– కాంగ్రెస్ పార్టీని ఆదరించండి… భారీ మెజార్టీతో గెలిపించండి
– జూబ్లీహిల్స్ ఓటర్లకు మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి
హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న ఈ ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
గురువారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, సీహెచ్ విజయ రమణ రావు,ఇతర ముఖ్య నాయకులతో కలిసి ఎల్లారెడ్డిగూడ ప్రాంతంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. గడిచిన రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, “రైజింగ్ తెలంగాణ” కోసం భవిష్యత్తు ప్రణాళికలను ప్రజలకు వివరించారు. ప్రతిపక్షాలు పనిగట్టుకొని కావాలని చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలే అజెండాగా పని చేస్తున్న ఈ ప్రజా ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి స్థానికంగా పాల్గొననున్న “కార్నర్ మీటింగ్” ఏర్పాట్లపై స్థానిక నాయకులతో కలిసి సమీక్షించారు. పార్టీ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రతి వ్యూహాలపై కేడర్ కు దిశా నిర్దేశం చేశారు.