్దని మేం చెప్పలేదు కదా’’అని చావుకబురు చల్లగా, అతి లౌక్యంగా చెప్పారట. అధ్యక్షులు మారినా.. ఏపీ బీజేపీలో అప్పుడూ, ఇప్పుడూ అదే పరిస్థితి అన్నది బీజేపీ సీనియర్ల ఉవాచ. నిజం నరేంద్రుడికెరుక?

Leave a Reply