– లోకేష్ కంటున్న కలలు కలలుగానే మిగులుతాయి.
– జగన్ మళ్లీ రాడు… ఆయన అడిగింది ఒక్క ఛాన్సే!
– కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతామోహన్
గుంటూరు : సుప్రీం కోర్ట్ జడ్జీల పోస్టుల్లో వర్గీకరణ కావాలి. లక్షల కోట్లు బ్యాంకుల అప్పుల్లో వర్గీకరణ కావాలి. సీఆర్‌డీఏ కాంట్రాక్టుల్లో వర్గీకరణ కావాలి. 33 మంది సుప్రీంకోర్టు జడ్జీలుంటే, ఒకే సామాజిక వర్గం (బ్రాహ్మణులు) 20 మంది సుప్రీంకోర్టు జడ్జీలుగా ఉన్నారు. అమరావతి కోర్టులో ఎంత మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ జడ్జీలున్నారు? బ్యాంకులను జాతీయం చేసింది కాంగ్రెస్ పార్టీ, ఇందిరా గాంధీ. కానీ నేడు బ్యాంకులు ఇస్తున్న అప్పుల్లో ఎస్సీలకు, ఎస్టీలకు, వోబీసీలకు ఇస్తున్న అప్పులు 1 శాతం. మిగిలిన 99 శాతం బ్యాంకు అప్పులు ఎవరికిస్తున్నారు? అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతామోహన్ ప్రశ్నించారు.
ఈ మేరకు ఆయన శుక్రవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. ఒకాయనకు 45 వేల కోట్లు రూపాయలు అప్పులిచ్చాయి. కానీ ఆ వ్యక్తికి మోడీ సాయం చేసి, 40 వేల కోట్లు రూపాయలు అప్పులు మాఫీ చేయించాడు. పవర్ ప్రాజెక్టు పేరుతో మళ్లీ ఇంకో 10 వేల కోట్లు రూపాయలు అప్పు కావాలని అడుగుతున్నాడు అని విమర్శించారు. చింతామోహన్ ఇంకా ఏమన్నారంటే, సీఆర్డీఏ కాంట్రాక్ట్ పనుల్లో ఎంతమందికి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇచ్చారు? ఇక్కడ కావాలి వర్గీకరణ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు దళిత విభజనే కారణం. దళిత విభజన జోలికిపోతే చంద్రబాబు నష్టపోతాడు. లోకేష్ కంటున్న కలలు కలలుగానే మిగులుతాయి.
తెలంగాణలో 100లో, 90 మంది మాదిగలున్నారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో వందలో 90 మంది మాలలు ఉన్నారు. నేను మాల, కాన్సిరాం మాదిగ మేమిద్దరం మంచి మిత్రులం. ఇరువురూ కలిసి ఒకే ప్లేటులో భోజనం చేశాం. ఎస్సీలు, ఓబీసీలు కలిసి ముందుకుపోయి, యూపీలో లాగా, ఏపీలో రాజ్యాధికారం వైపు పోవాలన్నదే నా కోరిక. స్టాలిన్, సిద్ధరామయ్య, మాలయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ లు ఓబీసీ వర్గం నుంచి ముఖ్యమంత్రులయ్యారు. ఏపీలో ఓబిసి ముఖ్యమంత్రి ఎందుకు కాలేకపోయారు? రాయలసీమ వాళ్లంతా ఊడికి పోతున్నారు. చెప్పుకోలేకపోతున్నారు. 60 వేల కోట్లు రూపాయలు అమరావతి పేరుతో అప్పులు తెచ్చి, ఒకే దగ్గర ఖర్చు చేస్తున్నారు. కర్నూలు పరిస్థితి తుళ్లూరుకు రాకుండా చూసుకోవాలని, చంద్రబాబుకు సూచిస్తున్నాను.
శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు ఒక్కో జిల్లాకు 5 వేల కోట్ల రూపాయలు నిధులు ఇవ్వాలని కోరుతున్నాను. జెమిలీ ఎన్నికలతో చంద్రబాబుకే నష్టం. నాకు ఇష్టం. ఐదేళ్లు సీఎం గా ఉండాలని చంద్రబాబు కోరుకుంటున్నాడు. జగన్ మళ్లీ రాడు. ఆయన అడిగింది ఒక్క ఛాన్సే. వర్గీకరణ, సూపర్ 6 హామీలు అమలులో జాప్యం వల్ల, చంద్రబాబు చెడ్డీ ఊడిపోతావుంది. ప్రజలు ప్రత్యామ్నాయం వైపు దారిన పోయే వాళ్లు కూడా మమ్మల్ని (కాంగ్రెస్ వాళ్లను) పిలిచి మీ పార్టీనే బాగుందని అంటున్నారు. ఒకప్పుడు తూ… అన్నవాళ్లే , ఇప్పుడు రండి అని అంటున్నారు. కానీ మా కాంగ్రెస్ వాళ్లు గ్రౌండుకెళ్లడం లేదు. తిరగడంలేదు హైదరాబాదులో ఉంటున్నారు.