Suryaa.co.in

Andhra Pradesh

వివేకా కేసులో అవినాష్‌ను ఇరికించడమే చంద్రబాబు లక్ష్యం

-వివేకా కేసులో అవినాష్‌ను ఇరికించడమే చంద్రబాబు లక్ష్యం
– వైయస్ జగన్‌ను ఇబ్బంది పెట్టడమే చంద్రబాబుకు ముఖ్యం
– అందుకే ఎల్లో మీడియాతో నిత్యం విషం చిమ్మే కథనాలు
– మాజీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌‌రెడ్డి ఆగ్రహం

వైయస్‌ఆర్‌ కడప జిల్లా: వైయస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డిని ఏదోఒకలా ఇరిగించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు.

వివేకాను హత్య చేసిన నిందితులు దస్తగిరి, సునీల్‌లు చంద్రబాబు చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోయారని ధ్వజమెత్తారు. ఈ కేసులో వైయస్ అవినాష్‌రెడ్డి నిందితుడని న్యాయస్థానం తీర్పు చెబితే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని అన్నారు.

వివేకానంద‌రెడ్డి హ‌త్య జ‌రిగి ఆరేళ్ల‌యినా టీవీ సీరియ‌ల్‌ మాదిరిగా తెలుగుదేశం పార్టీ దానిని తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూనే ఉంది. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని త‌ప్పుడు క‌థ‌నాలు అచ్చేయిస్తూనే ఉంది. ఒక‌ప‌క్క కేసును సీబీఐ ద‌ర్యాప్తు చేస్తోంది, అయినా కూడా ఎల్లో మీడియా “అవినాశ్ డైరెక్ష‌న్… పీఏ కృష్ణారెడ్డి యాక్ష‌న్” అని రాస్తున్నారంటే చంద్రబాబు ఎంతగా రాజకీయ కక్షలతో ఉన్నారో అర్థమవుతోంది. ఈ ఘటనలో వైయస్ జ‌గ‌న్ వ్య‌క్తిత్వాన్ని హ‌న‌నం చేసే కుట్ర‌ల్లో భాగంగా ప‌దే ప‌దే ఎంపీ అవినాశ్ రెడ్డి మీద త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. త‌ద్వారా జ‌గ‌న్‌ని, వైయ‌స్సార్సీపీని రాజ‌కీయంగా ఇబ్బంది పెట్టాల‌నేదే వారి అసలు లక్ష్యం.

వివేకా రెండో వివాహం కోణంలో పోలీసులు విచార‌ణ చేయ‌డం లేదు. ముస్లిం యువ‌తికి పుట్టిన బిడ్డ‌ వివేకా కొడుకా? కాదా? అని డీఎన్ఏ టెస్టు ఎందుకు చేయ‌లేదు? బెంగ‌ళూరులో రియ‌ల్ ఎస్టేట్ లావాదేవీల‌కు సంబంధించిన కోణంలో కూడా విచార‌ణ చేయ‌డం లేదు. ఎంత‌సేప‌టికీ అవినాశ్ చుట్టూ ఉచ్చు ప‌న్నాల‌ని ధ్యేయం త‌ప్ప ఇంకోటి లేదు. జ‌గ‌న్‌ను ఎవ‌రైనా అభిమానిస్తే వారిని ఏదో విధంగా వేధించ‌డ‌మే చంద్ర‌బాబు ల‌క్ష్యం.

వివేకా హ‌త్య కేసును అడ్డం పెట్టుకుని తెర‌వెనుక ఉండి చంద్ర‌బాబు ఆడించే ఆట‌లో సునీత పావుగా మారిపోయారు. ఆమె ద్వారా ద‌స్త‌గిరి, సునీల్ కుమార్ కూడా చంద్ర‌బాబు చెప్పింద‌ల్లా చేస్తున్నారు. వివేకాను అత్యంత దారుణంగా న‌రికి చంపిన వ్య‌క్తుల‌తో చంద్ర‌బాబు అప్రూవ‌ర్‌గా మార్చి సెటిల్మెంట్లు చేయిస్తున్నారు. చంద్ర‌బాబు ఆడే రాజ‌కీయ క్రీడ‌లో పావుగా మారి తండ్రిని చంపిన వ్య‌క్తుల‌తో సునీత‌రెడ్డి చేతులు క‌లిపారు.

ద‌స్త‌గిరి, సునీల్ కుమార్‌ల‌కు రూ.కోట్లు ఎలా వ‌చ్చాయి?

వివేకా హ‌త్యకు ముందు ద‌స్త‌గిరి, సునీల్ కుమార్‌లు రూ. 500 కోసం కూడా చేయి చాపేవారు. అలాంటిది ఇప్పుడు కోట్ల‌కు ప‌డ‌గలెత్తి జ‌ల్సాలు చేస్తున్నారంటే వారికి ఆ డ‌బ్బులు ఎలా వ‌చ్చాయి? తాము చెప్పింద‌ల్లా చేసినందుకు, చెప్పిన మాట‌ల్ని మీడియాలో మాట్లాడినందుకు సునీత‌రెడ్డి, న‌ర్రెడ్డి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి, చంద్ర‌బాబులే వారికి డ‌బ్బులిచ్చి పోషిస్తున్నారు. వారి త‌ర‌ఫున దేశంలోనే ఖ‌రీదైన సుప్రీంకోర్ట్ న్యాయవాదులు హాజరై వాదనలు వినిపిస్తున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు సొంతకేసులను వాదించిన సుప్రీంకోర్ట్ న్యాయవాదులే వీరిద్దరి కేసులను వాదిస్తున్నారంటే దీని వెనుక ఎవరి ప్రమేయం ఉందో అందరికీ అర్థమవుతోంది. సునీత‌రెడ్డి, చంద్ర‌బాబు నాయుడు నిందితుల ప‌క్షాన నిల‌బ‌డి ప్రోత్స‌హిస్తున్నారు.

LEAVE A RESPONSE