– బుడమేరుకు గేట్లు నువ్వు-మీ తండ్రి కట్టారా జగన్?
– మహిళా మంత్రికి ఉన్న చిత్తశుద్ధి కూడా లేదా?
– హోంమంత్రి అనిత పాటి శ్రద్ధ కూడా లేని జగన్
– ఈ విజిటింగ్ ప్రొఫెసర్ మాకెందుకు?
-వరదలోనూ బురద రాజకీయమేనా?
– టీడీపీ మహిళా నేత అన్నాబత్తుని జయలక్ష్మి ఫైర్
గుంటూరు: తండ్రి అధికారం అడ్డుపెట్టుకోవడంతోపాటు, ఐదేళ్లు సీఎంగా ఉండి అడ్డగోలుగా సంపాదించిన లక్షకోట్ల ఆస్తిపరుడు జగన్ వరద బాధితులకు వందకోట్లు ఇవ్వలేరా? సీఎం రిలీఫ్ ఫండ్‌కు కనీసం వందకోట్లు ఇచ్చే పెద్ద మనసుకూడా లేదా? పోగేసుకోవడమే తప్ప, పంచిపెట్టే గుణం లేదా? అని వైసీపీ అధినేత జగన్‌పై, గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి ప్రశ్నల వర్షం కురిపించారు.
సర్వం కోల్పోయిన విజయవాడ ప్రజలకు మనోస్థైర్యం కలిగిస్తూ సీఎం చంద్రబాబు, 74 ఏళ్ల వయసులో కూడా తెల్లవారే వరకూ నీళ్లలో తిరుగుతున్నారని గుర్తు చేశారు. కానీ యువకుడైన జగన్ మాత్రం బెంగళూరులో విలాసవంతమైన జీవితం గడుపుతూ, విజిటింగ్ ప్రొఫెసర్ మాదిరిగా అప్పుడప్పుడూ రాష్ట్రానికి వస్తున్నారని విమర్శించారు. ఒకరోజు విజయవాడకు వచ్చిన జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం దారుణమన్నారు. ఇలాంటి కళ్లుండీ చూడలేని కబోది విజటింగ్ ప్రొఫెసర్ ఈ రాష్ట్రానికి అవసరమా? అని ప్రశ్నించారు.
భారీ వర్షాల్లో సైతం మహిళా హోంమంత్రి వంగలపూడి అనిత బాధితుల కోసం అహర్నిశలు కష్టపడుతుంటే, జగన్ మాత్రం కష్టాల్లో ఉన్నవారిపై రాళ్లు వేసి బాధితుల ఆత్మస్థైర్యం దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. బుడమేరుకు గేట్లున్నాయని చెప్పిన జగన్ వ్యాఖ్యలు చూస్తే, ఇంత అజ్ఞాని ఈ రాష్ట్రానికి ఐదేళ్లుగా సీఎంగా ఉండటం ప్రజల దౌర్భాగ్యమని అర్ధమవుతోందన్నారు.
బుడమేరులో నువ్వుగానీ, మీ నాన్న గానీ గేట్లు పెట్టారా జగన్? అని ప్రశ్నించారు. జనం కష్టాల్లో ఉంటే పాలకుడు ఎలా పనిచేస్తారో చంద్రబాబును చూసి నేర్చుకోవాలని జయలక్ష్మి హితవు పలికారు.