– బీజేపీ-బీఆర్‌ఎస్ ఇద్దరిదీ అదే దారి
– ఒకరు రాష్ట్రాల్లో, మరొకరు తెలంగాణలో
– టీడీపీ శాసనసభాపక్షాన్ని విలీనం చేయించిన టీఆర్‌ఎస్
– తెలంగాణ చరిత్రలో కారెక్కిన వారే ఎక్కువ
– ఫిరాయించిన వారిలో టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ, సీపీఐ ఎమ్మెల్యేలు
– 11 రాష్ట్రాల్లో ఫిరాయింపులను ప్రోత్సహించిన బీజేపీ
– బీజేపీలో చేరితే రాజీనామా చేయాలన్న కిషన్‌రెడ్డి
– రాజ్యసభలో టీడీపీని బీజేపీలో విలీనం చేయించిన కమలం
– అయినా ఎవరూ రాజీనామా చేయని వైనం
– గుజరాత్, సిక్కిం, గోవా విపక్ష ఎమ్మెల్యేలను విలీనం చేసుకున్న బీజేపీ
– ఫిరాయింపులపై కాంగ్రెస్ సోషల్ మీడియా కొత్త ప్రచారం
– బీజేపీ-బీఆర్‌ఎస్‌కు ఫిరాయింపులపై మాట్లాడే అర్హత లేదంటూ కాంగ్రెస్ ప్రచారం
– కాంగ్రెస్ ప్రచారంతో బీజేపీ-బీఆర్‌ఎస్ ఉక్కిరిబిక్కిరి
( మార్తి సుబ్రహ్మణ్యం)
వంద ఎలుకలు తిన్న పిల్లి హజ్ యాత్రకు వెళ్లిందిట. ఫిరాయింపులకు సంబంధించి, ఇప్పుడు ఈ సామెత బీజేపీ-బీఆర్‌ఎస్‌కు పితలాటకంగా మారింది. మునుగోడు ఉప ఎన్నిక పుణ్యమా అని బీజేపీ-బీజేపీ ఫిరాయింపు రాజకీయాలు చర్చనీయాంశమవుతున్నాయి. దానిని సద్వినియోగం చేసుకునేందుకు, కాంగ్రెస్ పార్టీ సోషల్‌మీడియాను ఎంచుకుంది. దేశవ్యాప్తంగా బీజేపీ, తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రోత్సహించిన ఫిరాయింపు రాజకీయాలను, కాంగ్రెస్ అస్త్రంగా ఎంచుకుంది. ఆ మేరకు బీజేపీ-బీఆర్‌ఎస్ చేసిన ఫిరాయింపు రాజకీయాలను, సోషల్‌మీడియా వేదికగా చర్చనీయాంశంగా మారుస్తోంది. దీనితో బీజేపీ-బీఆర్‌ఎస్ ఫిరాయింపు రాజకీయాలపై చేసుకుంటున్న.. పరస్పర ఆరోపణల్లో, పస లేదన్న భావన ఏర్పడుతోంది. అయితే ఇది ఉప ఎన్నికపై ప్రభావితం చూపుతుందా లేదా? అన్నది పక్కకుపెడి తే.. రెండు పార్టీలకూ ఫిరాయింపులపై, మాట్లాడే అర్హత లేదన్న అభిప్రాయం ఏర్పడేందుకు కారణమవుతోంది.
తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్.. టీడీపీ, సీపీఐ, వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించింది. టీడీఎల్‌పీ నేతగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీడీపీ శాసనసభాపక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నట్లు స్పీకర్‌కు లేఖ రాశారు. అప్పటికి ఇంకా టీడీపీలో కొందరు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినా సరే, టీడీపీ శాసనసభాపక్షం టీఆర్‌ఎస్‌లో విలీనమయింది. దీనిని ఇప్పుడు కాంగ్రెస్ సోషల్‌మీడియా ద్వారా, చర్చనీయాంశంగా మార్చింది.
రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్.. తనకు తగినంత సంఖ్యాబలం ఉన్నప్పటికీ.. మరోసారి కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకుంది. విశేషమేమిటంటే.. రెండుసార్లు పార్టీ మారిన వారెవరూ, తమ పదవులకు రాజీనామా చేయకపోవడం! టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన తలసాని శ్రీనివాసయాదవ్‌కు, మంత్రి పదవి ఇవ్వడం అప్పట్లో పెను వివాదంగా మారింది. గవర్నర్ నరసింహన్ నిర్ణయాన్ని టీడీపీ అప్పట్లో ప్రశ్నించింది.
తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, తన పదవికి రాజీనామా చేసి బీజేపీ మునుగోడు అభ్యర్ధిగా బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా పార్టీ ఫిరాయించిన కోమటిరెడ్డిని, టీఆర్‌ఎస్ లక్ష్యంగా చేసుకుంది. కే వలం కాంట్రాక్టుల కోసమే ఆయన, బీజేపీలో చేరారంటూ బీఆర్‌ఎస్‌గా మారిన టీఆర్‌ఎస్ ఆరోపణలు చేస్తోంది.
ఉప ఎన్నిక ప్రచారం రసవత్తరంగా జరుగుతున్న సమయంలో..నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు, బీజేపీ రంగంలోకి దిగడం వివాదంగా మారింది. బీజేపీ నాయకత్వం అనైతిక రాజకీయాలకు పాల్పడుతోందంటూ, బీఆర్‌ఎస్ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నిప్పురవ్వలని, అమ్ముడుపోరంటూ ఎదురుదాడి చేస్తోంది. ఇది జాతీయ స్థాయిలో రచ్చగా మారింది. అయితే.. ఫాంహౌస్‌కు వచ్చిన నలుగురు ఎమ్మెల్యేలలో ఒక్కరు తప్ప, మిగిలిన వారంతా కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన వారేనని, బీజేపీ ప్రతిదాడి ప్రారంభించింది. దమ్ముంటే పార్టీ మారి.. టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, తిరిగి పోటీ చేయాలని బీజేపీ సవాల్ చేసింది. ‘‘అయినా పార్టీ మారడంలో తప్పేమిటి? అవి రాజకీయాల్లో సహజంమంటూ’’ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్య, బీజేపీ విధానాలను బట్టబయలు చేసింది.
అయితే పార్టీ మారిన వారు తమ పదవులకు రాజీనామా చేసి, బీజేపీలో చేరాలన్న కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై, సోషల్‌మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ ఎంపీలు సుజానా చౌదరి, టిజి వెంకటేష్, గరికపాటి మోహన్‌రావు, సీఎం రమేష్ తమ పదవులకు రాజీనామా చేయకుండానే.. బీజేపీలో చేరిన విషయాన్ని, కాంగ్రెస్ సోషల్‌మీడియా ఇప్పుడు చర్చనీయాంశంగా మార్చింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీలు ఉండగనే, రాజ్యసభపక్ష పార్టీని బీజేపీలో విలీనం చేయించిన బీజేపీ నైతిక విలువలు, కామెడీ గా ఉన్నాయంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది.
ఇక బీజేపీ 11 రాష్ట్రాల్లో ప్రోత్సహించిన ఫిరాయింపు రాజకీయాలను, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చర్చనీయాంశంగా మార్చడం ఆసక్తి కలిగిస్తోంది. గుజరాత్‌లో 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సిక్కింలో 13 మంది ఎమ్మెల్యేలు, గోవాలో 8 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్న బీజేపీ.. వారితో ఎందుకు రాజీనామా చేయించలేదన్న ప్రశ్నలతో కాంగ్రెస్ పార్టీ, బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 11 రాష్ట్రాల్లో బలం లేకపోయినా ప్రభుత్వాలను కూల్చిన బీజేపీకి, పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత ఉందా అంటూ.. బీఆర్‌ఎస్ ఎదురుదాడి చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా ‘సౌ చుహ ఖానే కే బాద్ బిల్లీ హజ్ కో నిక్లే’ అంటూ, కాంగ్రెస్ చేస్తున్న ఎదురుదాడి అటు బీజేపీ-ఇటు బీఆర్‌ఎస్‌కు నైతిక సంకటంగా పరిణమించింది. ఈ ప్రచారం ఉప ఎన్నికలో ఎంతవరకూ పనిచేస్తుందో చూడాలి.