తాగుబోతు దినోత్సవం తరుముకుంటూ వస్తున్నది,
జనవరిలో కెళ్ళేముందే …
జాన్వర్ గా మార్చేందుకు!
అంతులేని విందులతో వింతవింత కూతలతో,
బార్లల్లో బీర్లుకొట్టి బోర్లాపడి పొర్లేందుకు…!
౹౹ తాగుబోతు ౹౹
తప్పతాగి ఎంతూగినా తప్పుండదు ఆనాడు,
అప్పుచేసి పప్పుకూడు పాపిగొర్రె పాలసేగా !
తెల్లార్లూ తాగి ఊగు తెల్లోడీ వారసుడిగా,
క్లబ్బుల్లో పబ్బుల్లో కల్సిమెల్సి తిరుగొచ్చు!
సభ్యులైన వాళ్ళంతా, అభ్యుదయ వాదులంట!
౹౹ తాగుబోతు ౹౹
మనదీ కాకుంటేనేం మంచిదైనా బాగుండును,
చుక్కల గమనం చెప్పని తప్పుల క్యాలండరది!
అందమైన చంద్రుడి గతి అందుకోని క్యాలండర్,
అమావాస్య పౌర్ణమంటే, అసలేంటో తెల్వదంట!
గ్రహణం గతులిందులోన, ఎంతెతికినా అంతేగతి…
౹౹ తాగుబోతు ౹౹
బానిసత్వ పాపానికి, బహుమతిగా వచ్చిందోయ్,
భారతీయ సంస్కృతిని, బల్లిలాగ పట్టిందోయ్!
త్యాగధనులంతకల్సి తరిమికొడ్తె ఆంగ్లేయుల,
మత్తులోన ముంచివాడు మళ్ళీవస్తుండు జూడు!
౹౹ తాగుబోతు ౹౹
మత్తువదిలి మళ్ళి చూడు మనపండుగ ఉగాదిని,
ఏడాదికే కాదు అది యుగానికీ ఆదేనోయ్!
ప్రకృతితో పెనవేసిన పండుగలు మనవండీ,
విజ్ఞానం జోడించిన విలువలతో నిండెనండి!
తరతరాల వారసత్వ సంపదలుగ నిలిచెనండి !
౹౹ తాగుబోతు ౹౹
వేలయేళ్ళ కాలగణన వేళ్ళతోనే లెక్కించిరి,
ఖగోళం భూగోళం కథలతోనే వివరించిరి!
పరిణామ క్రమాన్నంత పురాణాల్లో వర్ణించిరి,
ఉగాది పచ్ఛడికే ఊ కోట్టవోయ !
తాగుబోతు పండుగను ఛీ కొట్టవోయ్ !
౹౹ తాగుబోతు ౹౹
– నర్రా భూపతిరెడ్డి